Sweet recipe: కమ్మగా క్యారట్ బాదాం హల్వా చేసేయండి, దీపావళికి సింపుల్ స్వీట్ రెసిపీ
Sweet recipe: దీపావళి పండగ రోజు క్యారట్ బాదాం హల్వా ట్రై చేయండి. చాలా సింపుల్ గా అయ్యే స్వీట్ రెసిపీ ఇది. చాలా కమ్మగా ఉంటుంది. రెసిపీ తయారీ ఎలాగో చూడండి.
క్యారట్ బాదాం హల్వా
దీపావళి పండగ సమీపిస్తోంది. పండగ రోజు రకరకాల వంటలు తప్పకుండా చేసుకుంటాం. ముఖ్యంగా స్వీట్స్ చేయాలనుకుంటే సింపుల్ గా అయిపోయే క్యారట్ బాదాం హల్వా తయారు చేసి చూడండి. ఎప్పుడూ తినే క్యారట్ హల్వా కన్నా దీని రుచి మరింత కమ్మగా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దాం.
క్యారట్ బాదాం హల్వా కోసం కావల్సినవి:
అరకేజీ క్యారట్లు
సగం కప్పు బాదాం
కప్పు పాలు
పావు కప్పు నెయ్యి
సగం కప్పు పంచదార
చిటికెడు కుంకుమపువ్వు
క్యారట్ బాదాం హల్వా తయారీ విధానం:
- ఈ క్యారట్ హల్వా కోసం క్యారట్ తురుము వాడం. క్రీమీగా ఉండే హల్వా రెసిపీ ఇది.
- ముందుగా క్యారట్ గుండ్రటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని ప్రెజర్ కుక్కర్‌లో వేసుకోండి. అందులోనే కప్పు పాలు కూడా పోసుకోండి. కాస్త కుంకుమపువ్వు కూడా వేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి.
- ఉడికిన మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోండి. తర్వాత మిక్సీలో వేసి పాలతో సహా క్యారట్ ముక్కలన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోండి.
- అలాగే బాదాం కూడా నానబెట్టుకుని తొక్కతీసి మిక్సీలో వేసి ముద్ద పట్టుకోండి.
- కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసి వేడి చేయండి. అందులో మిక్సీ పట్టిన క్యారట్ మిశ్రమం, బాదాం ముద్ద వేసి బాగా కలుపుకోండి.
- కాసేపటికి నెయ్యి అంతా వదిలిపోయి ముద్ద తయారవుతుంది. ఇప్పుడందులో పంచదార వేసుకుని బాగా కలియబెట్టండి.
- అంతా కలిసిపోయి చిక్కటి మిశ్రమం రెడీ అవుతుంది. అంచులను అంటుకోకపోతే క్యారట్ బాదాం హల్వా రెడీ అయినట్లే. దీన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే కమ్మగా ఉంటుంది.
టాపిక్