Besan Burfi: నోట్లో వేయగానే కరిగిపోయే శనగపిండి బర్ఫీ, రెసిపీ చూడండి
Besan Burfi: శనగపిండితో బర్ఫీ తింటే మీ ఫేవరైట్ స్వీట్ అయిపోతుంది. చేయడం ఎంత సులువో ఒక్కసారి రెసిపీ చూస్తే మీకే తెలుస్తుంది. తయారీకి ఎక్కువ పదార్థాలూ అక్కర్లేదు.
శనగపిండి బర్ఫీ
కమ్మగా, తక్కువ సమయంలో స్వీట్ చేయాలంటే శనగపిండి బర్ఫీ బెస్ట్ ఆప్షన్. ఇంట్లో శనగపిండి ఒక్కటుంటే చాలు అప్పటికప్పుడు దీన్ని చేసేయొచ్చు. మిగతావన్నీ మీ వంటగదిలో ఉండేవే.
శనగపిండి బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు నెయ్యి
3 కప్పుల శనగపిండి
ఒకటిన్నర కప్పుల పంచదార
పావు టీస్పూన్ యాలకుల పొడి
అరచెంచా బాదాం సన్నటి తరుగు
శనగపిండి బర్ఫీ తయారీ విధానం:
- స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోండి. చాలా తక్కువగా వేడెక్కాక అందులో శనగపిండి వేసుకోండి.
- సన్నం మంట మీద ఓపిగ్గా వాసన వచ్చేంత వరకు ఈ పిండిని వేయించండి.
- కాసేపటికి మంచి వాసనతో పాటూ, రంగు కూడా మారుతుంది.
- పది నిమిషాల్లో నెయ్యి అంచుల వెంబడి తేలినట్లు అవుతుంది.
- ఇప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి.
- మరో కడాయిలో ఒకటిన్నర కప్పు పంచదారకు ఒక కప్పు నీళ్లు తీసుకోండి. బాగా కలుపుకుని అయిదు నిమిషాలు మరగనివ్వండి. పంచదార పూర్తిగా కరిగిపోవాలి. ఒక తీగపాకం వస్తే సరిపోతుంది.
- ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసుకుని సన్నం మంట మీద కలుపుతూ ఉండండి.
- కాసేపటికి పిండి అంతా కలిసిపోయి మృదువుగా, కోవలాగా అయిపోతుంది.
- ఒక పల్లెం లేదా ట్రేలో నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని వేసుకోండి. అంతా సమంగా పర్చుకోండి.
- మీద బాదాం తరుగు చల్లుకోండి. కాస్త చల్లారి గట్టిపడ్డాక ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. శనగపిండి బర్ఫీ రెడీ.
టాపిక్