Mahashivratri 2024: శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? రాత్రికి అల్పాహారంగా వీటిని తీసుకోవచ్చు
Mahashivratri 2024: శివరాత్రి వచ్చిందంటే తెలుగిళ్లల్లో శివనామ జపం వినిపిస్తూనే ఉంటుంది. మహాశివరాత్రి పర్వదినం గురించి ఏడాదంతా వేచి ఉండేవారు ఎంతోమంది. ఆ రోజు ఉపవాస సమయంలో రాత్రికి కొన్ని రకాల అల్పాహారాలను తినవచ్చు.
Mahashivratri 2024: మహాశివరాత్రి అంటే తెలుగు వారికి పెద్ద పండగ. ఆ రోజు కోసం ఏడాదంతా ఎదురు చూస్తారు. హిందువులకు అత్యంతమైన పవిత్రమైన పండగల్లో ఈ శివుడిని ఆరాధించే వేడుక కూడా ఒకటి. ఆరోజు ప్రజలు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు, జాగారం చేస్తారు. శివునికి నైవేద్యాన్ని సమర్పించి ప్రార్థనలు నిర్వహిస్తారు. శివరాత్రి వైభవంగా ఉత్సాహంగా నిర్వహించుకుంటారు.
శివరాత్రి రోజు ఎంతోమంది ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ తినకుండా ఉండి రాత్రి అల్పాహారాన్ని భుజిస్తారు. ఎలాంటి అల్పాహారాలను తినవచ్చు. ఎలాంటి పండ్లను వారు తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు లేని ఆహారం
శివరాత్రి రోజు మీరు తినే ఆహారంలో ఉప్పు ఉండకూడదు. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి లేకుండా వండుకోవాలి. అందుకే ఎక్కువమంది ద్రవపదార్థాలు తాగేందుకు ఇష్టపడతారు. అలాగే పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. పండ్లలో కొన్ని రకాల పండ్లను కచ్చితంగా తినాలి. ఇవి ఉపవాసం చేయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు శరీరంపై పడకుండా కాపాడుతాయి. పొట్టలో గ్యాస్ వచ్చే సమస్యను కూడా అరికడతాయి. అరటిపండును కచ్చితంగా ఉపవాస సమయంలో తినాలి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, పొటాషియం ఉంటాయి. కాబట్టి పొట్ట చాలాసేపు నిండుగా ఉంటుంది. శక్తి కూడా అందుతుంది. అలాగే యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ద్రాక్ష పండ్లు తినడం వల్ల మేలు జరుగుతుంది. ఇవి కూడా తక్షణ శక్తిని అందిస్తాయి. శరీరం తేమవంతంగా ఉండేలా చూస్తాయి .
రాత్రి అల్పాహారాలు
ఇక రాత్రికి అల్పాహారాన్ని తినేవారు ఎలాంటి ఆహారాలను ఎంచుకోవాలో చూద్దాం. చిలగడ దుంపలతో రైతా చేసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచిది. దీనికోసం చిలకడదుంపలను తీసుకోవాలి. వాటిని బాగా ఉడికించి పొట్టు తీసేయాలి. సన్నగా ముక్కలుగా తరుగుకోవాలి. ఒక గిన్నెలో ఈ ముక్కలను వేసి పెరుగు వేసి బాగా గిలక్కొట్టాలి. అందులోనే పంచదార కలుపుకొని తినేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఉపవాస నియమాలను కూడా ఉంటుంది.
ద్రాక్ష పండ్లతో
ద్రాక్ష పండ్లతో రబ్డీ చేసుకుని తిన్నా కూడా మంచిదే. రబ్డీ కోసం చిక్కని పాలు తీసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు పోయాలి. పాలు బాగా మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని చిన్న మంట మీదే గంట వరకు ఉంచితే పాలు చిక్కగా మారతాయి. తర్వాత స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ద్రాక్ష పండ్లను చిన్న ముక్కలుగా కోసి చల్లారిన పాలలో కలుపుకోవాలి. అలాగే పిస్తా, బాదం ముక్కలు కూడా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది .కాసేపు ఫ్రిజ్లో పెట్టుకొని తింటే ఇంకా మంచిది.
చిలగడదుంపలు, బెల్లం...
చిలగడ దుంపలు బాగా ఉడికించుకొని చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే బెల్లం తురుమును వేసుకొని స్పూన్ తోనే బాగా కలుపుకొని తింటే ఎంతో మంచిది. బెల్లం తురుమును పాకంలా చేసుకుని ఈ చిలకడ దుంపల ముక్కల్లో కలుపుకున్నా మంచిదే. ఇలాంటివి తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. ఉపవాసం వల్ల వచ్చే నీరసం కూడా రాదు.
సాయంత్రం శివుడిని పూజించి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ఆ నైవేద్యాల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి వాడకూడదు. పాయసాన్ని వడ్డిస్తే ఎంతో మంచిది. బియ్యం పాయసం, రవ్వ పాయసం, బాదం పిస్తా పాయసం, ఫూల్ మఖానా పాయసం... ఇలా తీపిగా ఉన్న పదార్థాన్ని వడ్డించాలి. శ్రీ ఖండ్ అంటే మహా శివునికి ఎంతో ఇష్టం. దీన్ని నైవేద్యంగా సమర్పిస్తే శివుడు ఎంతో ఆనందిస్తాడని అంటారు. అలాగే కిచిడీని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే కిచిడీలో ఉప్పు వాడాల్సి వస్తుంది. నిజానికి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు ఉప్పు వేసిన ఆహారాలను తినకూడదని చెబుతారు. పాయసం వంటివి శివునికి నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మంచిది.
టాపిక్