Maha Shivaratri 2024: శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారా? ఆరోజు ఏమి తినాలో, ఏమి తినకూడదో తెలుసుకోండి
Maha Shivaratri 2024: మహాశివరాత్రి వచ్చిందంటే శివ భక్తులకు పండగే, ఆ రోజు నిష్టగా ఉపవాసం ఉండి జాగారం చేస్తారు. శివ పూజలు చేశాకే ఏదైనా తింటారు.
Maha Shivaratri 2024: మహాశివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం. ఇది రాత్రిపూట చేసుకునే పండుగ. ఉదయం శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం ఉంటారు. ఉదయం శివుడిని పూజించాకే ఉపవాసాన్ని ముగిస్తారు. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఉన్న హిందువులకు ఇది ఒక ప్రత్యేకమైన పండగ. దీన్ని గొప్ప అంకిత భావంతో నిర్వహించుకుంటారు. ఈ పండుగ అమావాస్యకు ముందు రోజు ఫాల్గుణ మాసం లేదా మాఘమాసంలో 14వ రోజున వస్తుంది. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని అంటారు. అందుకే హిందువులంతా ఆ రోజు ఉపవాసం ఉండి, జాగారం ఉంటారు. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఏడాదంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని హిందువుల నమ్మకం. అలాగే అన్ని పాపాలకు మోక్షం లభిస్తుందని, విముక్తి కలుగుతుందని నమ్ముతారు. స్కంధ పురాణం, లింగ పురాణం, పద్మ పురాణంతో పాటు అనేక పురాణాలలో ఈ మహా శివరాత్రి ప్రస్తావన ఉంది.
ఉపవాస విశేషాలు
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఉపవాసం ఉండడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతుంది. శరీరంలో, మనసులో ఉన్న వ్యర్థాలు, మలినాలు బయటికి పోతాయి. కొంతమంది భక్తులు పూర్తిగా ఆహారం, నీరు తాగకుండా ఉపవాసం చేస్తారు. మరికొందరు మాత్రం కొన్ని రకాల ఆహారాలను తింటారు. అయితే ఎలాంటి ఆహారాలు మహాశివరాత్రి రోజు తినవచ్చో, ఎలాంటి ఆహారాలు తినకూడదో తెలుసుకోవాలి.
కొన్ని రకాల ఆహారాలు ఉపవాసం చేసిన రోజు తినవచ్చు. అవి సగ్గుబియ్యము, మినుములు, గుమ్మడికాయ, బంగాళదుంపలు, పూల్ మఖానా, అరటిపండు, పెరుగు వంటివి. వీటితో చేసిన కొన్ని రకాల ఆహారాలను కొద్దికొద్దిగా తీసుకోవచ్చు. అయితే గోధుమలు, బియ్యము, కూరగాయలు, పప్పులు వంటి ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి. అయితే ఉపవాసం చేయని వారు మహాశివరాత్రి రోజు కచ్చితంగా మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వినియోగించకూడదు.
శివుడికి పెట్టాల్సిన నైవేద్యాలు
శివునికి నైవేద్యంగా కొన్ని రకాల ప్రసాదాలను పెట్టడం వల్ల అంతా మేలే జరుగుతుంది. శివుడు మనకు విజయాన్ని, శాంతిని, ఆనందాన్ని, శ్రేయస్సును అందిస్తారు. అలాంటి శివునికి బియ్యంతో వండిన ఆహారాలు పాలు, పెరుగు, గంధం, నెయ్యి, నీరు, బిల్వ పత్రాలు, ధాతుర పండు... వంటి వాటిని సమర్పిస్తే మంచిది. ముఖ్యంగా పాలతో చేసిన స్వీట్లు సమర్పించి స్వామివారికి నివేదిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
ఉపవాసం చేయడానికి ఒక రోజు ముందు నుంచే భక్తులు శివుడును ఆరాధించేందుకు తమ శరీరాన్ని మనసును సిద్ధం చేసుకోవాలి. ఆ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి రోజు తెల్లవారుజామునే లేచి, తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలి. భక్తితో శివుడిని పూజించాలి. ముఖ్యంగా శివుడిని పూజించే ముందు నీరు, పాలు, తేనె, గంగాజలంతో శివలింగాన్ని అభిషేకం చేయాలి. తర్వాత ధూప దీపాలు నివేదించాలి.
ఉపవాస సమయంలో భక్తులు పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు వంటి సాత్వికమైన ఆహారాలను తినవచ్చు. అయితే ధాన్యాలు, చిక్కులతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా నీరును తాగుతూ ఉంటే మంచిది. ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడానికి, శివున్ని మరింతగా ఆరాధించడానికి సహకరిస్తుంది .
చేయకూడని పనులు
శివుడికి కొబ్బరికాయలు కొట్టి సమర్పించేటప్పుడు కొబ్బరి నీళ్లు శివలింగంపై వేయకండి. అలాగే మీరు శివునికి సమర్పించిన దేనిని కూడా తినకూడదు. ఇది మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. శివుడిని పూజిస్తున్నప్పుడు భక్తులు కుంకుమను ధరించకూడదు. చందనాన్ని రాసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఉపవాసం చేసేటప్పుడు టీ, కాఫీలను తాగకండి. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురిచేస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం చేస్తే మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోండి. అవి అమాంతం పెరగకుండా లేక తగ్గిపోకుండా పండ్లను తినేందుకు ప్రయత్నించండి. అలాగే కప్పు పెరుగు తినడం వల్ల అంతా మంచే జరుగుతుంది. మీ పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. మహాశివరాత్రి ఉపవాసం కూడా పూర్తి చేయగలుగుతారు. ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ వంటివి తింటూ ఉండండి.
టాపిక్