Loneliness । ఒంటరిగా రావడం, పోవడం వేరే.. ఒంటరితనంతో బ్రతికితే అది నరకమే!-loneliness triggers health issues being alone can cause premature death ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Loneliness । ఒంటరిగా రావడం, పోవడం వేరే.. ఒంటరితనంతో బ్రతికితే అది నరకమే!

Loneliness । ఒంటరిగా రావడం, పోవడం వేరే.. ఒంటరితనంతో బ్రతికితే అది నరకమే!

HT Telugu Desk HT Telugu
Mar 22, 2023 11:43 AM IST

Loneliness: ఒంటరిగా ఉన్నప్పటికీ ఆనందంగా ఉండాలి, ఒంటరితనం బాధిస్తే అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఐదు తీవ్రమైన సమస్యలు రావచ్చు, అవేమిటో తెలుసుకోండి.

Loneliness
Loneliness (Unsplash)

కొంతమంది అందరితో సులభంగా కలిసిపోతారు, మరికొంత మంది ఎవరితోనూ కలవరు. వారితో వారినే జతగా కలిగి ఉంటారు, ఒంటరిగా తిరుగుతారు. మీ స్వీయ ఆనందం కోసం కొన్నిసార్లు ఒంటరిగా వెళ్లడం మంచిదే, కానీ ఒంటరితనాన్ని అనుభవించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసిక ఆరోగ్యం అలాగే శారీరక ఆరోగ్యం ఈ రెండూ పరస్పరం ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని వారు చెబుతున్నారు. అధ్యయనాల ప్రకారం, సామాజికంగా ఒంటరిగా ఉండటం లేదా ఒంటరితనాన్ని అనుభవించడం అనేక రకాల వ్యాధులను ప్రేరేపిస్తుంది, ఇది అకాల మరణానికి కూడా దారితీయవచ్చు.

ఒంటరిగా ఉండేవారు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను ఎక్కువగా అలవాటు చేసుకుంటారు. ఏం చేయాలో తోచక శారీరకంగా నిష్క్రియాత్మకంగా ఉంటారు. ఇది డిప్రెషన్, ఆందోళన, రక్తపోటు, ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు గురి చేస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒంటరితనాన్ని అనుభవించడం వలన ఇవన్నీ సమస్యలను కొనితెచ్చుకుంటున్నాడని దీని అర్థం.

Loneliness - Health Issues- ఒంటరితనంతో కలిగే తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు

అయితే ఈ ఒంటరితనం కారణంగా వ్యక్తుల్లో ముఖ్యంగా 5 అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.

1. డిస్టిమియా లేదా వ్యాకులత

ఒంటరితనం వల్ల వచ్చే ప్రధాన రుగ్మతలలో డిస్టిమియా ఒకటి. దీనితో బాధపడుతున్న వ్యక్తి ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండాలనే కోరుకుంటాడు, అయితే ఇది శారీరక వ్యాధి కాదు. డిస్టిమియా అనేది దీర్ఘకాలిక మానసిక అనారోగ్య పరిస్థితి. దీనివలన వ్యక్తుల్లో క్రమంగా ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది, తమ జీవితానికి విలువ లేదని భావిస్తారు.

2. ఆందోళన రుగ్మత

సామాజిక ఆందోళనలు కలిగి ఉన్న వ్యక్తులు ఇతరులతో సంభాషించడానికి ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే ఇది వారిలో అహేతుకమైన ఆందోళన, భయం, ఇబ్బందిని కలిగిస్తుంది. ఎక్కువగా మొహమాటస్తులు, అంతర్ముఖులు (Introverts) ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. ఇలాంటి వారు ఉద్దేశపూర్వకంగా ఇతర వ్యక్తులతో కలవకుండా అందరికీ దూరంగా ఉంటూ ఒంటరిగా ఉండిపోతారు.

3. దీర్ఘకాలిక వ్యాధులు

అధిక రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం మొదలైన సమస్యలు సాధారణంగా సామాజికంగా ఒంటరిగా ఉండే వ్యక్తులలో కనిపిస్తాయి. 29 శాతానికి పైగా గుండె జబ్బులు, 32 శాతానికిపైగా స్ట్రోక్ ఆనుభవించిన వారిలో ఒంటితనంను అనుభవిస్తున్నవారేనని పరిశోధనలలో వెల్లడైంది.

4. క్యాన్సర్

ఒంటరితనం వలన కలిగి బాధాకరమైన భావాలు, ఒత్తిడి కారణంగా హార్మోన్లలో మార్పులు జరుగుతాయని అధ్యయనాలు నిరూపించాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

5. మధుమేహం

టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తరచుగా అధిక బరువు ఉన్నవారిలో లేదా నిష్క్రియాత్మకమైన జీవనశైలిని అనుసరించే వారిలో సంభవిస్తుంది. ఒత్తిడి, ఒంటరితనం మధుమేహం వచ్చే అవకాశాలను మరింత తీవ్రతరం చేస్తాయి.

ఆర్థిక సమస్యలు, ఉన్నతంగా అభివృద్ధి దశలో, ప్రియమైన వ్యక్తి మరణం, జీవితంలో ఎదుర్కొన్న వైఫల్యాలు మిమ్మల్ని ఒంటరిగా ఉండేలా ప్రేరేపించవచ్చు. అయితే అది ఒక మానసిక సమస్యగా మారకుండా జాగ్రత్తపడాలి. ఒంటరిగా ఉండొచ్చు, కానీ ఒంటరిగా భావించవద్దు, ఒంటరితనాన్ని అనుభవించవద్దు. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని నరకప్రాయంలా మారుస్తుంది.

ఒంటరితనం అధిగమించడానికి ఏం చేయాలి?

మీరు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడితే, చాలా మంది స్నేహితులను సంపాదించడానికి ఇష్టపడని వారైతే ఒంటరితనాన్ని అధిగమించడం సాధ్యమే. మీకు నచ్చిన అర్థవంతమైన పనిలో నిమగ్నం అవడం, మీ అభిరుచికి తగినట్లు కార్యకలాపాలలో పాల్గొనడం, మీ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల ఒంటరితనం తగ్గుతుంది. ఏదైనా సామాజిక సేవలో పాల్గొనడం, క్లబ్ లేదా సమూహంలో చేరడం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను సంప్రదించడం, స్వీయ సంరక్షణ కోసం లేదా వృత్తిపరమైన అవసరాల కోసం ఇతరుల మద్దతు కోరడం ద్వారా మీ సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు.

ధ్యానం చేయడం ద్వారా మనసులోని అనవసరపు ఆందోళనలు తొలగిపోతాయి, మీకు స్పష్టమైన ఆలోచనలు కలుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందరినీ కలుపుకొనిపోవడంపై దృష్టిపెట్టడానికి మీకు మీరుగా ప్రేరణ పొందుతారు.

Whats_app_banner