Indoor plants: నీళ్లు అవసరం లేకుండా పెరిగే ఈ 5 మొక్కలు.. ఇంటి లోపల పెడితే మంచి లుక్..-list of indoor plants that grow without any water ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Indoor Plants: నీళ్లు అవసరం లేకుండా పెరిగే ఈ 5 మొక్కలు.. ఇంటి లోపల పెడితే మంచి లుక్..

Indoor plants: నీళ్లు అవసరం లేకుండా పెరిగే ఈ 5 మొక్కలు.. ఇంటి లోపల పెడితే మంచి లుక్..

Koutik Pranaya Sree HT Telugu
Published Jun 30, 2024 02:30 PM IST

Indoor plants: ఇంటిని అలంకరించడానికి చాలా మంది మొక్కలు నాటడానికి ఇష్టపడతారు. కానీ సరైన మొక్కలు నాటకపోతే అవి చాలా త్వరగా కుళ్లిపోతాయి. ఇంటి లోపల నాటడానికి చక్కగా సరిపోయే 5 రకాల మొక్కలు ఏంటో చూడండి. వీటికి నీళ్లు కూడా ఎక్కువగా అవసరం లేదు.

నీళ్లు తక్కువగా అవసరమయ్యే మొక్కలు
నీళ్లు తక్కువగా అవసరమయ్యే మొక్కలు (Shutterstock)

ఇంటిని అలంకరించడానికి వివిధ రకాల వస్తువులను వాడతారు. కానీ మొక్కల వల్ల ఇంటికి వచ్చే లుక్ వేరు. ఇంటి లోపల నాటిన మొక్కలు మీ డ్రాయింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ కు అందాన్ని చేకూరుస్తాయి. అయితే ఇంటిలోపల అవగాహన లేకుండా మొక్కలు పెట్టేస్తే అవి చాలా త్వరగా ఎండిపోతాయి. తక్కువ నీరు, సూర్యరశ్మి అవసరమయ్యే మొక్కలు నాటితేనే ఇంటిలోపల కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. అలాంటి మొక్కలేంటో చూడండి.

బెగోనియా:

బెగోనియా మొక్కలకు పెద్ద ఆకులు ఉంటాయి. ఏ గదిలో పెట్టినా దృష్టిని ఆకర్షిస్తాయి. వీటికి ఎక్కువ నీరు అవసరం లేదు. నీరు ఎక్కువగా పోస్తేనే ఈ మొక్కలు కుళ్లిపోతాయి. కాబట్టి ఆకులు కాస్త తాజాదనం కోల్పోతున్నాయనిపిస్తేనే, మట్టి పొడిబారితేనే కొన్ని నీళ్లు పోస్తే చాలు.

సక్యులెంట్ ప్లాంట్:

సక్యులెంట్స్ చూడ్డానికి చిన్నగా, ముద్దుగా, చిన్న కుండీల్లో ఉంటాయి. ఇంట్లో టేబుల్ టాప్, టీవీ దగ్గర ఎక్కడ పెట్టినా ప్రత్యేకంగా కనిపిస్తాయి. వీటిని వారానికి ఒకసారి నీళ్లు పోసినా సరిపోతుంది. ఇంట్లో పెట్టుకోడానికి ఈ మొక్కలు ఉత్తమ ఎంపిక. రకరకాల ఆకుల ఆకారాలతో, రంగులతో ఇవి అందుబాటులో ఉంటాయి.

పోనీటైల్ పామ్:

మందపాటి కాండం ఆకారం నుండి వచ్చే సన్నని ఆకుల కారణంగా ఈ మొక్కకు పోనీటైల్ పామ్ అనే పేరు వచ్చింది. అయితే, దీన్ని కొంత సూర్యరశ్మి తగిలే చోట ఉంచాలి. కిటికీల దగ్గర, కాస్త ఎండ సోకే ప్రాంతంలో పెడితే బాగా పెరుగుతుంది. మట్టి పొడిబారినప్పుడు నీళ్లు పోస్తే సరిపోతుంది.

పోథోస్:

మొక్కలు పెంచడం కొత్తగా మొదలు పెట్టాలనుకునేవాళ్లకు పోథోస్ మొక్క బాగుంటుంది. తక్కువ వెలుతురు అవసరం. కాబట్టి ఆఫీసుల్లో, ఇంటి లోపల ఎక్కడైనా, విశాలమైన బాత్రూంలలో ఒక మూలకి కూడా పోథోస్ మొక్క పెంచుకోవచ్చు.

స్నేక్ ప్లాంట్:

నీరు పోయకుండా కూడా చాలా వారాల పాటు ఆరోగ్యంగా ఉంటాయి స్నేక్ ప్లాంట్స్. వీటిని ఇంటి లోపల నాటితే చాలా రోజుల వరకు వాడిపోకుండా తాజాగా, పచ్చగా ఉంటాయి. ఇంటికి ప్రత్యేక లుక్ ఇస్తాయి.

 

 

Whats_app_banner