Okra Benefits | కళ్ల ఆరోగ్యానికి బెండకాయ తినాలట, మరిన్నో ప్రయోజనాలు కూడా!
కొంతమంది బెండకాయ జిగురుగా ఉంటుందని తినరు. అయితే కంటి చూపు మెరుగుపడాలన్నా, బరువు తగ్గాలన్నా, ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ కూరగాయను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తింటే అసలు అనారోగ్య సమస్యలే ఉండవు. మనం తినే ఆహారం మన స్వభావం, అలాగే మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. సీజన్ కు తగినట్లుగా ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు తింటూ ఉంటే శరీరానికి అవసరమయ్యే పోషకాలు సులభంగా లభించడంతో పాటు అనేక వ్యాధుల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇదిలా ఉంటే, ఇటీవల కాలంలో కంటి సమస్యలు కూడా చాలా మందికి ఎక్కువయ్యాయి. రోజులో ఎక్కువ భాగం మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లకే అతుక్కుపోవటం ఇతరత్రా కారణాల చేత చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి స్క్రీన్ టైంను వీలైనంత తగ్గించటంతో పాటు కంటి చూపును పెంచే ఆహారాలు తీసుకోవాలి.
కొన్ని అధ్యయనాలలో బెండకాయ కంటిచూపుతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది అని పేర్కొన్నారు. బెండకాయలో లుటిన్, జియాక్సంతిన్, మీసో-జియాక్సంతిన్ అనే మూడు రకాల కెరోటినాయిడ్లు ఉన్నాయి. ఇది కంటిలోని అత్యంత సున్నితమైన భాగంలో మాక్యులాలోని వర్ణద్రవ్యాన్ని ఏర్పరుస్తుంది. అలాగే మిలియన్ల కొద్దీ ఫోటోరిసెప్టర్ కణాలను రక్షిస్తుంది. రెటీనాను కాపాడుతుంది అని పేర్కొన్నారు.
బెండకాయ తినడం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.
కళ్లకు మేలు చేస్తుంది
బెండకాయ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కంటికి సంబంధించిన అనేక రకాల సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది వరకు చెప్పినట్లుగా బెండకాయలో కెరోటినాయిడ్స్ రేచీకటి, కంటిశుక్లం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు అవసరమైన పోషకం.
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ
బెండకాయలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదర సమస్యలను నివారిస్తుంది. అలాగే సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి, ప్రేగు కదలికను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బెండకాయలోని ఈ డైటరీ ఫైబర్ ఒక సహజమైన యాంటాసిడ్ గా పనిచేస్తుంది. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అజీర్ణం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది
తక్కువ -గ్లైసెమిక్ సూచిక కలిగి ఉండటం కారణంగా బెండకాయ తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బెండకాయలో మైరిసెటిన్ అనే పదార్ధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి, ఇది కండరాల ద్వారా చక్కెరను గ్రహించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం కోసం బెండకాయ తినాలి.
అధిక బరువు తగ్గించుకోవచ్చు
బెండకాయలో కేలరీలు తక్కువ ఉంటాయి, కరిగిపోయే డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి అధిక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు ఆహరంలో బెండకాయ చేర్చుకోవాలి. బెండకాయ తిన్నప్పుడు మీరు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉంటారు. ఇది అతిగా తినాలనే కోరికను నిరోధిస్తుంది, తద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం