Sudhamurthy: కాశీలో సుధామూర్తి ఏం వదిలేశారో తెల్సా? దాన్నుంచి నేర్చుకోవాల్సిన విషయమిదే..-know why sudhamurthy has not brought saree in last 30 years ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sudhamurthy: కాశీలో సుధామూర్తి ఏం వదిలేశారో తెల్సా? దాన్నుంచి నేర్చుకోవాల్సిన విషయమిదే..

Sudhamurthy: కాశీలో సుధామూర్తి ఏం వదిలేశారో తెల్సా? దాన్నుంచి నేర్చుకోవాల్సిన విషయమిదే..

Koutik Pranaya Sree HT Telugu
Jul 05, 2024 04:30 PM IST

Sudhamurthy: కాశీకి వెళ్లినప్పుడు మనకు నచ్చిందేదైనా ఒకటి వదిలిపెడతారు. కూరగాయలు కొందరు, పండ్లు కొందరు.. ఇలా ఇష్టాన్ని బట్టి వదిలేస్తారు. సుధామూర్తి అందుకు భిన్నం. ఆమె కాశీలో ఏం వదిలిపెట్టారో చూడండి.

సుధామూర్తి
సుధామూర్తి (instagram)

ఇన్ఫోసిస్ చైర్ పర్సన్, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి తన మాటలతో, సమాధానాలతో ఎవరినైనా కట్టిపడేయగలరు. ఇంత పెద్ద సంస్థకు పెద్ద హోదాలో ఉన్నాకూడా తన ఆహార్యం చాలా సాదాసీదాగా ఉంటుంది. ఎప్పుడూ చీరకట్టులోనే కనిపిస్తారు. అందులోనూ సింపుల్ గా ఉండే కాటన్ చీరలోనే ఎక్కువగా కట్టుకుంటారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆమె ఒక విషయం పంచుకున్నారు. తను గత ముప్ఫై సంవత్సరాలలో ఒక్క చీర కూడా కొనలేదట. దానికి కారణమేంటో చూడండి..

చీరలెందుకు కొనలేదంటే..

దానికి కారణమేంటో సుధామూర్తి చెప్పారు.. “కాశీలో గంగానదిలో పవిత్ర స్నానం చేశాక మీకిష్టమైనది ఏదైనా వదిలిపెట్టేయాలని చెబుతారు. నేను షాపింగ్ వదిలిపెట్టేశాను. ముఖ్యంగా చీరలు కొనడం మానేశాను. కేవలం నాకు అత్యవసరమైన వాటిని మాత్రమే కొనుక్కుంటాను” అని చెప్పారామె. ఈ ప్రతిజ్ఞతో సాదారణ జీవితాన్ని అవలంబించడం, ధార్మికత రెండూ ఆమె నిబద్దతను ప్రతిబింబిస్తాయి.

చీరలు కాదు.. పుస్తకాలు:

అమ్మాయిలకు సాధారణంగా వయసుతో సంబంధం లేకుండా షాపింగ్ చేయడం అన్నా, బట్టలు కొనడం అన్నా ప్రత్యేక ఇష్టం ఉంటుంది. సుధామూర్తి ఈ ప్రతిజ్ఞ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా చీరలు కొనడం మానేశారు. బదులుగా ఆమె దగ్గర 20000 కు పైగా పుస్తకాలు ఉన్నాయని గర్వంగా చెబుతారామె. వస్తుప్రీతికన్నా తెలివి తేటలు పెంచే ఆస్తులకు ఆమె ఇచ్చే విలువ ఇది తెలియజేస్తుంది. సుధామూర్తికి చీరలన్నీ తన సోదరి, క్లోజ్ ఫ్రెండ్స్..  బహుమతిగా ఇస్తుంటారు. వాటినే ఎప్పుడూ కట్టుకుంటారామె.

పురస్కారాలు:

సమాజానికి సుధామూర్తి చేస్తున్న సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది. 2023లో పద్మ భూషన్ అందుకున్నారు. కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సుధామూర్తి తండ్రి పేరు ఆర్.హెచ్.కులకర్ని, తల్లి విమల కులకర్ని. తండ్రి సర్జన్ అయితే తల్లి స్కూల్ టీచర్. సుధామూర్తికి ఇద్దరు పిల్లలు కూతురు అక్షతామూర్తి, కుమారుడు రోహన్ మూర్తి.

మనమేం నేర్చుకోవచ్చు?

ఒక వ్యక్తి ఆహార్యాన్ని బట్టి ఎవర్నీ అంచనా వేయకూడదు. అనవసరంగా ఆడంబరంగా కనిపించడానికి మన తాహతును బట్టి ఖర్చు పెట్టకూడదు. దానివల్ల పూర్తిగా నష్టపోయేది మనమే. ఎదుటివ్యక్తిని మోసం చేయాలని చూస్తే మనమే స్వతహాగా మోసపోతాం. లుక్స్ కన్నా, మనం వేసుకునే బట్టల కన్నా తెలివితేటలు, మంచి మనస్తత్వం, మంచితనం ముఖ్యం. అవే మనిషికి గొప్ప ఆభరణాలు. వాటిని అలవరుచుకుంటే సమాజంలో గౌరవం దానంటత అదే వస్తుంది. దానికోసం పాకులూడి చేయకూడని తప్పుల జోలికి పోవద్దు.

 

WhatsApp channel