8 Shape walking: 8 ఆకారంలో వాకింగ్ చేస్తే.. మామూలు నడకతో పోలిస్తే లాభాలు రెట్టింపు..
8 Shape walking: 8 ఆకారంలో నడవడం వల్ల మెదడు, శరీరం రెండింటిమీద దృష్టి పెట్టాలి. దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరంగా తెల్సుకోండి.
వాకింగ్ అంటే అలా ఒకదారి పొడవునా నడుస్తూ వెళ్తాం. కానీ 8 ఆకారంలో నడవటం వల్ల అనేక లాభాలున్నాయి. 8 అనే అంకెను అడ్డుగా చూస్తే ఇన్ఫినిటీ గుర్తులాగా ఉంటుంది. అందుకే దీన్ని ఇన్ఫినిటీ వాక్ అనికూడా అంటారు. దీనివల్ల కలిగే లాభాలు కూడా అనంతమే మరి. అసలు ఎనిమిది ఆకారంలో ఎలా నడవాలి? దాని పూర్తి లాభాలేంటో చూడండి.
8 ఆకారంలో ఎందుకు నడవాలి?
ఈ ఆకారంలో నడవటం వల్ల శారీరక లాభాలతో పాటూ మానసిక లాభాలు పొందొచ్చు. మీరు నడుస్తున్నప్పుడు ఒక ఊహాజనిత ఎనిమిది ఆకారాన్ని సృష్టించుకోవాలి. భూమి మీద అడ్డంగా ఒక ఎనిమిది ఆకారం గీసి ఉన్నట్లు అనుకోవాలి. ఎనిమిది రాస్తున్నప్పుడు మీ చేతు ఎలా కదులుతుందో అదే విధంగా మలుపులు తీసుకుంటూ, సున్నాలు పూర్తిచేస్తూ మీరు అడుగులు వేయాలి. దాని వెంబడే నడుస్తూ ఉండాలి. మెళ్లిగా వేగం పెంచుతూ ఎనిమిది ఆకారంలో నడవాలి. అలా నడుస్తూ ఉండాలి. అంతే.!
మామూలుగా నడిస్తే సరిపోతుంది కదా.. ఇలా ఎందుకు నడవాలనే సందేహం రావచ్చు. 2018లో ప్రచురించిన జర్నల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో దీనివల్ల చాలా లాభాలున్నాయని తేలింది. ఇది నడకకు ఒక కొత్త విశేషాన్ని చేరుస్తుంది. వివిధ కండరాలు, కీళ్లు పనిచేసేలా చేస్తుంది. నడకే అయినా ఇదొక చిన్నపాటి వ్యాయామంలా పనిచేస్తుంది.
8 ఆకారంలో నడవటం వల్ల లాభాలు:
1. బీపీ అదుపులో ఉంటుంది
అధిక రక్తపోటు సమస్య ఎదుర్కునే వాళ్లు ఎనిమిది ఆకారంలో నడవటం వల్ల లాభాలుంటాయట. ఈ విషయం 2018 లో పబ్లిష్ అయిన జర్నల్ ఒకటి చెబుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఈ ఆకారంలో నడవటం వల్ల గుండె మీద భారం తగ్గుతుంది.
2. ఒత్తిడి తగ్గుతుంది:
మామూలుగా నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎనిమిది ఆకారంలో క్రమబద్ధంగా నడవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. నడిచే ఆకారం మీద దృష్టి పెట్టడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.
3. కండరాల పనితీరు:
తిన్నగా నడవటం వల్ల కన్నా ఎనిమిది ఆకారంలో నడిచినప్పుడు ఎక్కువ కండరాలు పనిచేస్తాయి. కాస్త వంగుతూ తిరగడం వల్ల వీపు, పొట్ట దగ్గర కండరాలకు పని పడుతుంది. వంకరగా ఉన్న మలుపు దగ్గర కాళ్లను వేరేలాగా తిప్పాల్సి రావడం వల్ల ఎక్కువ కండరాలు పనిచేస్తాయి.
4. సమన్వయం:
ఎనిమిది ఆకారంలో నడవడానికి మెదడు శరీరం సమన్వయంలో ఉండాలి. మలుపులు తిరిగేటప్పుడు సమన్వయం లేకపోతే నడవటం కష్టం. దీనివల్ల శరీర సమన్వయం పెరుగుతుంది.
8 ఆకారంలో నడక ఎవరు చేయకూడదు:
ఎనిమిది ఆకారంలో నడవటం వల్ల ఎలాంటి ప్రమాదం దాదాపుగా ఉండదు. కానీ కొందరు మాత్రం జాగ్రత్త పడాల్సిందే. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, కడుపుతో ఉన్న మహిళలు వైద్యులని సంప్రదించాకే ఈ ఆకారంలో నడవాలి. అలాగే ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మూలల్లో కాస్త వంగుతూ నడుస్తాం. దానివల్ల కొందరిలో తల తిరగడం, వికారం లాంటి సమస్యలు రావచ్చు. ఇవన్నీ గమనించుకోవాలి.
టాపిక్