Vitamin B12 Deficiency: విటమిన్‌ బీ12 లోపాన్ని గుర్తించవచ్చిలా!-know what are the symptoms of vitamin b12 deficiency ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitamin B12 Deficiency: విటమిన్‌ బీ12 లోపాన్ని గుర్తించవచ్చిలా!

Vitamin B12 Deficiency: విటమిన్‌ బీ12 లోపాన్ని గుర్తించవచ్చిలా!

Koutik Pranaya Sree HT Telugu
Oct 31, 2023 05:29 PM IST

Vitamin B12 Deficiency: శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే అది కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తుంది. ఆ సూచనలేంటో తెలుసుకుని జాగ్రత్తపడటం అతిముఖ్యం.

విటమిన్ బి12 లోపం లక్షణాలు
విటమిన్ బి12 లోపం లక్షణాలు

విటమిన్‌ బీ 12 అనేది మన శరీరంలో చాలా కీలకంగా పని చేస్తుంది. మనలో జీవ క్రియ సరిగ్గా జరగాలన్నా, ఎముక మజ్జ నుంచి ఎర్ర రక్త కణాలు సరిగ్గా ఉత్పత్తి కావాలన్నా, మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయాలన్నా, రక్త హీనత లేకుండా ఉండాలన్నా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. మాంసం, చేపలు, పీతలు, సోయాబీన్‌, ఎర్రటి మాంసాలు, గుడ్లు, పాలు, తృణ ధాన్యాలు.. తదితరాల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. అయితే కొందరు సమతుల ఆహారాన్ని తీసుకోకపోతే ఈ బీ12 విటమిన్‌ లోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని తెలిపేందుకు మన శరీరం కొన్ని సూచనలను చేస్తూ ఉంటుంది. మరి విటమిన్‌ బీ 12 లోపాన్ని సూచించే మన శరీర లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీ12 లోపం లక్షణాలు:

  • మన శరీరంలో విటమిన్‌ బీ12 లోపం ఉంటే నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది. నొప్పి పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. నోటి పూతతోనూ కొందరు ఇబ్బంది పడతారు. సరిగ్గా రుచి తెలియదు.
  • కొందరిలో ఆకలి తగ్గిపోతుంది. ఏదీ తినాలని అనిపించదు. పొట్ట ఉబ్బరంగా, పట్టేసినట్లుగా ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది.
  • కొందరిలో చూపు మందగిస్తుంది. దృష్టి లోపాలు ఏర్పడతాయి. తల నొప్పులు ఇబ్బంది పెడతాయి.
  • కొందరికి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక్కసారిగా వేగంగా శ్వాస తీసుకోవడం, ఆయాసం రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • ఎక్కువగా పనులేవీ చేయకపోయినా అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది.
  • గుండె కొట్టుకునే రేటు ఒక్కోసారి పెరిగిపోతుంది. దీంతో లోపల నుంచి దడ దడగా ఉన్నట్లు అనిపిస్తుంది.
  • జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఏదో చెబుదామనుకున్నా ఆ విషయాలను మర్చిపోతూ ఉంటారు. ఏ విషయాన్నీ పూర్తిగా అర్థం చేసుకోలేరు. తగినట్లుగా నిర్ణయాలు తీసుకోలేరు. మెదడుకు ఓ రకమైన మొద్దుతనం వచ్చేస్తుంది.
  • ఒళ్లంతా సూదులు గుచ్చినట్లు చురచురలాడుతుంది.
  • కొందరిలో కొద్ది మోతాదులో ఆందోళన, నిరాశ లాంటివి తలెత్తుతాయి. వీటి వల్ల ఎంతో ఒత్తిడికి లోనైనట్లుగా ఉంటారు.
  • ఎక్కువ కాలం ఈ లోపంతో ఉన్న వారికి కండరాలు బలహీనం అవుతాయి. సరిగ్గా నడిచేందుకు కూడా ఇబ్బంది పడతారు.
  • చర్మం పాలిపోయినట్లుగా తయారవుతుంది. అనీమియా లక్షణాలను అది సూచిస్తుంది. బరువు కోల్పోతారు.

ఈ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. చికిత్స ప్రారంభించుకోవాలి.

Whats_app_banner