Walking shoe: వాకింగ్ షూ ఎలా ఉండాలి? షూ ఇలా లేకపోతే పాదాల నొప్పులు తప్పవు..-know tips on how to select best shoes for walking ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walking Shoe: వాకింగ్ షూ ఎలా ఉండాలి? షూ ఇలా లేకపోతే పాదాల నొప్పులు తప్పవు..

Walking shoe: వాకింగ్ షూ ఎలా ఉండాలి? షూ ఇలా లేకపోతే పాదాల నొప్పులు తప్పవు..

Koutik Pranaya Sree HT Telugu
Jul 01, 2024 08:00 AM IST

Walking shoe: వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి షూ ఎంచుకోవాలో తెలియక పోతే పాదాలు, కాళ్ల నొప్పులు మొదలవుతాయి. సరైన షూ ఎంపిక ఎలా చేసుకోవాలో చూసేయండి.

వాకింగ్ షూ
వాకింగ్ షూ (freepik)

వాకింగ్ చేయడం మొదలు పెట్టాక కొన్ని రోజులకే కొంతమందిలో మడిమలో నొప్పి, కాళ్లలో నొప్పి రావడం గమనిస్తుంటాం. మన దృష్టంతా వాకింగ్ మీదే ఉంటుంది కానీ.. మనం వేసుకునే షూల గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. షూ సరిగ్గా లేకపోతే కూడా మడిమ నొప్పులు రావచ్చు. ఆరోగ్యం కోసం వాకింగ్ మొదలుపెట్టి మరో సమస్య తెచ్చుకోకుండా ఉండాలంటే.. మీరు వాకింగ్ చేసేటప్పుడు వేసుకునే షూ విషయంలో అజాగ్రత్త అస్సలు వద్దు. మీకు నప్పే పర్ఫెక్ట్ వాకింగ్ షూలు ఎలా ఎంచుకోవాలో చూసేయండి.

షూ మరీ వదులుగా ఉంటే పాదం అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. బిగుతుగా ఉంటే అడుగు వేసినప్పుడళ్లా నొప్పిగా అనిపిస్తుంది. అందుకే సరైన షూలు ఎంచుకోవడం ముఖ్యం. కొద్దిగా వదులుగా ఉంటే షూ లేసులు కట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ మరీ బిగుతుగా మాత్రం ఉండకూడదు. మీరు ఇదివరకు వాకింగ్ కోసం వాడిన షూ బ్రాండ్ ఏదైనా మీకు సరిగ్గా ఫిట్ అయితే దాన్నే మళ్లీ మళ్లీ కొనుక్కోవడం మంచిది.

సరైన సైజ్ అంటే ఏంటి? ఎంత గ్యాప్ ఉండొచ్చు?

షూ ముందు భాగంలో.. అంటే టో బాక్స్ దగ్గర ఇరుగ్గా ఉండకూడదు. మీరు కాలి వేళ్లను సౌకర్యంగా కదల్చగలగాలి. అలాని వదులుగా ఉండకూడదు. షూ పొడవు పరంగా చూస్తే.. మీ బొటన వేలి తర్వాత షూ ముందు భాగంలో సగం ఇంచు ఖాళీ అయినా ఉండాలి. షూ వేసుకున్నాక ముందు భాగంలో చేత్తో ఒత్తి చూడండి. కాస్త ఖాళీ ఉండాలి. లేదంటే తర్వాతి సైజు ఎంచుకోవడమే.

ఇక వెడల్పు విషయానికొస్తే.. మీ పాదాలు కాస్త వెడల్పు ఎక్కువగా ఉంటే వైడ్ సైజ్ ఆప్షన్ ఉన్న షూలుంటాయి. వాటిని ఎంచుకోండి. లేదంటే మీకు పట్టని షూలలో పాదాలు ఇరికిస్తే పాదాల నొప్పులు రావడం ఖాయం. అలాగే మీరు రోజూవారీ ఉపయోగించే సాక్సులు వేసుకుని షూ సైజు చెక్ చేసుకోండి. దాంతో సాక్స్ మందాన్ని బట్టి కూడా షూ సైజులో వచ్చే మార్పు సులభంగా తెలుస్తుంది.

అవుట్ సోల్:

షూ వేసుకున్నప్పుడు భూమిని తాకే అవుట్ సోల్ భాగం కూడా చూసుకుని షూ కొనుగోలు చేయాలి. అవి మంచి గ్రిప్ ఇవ్వగలగాలి. వాటిమీద ఎగుడు దిగుడుగా ఉండే గ్రూవ్స్ ఉండాలి. వాటివల్ల మంచి గ్రిప్ దొరుకుతుంది. ఫ్లాట్‌గా చదునుగా ఉన్న అవుట్ సోల్ వల్ల జారి పడిపోయే ప్రమాదం ఉంటుంది.

కుషనింగ్:

మీ పాదం షూ లోపలి బాగానికి తాకే దగ్గర సరైన కుషనింగ్ ఉండాలి. షూ కొనేటప్పుడు లోపలి భాగంలో ఫోమ్, లేదా జెల్ తో చేసిన కుషనింగ్ ఉందేమో చూడండి. వీటివల్ల మరింత సౌకర్యంగా ఉంటుంది. మీరు నడుస్తున్నప్పుడు పాదాల మీద ఎక్కువ ప్రభావం పడకుండా ఈ కుషనింగ్ చూస్తుంది.

వీటితో పాటే షూ ముందు, వెనక పట్టుకొని ఒకసారి మలిచినట్లుగా చేసి చూడండి. అవి సులువుగా తిరిగిపోకుండా కాస్త గట్టిగానే ఉండాలి. షూ వెనగ భాగాన్ని హీల్ కౌంటర్ అంటారు. అంటే మీ పాదం వెనకవైపు తగిలే చోటు. ఇది కూడా మీ పాదం వెనక భాగానికి అతుక్కుని ఉండాలి .కాలు పైకి కిందికి లేపినప్పుడు బిగుతుగా అనిపించకూడదు.