Ooty tourist places: ఊటీలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే..
Ooty tourist places: ఊటీ టూర్ ఒక్కసారైనా వెళ్లాలని అందరికీ ఉంటుంది. ఒకవేళ మీరు ఊటీ టూర్ ప్లాన్ చేస్తే ఈ సందర్శనీయ స్థలాలను తప్పక చూడండి.
క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్‌గా పేరున్న ఊటీ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఊటీ అందమైన దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అనేక ఆకర్షణలకు ప్రాచుర్యం పొందింది. ఊటీ సుందరమైన ప్రకృతి దృశ్యాలు, తేయాకు తోటలు, కలోనియల్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి చెందింది.
పర్యాటకులకు ఊటీ స్వర్గధామం. మీ టూర్ మధురమైన అనుభూతిగా మిగిల్చేందుకు ఇక్క అనేక ఆకర్షణలు, యాక్టివిటీస్ అందుబాటులో ఉంటాయి. ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, షాపింగ్, డైనింగ్ వంటి అన్నింటిలో ఊటీ ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఊటీలో సందర్శించాల్సిన కొన్ని ప్రదేశాలు మీకోసం..
ఊటీ బొటానికల్ గార్డెన్:
ఊటీలో బొటానికల్ గార్డెన్ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. విభిన్న రకాలు మొక్కలు, పుష్పాలకు ప్రసిద్ధి. ఆర్కిడ్స్, రోజెస్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ గార్డెన్‌లోనే లేక్ ఉంటుంది. చిన్న జూ ఉంటుంది. ఒక గ్రీన్ హౌజ్ కూడా ఉంటుంది. అక్కడ ఉండే చిన్న రైలులో సందర్శకులు రైడ్ చేయొచ్చు.
ఊటీ లేక్:
ఊటీలో ఊటీ లేక్ కూడా అత్యంత ఆకర్షణీయమైన స్పాట్. కృత్రిమ సరస్సే అయినప్పటికీ చాలా విశాలంగా ఉంటుంది. చుట్టూ పచ్చదనం పరుచుకుని ఉంటుంది. అనేక రకాల చెట్లు ఉంటాయి. పర్యాటకులు బోట్ రైడ్ ఎంజాయ్ చేయొచ్చ. ఈ ప్రకృతి రమణీయమైన ప్రాంతంలో సేద దీరవచ్చు. సరస్సు చుట్టూ షికారు చేయొచ్చు.
ఊటీ దొడ్డబెట్ట శిఖరం:
నీలగిరి కొండల్లో దొడ్డబెట్ట శిఖరం అత్యంత ఎత్తైన శిఖరం. చుట్టూ ఉండే కొండలు, లోయల అందాలను ఈ శిఖరం నుంచి చూడొచ్చు. పర్యాటకులు ట్రెక్కింగ్ చేయొచ్చు. రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూడొచ్చు.
పైకారా లేక్
నీలగిరి కొండల్లో ఉండే పైకారా లేక్ చాలా అందంగా ఉంటుంది. దీని చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి. చుట్టూ ఉన్న కొండల వల్ల ఇక్కడి ప్రకృతి ఆకట్టుకుంటుంది. టూరిస్టులు బోటింగ్, ఫిషింగ్ ఎంజాయ్ చేయొచ్చు.
ఊటీ ముదుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
ముదుమలై వైల్డ్‌లైఫ్ వన్యప్రాణుల అభయారణ్యం వన్యప్రాణి ప్రేమికులకు ఇష్టమైన గమ్యస్థానం. పులులు, ఏనుగులు, చిరుతలు, జింకలు సహా అనేక రకాల జంతువులకు ఇది నిలయం. సందర్శకులు సఫారీ రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రైడ్‌లో జంతువులను అవి సంచరించే ప్రాంతాల్లోనే చూడొచ్చు.
ఊటీ రోజ్ గార్డెన్:
ఊటీలో రోజ్ గార్డెన్ ఒక పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్. విభిన్న రకాల గులాబీ పూలకు ఇది నిలయం. హైబ్రీడ్ వెరైటీలు అనేకం ఉంటాయి. రోజ్ పికింగ్, బర్డ్ వాచింగ్, ఫోటోగ్రఫీ వంటి యాక్టివిటీస్ ఇక్కడ చేయొచ్చు.
ఊటీ టూర్‌లో షాపింగ్
ఊటీ షాపింగ్‌కు కూడా ప్రసిద్ధి. సావనీరర్స్, హస్తకళలు అనేక రకాలుగా లభిస్తాయి. సరసమైన ధరలకే వస్తువులను అమ్మే అనేక షాపులు ఈ నగరంలో ఉంటాయి. అలాగే తేయాకు, సుగంధ ద్రవ్యాలు, హాండీక్రాఫ్ట్స్ ఎక్కువగా అమ్ముడవుతుంటాయి.
ఊటీలో ప్రత్యేక వంటకాలు
ఊటీలో డైనింగ్ ఆప్షన్స్ కోకొల్లలు. స్థానిక వంటకాల నుంచి అంతర్జాతీయ వంటకాల వరకు లభిస్తాయి. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ ఫుడ్ లభిస్తుంది.
ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఊటీలోని కొన్ని విజిటింగ్ ప్లేసెస్ గురించి మాత్రమే. అడ్వెంచర్ కోసమైనా, రిలాక్సేషన్ కోసమైనా ఊటీ అందరినీ ఆకట్టుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఊటీ ట్రిప్ ప్లాన్ చేసేయండి.