Rainbow Eucalyptus | సప్తవర్ణాల నీలగిరి వృక్షం.. ఆశ్చర్యపోతున్న జనం!
పచ్చని అడవంతా ఇంద్ర ధనస్సు రంగులతో నిండిపోతే ఆ దృశ్యం ఎలా ఉంటుంది? సప్తవర్ణాలు కలిగిన నీలగిరి వృక్షాలతో ఆ అద్భుత దృశ్యం సాక్షాత్కారమవుతుంది. ఆ వివరాలు ఇవిగో..
పచ్చని అడవిని చూస్తే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది? ఆకాశంలో ఏడురంగుల ఇంద్ర ధనస్సును చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది? ఈ రెండు కలిసిపోయి అడవంతా ఇంద్ర ధనస్సు రంగులతో నిండిపోతే ఆ దృశ్యం ఎలా ఉంటుంది? మాటలకందని మహాద్భుతం అది, కాదంటారా? కానీ నిజంగా అలాంటి దృశ్యం ఉంటుందా అంటే కచ్చితంగా ఉంటుంది. ప్రకృతికి సాధ్యం కానిదేది లేదు. మనం చూడని ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యాలను ప్రకృతి తన ఒడిలో నింపుకొని ఉంటుంది.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక అద్భుతం గురించే. ఆ అధ్బుతం పేరే 'రెయిన్‌బో యూకలిప్టస్' తెలుగులో చెప్పాలంటే సప్తవర్ణాల నీలగిరి వృక్షం.
నీలగిరి చెట్టు గురించి మనందరికీ బాగా తెలిసిందే. దీని ఆకుల రసం సువాసన వస్తుంది. దీనిని ఔషధ వృక్షంగా కూడా పరిగణిస్తారు. అయితే ఇందులోనే రెయిన్‌బో యూకలిప్టస్ అనే రకం కూడా ఉంది. భారత ఫారెస్ట్ అధికారి సుశాంత నందా (IFS) ఈ వృక్షాలకు సంబంధించిన ఫోటోలు తన ట్విట్టర్లో షేర్ చేయడంతో అవి నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే రెయిన్‌బో యూకలిప్టస్ వృక్షం పేరుకు తగ్గట్లుగానే సప్తవర్ణాలతో తళతళమెరుస్తుంది.
రెయిన్‌బో యూకలిప్టస్ శాస్త్రీయ నామం యూకలిప్టస్ డెగ్లుప్టా. దీనిని మిండనావో గమ్ లేదా రెయిన్‌బో గమ్ లేదా ఇంద్ర ధనస్సు నీలగిరి ఇలా ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన వృక్షాలు భూమికి ఉత్తరార్ధ గోళంలో ఉండే వర్షారణ్య ప్రదేశాలలో విస్తరించి ఉన్నాయి. అలాగే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పాపువా న్యూ గినియా తదితర దేశాల్లో కూడా విస్తారంగా కనిపిస్తాయి. కొన్ని ప్రత్యేక సాగు పద్ధతులను ఉపయోగించి వివిధ దేశాల్లో కూడా ఈ వృక్షాల పెంపకం చేపడుతున్నారు.
ఇలాంటి యూకలిప్టస్ జాతి ప్రపంచంలో ఇదొక్కటే ఉందట. దీని ప్రత్యేకత ఏంటంటే అన్ని చెట్లలాగా కాకుండా ఈ చెట్టు బెరడు వివిధ రంగుల్లో ఉంటుంది. ప్రకాశవంతంగా కనిపిస్తుంది. లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చగానే ఉండే ఈ యూకలిప్టస్ చెట్టు బెరడు ముదిరిపోతున్నాకొద్దీ వివిధ రంఫుల్లోకి మారుతుంది. ఇక వేసవి వచ్చేసరికి ఆ బెరడు మరింత ముదిరి ఇంద్ర ధనస్సులో ఉన్నట్లుగానే నీలం, ఎరుపు, కాషాయం, పర్పుల్-బ్రౌన్‌లుగా రంగులు సంతరించుకుంటుంది. అందుకే దీనిని రెయిన్‌బో యూకలిప్టస్ అంటున్నారు. ఇలా అడవిలో ఉండే అన్ని రెయిన్‌బో యూకలిప్టస్ చెట్లు సప్తవర్ణాలు సంతరించుకొని ఒక అద్భుతమైన దృశ్యాన్ని సహజంగానే ఆవిష్కరిస్తాయి.
రెయిన్‌బో యూకలిప్టస్ చాలా వేగంగా పెరుగుతుంది, ఎంతో ఏపుగా పెరుగుతుంది. ఏడాదికేడాది దీని కాండం రెండింతలు పెరుగుతుంది. ఇలా గరిష్టంగా 200 నుంచి 250 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది. అయితే మనం సాగుచేసే మొక్కలు మాత్రం 100 నుంచి 120 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతాయని చెప్తున్నారు. వీటిని వాణిజ్య అవసరాల కోసం సాగుచేస్తున్నారు.
సంబంధిత కథనం