heart attack in women: మహిళల్లో గుండె పోటు నివారణకు 6 జీవనశైలి మార్పులు ఇవే
heart attack in women: మహిళల్లో గుండె పోటు, గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. మహిళలు 6 ముఖ్యమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చని కార్డియాలజిస్ట్ చెబుతున్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా గుండె జబ్బులతో మహిళలు మరణిస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. మహిళల్లో గుండె ఆరోగ్యం క్షీణించడానికి అనేక కారణాలు ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ వ్యాధి నిర్ధారణ చేయించుకోకపోవడం వంటి అంశాలు మహిళల్లో గుండెపోట్లకు కారణమవుతున్నాయి.
చిన్న వయస్సులోనే మెనోపాజ్ దశకు చేరుకోవడం, పీసీఓఎస్, జెస్టేషనల్ డయాబెటిస్, నెలలు నిండకుండానే ప్రసవించడం వంటి సంతానోత్పత్తి సంబంధిత సమస్యలు మహిళల్లో గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి. అలాగే అధిక స్థాయిలో కొలెస్టరాల్, స్మోకింగ్, డయాబెటిస్, ఒబెసిటీ, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, నిశ్చలమైన జీవనశైలి, ఒత్తిడి, మానసిక సమస్యలు వంటి జీవనశైలి మహిళల్లో గుండె జబ్బులను పెంచుతున్నాయి.
‘ప్రపంచవ్యాప్తంగా, అలాగే ఇండియాలో కూడా కార్డియాక్ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ప్రకారం వార్షికంగా మహిళల్లో గుండె జబ్బుల సంబంధిత మరణాలు 1.73 కోట్లుగా ఉన్నాయి. మహిళల మరణాల్లో అత్యధిక సంఖ్యకు గుండె జబ్బులే కారణమని నివేదిక చెబుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా గుండె జబ్బు సంబంధిత మరణాల బారిన పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే - 2020 ప్రకారం 18.69 శాతం మంది భారతీయ మహిళలు (15 నుంచి 49 ఏళ్ల వయస్సు) హైపర్‌టెన్షన్ బారిన పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 17.09 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 21.73 శాతంగా ఉంది..’ అని సీకే బిర్లా హాస్పిటల్ కార్డియాలజీ విభాగం డాక్టర్ రుద్రదేవ్ పాండే వివరించారు.
మహిళల్లో గుండె జబ్బులకు ముప్పు తెచ్చే అంశాలు ఇవే
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మహిళల మరణాలకు ప్రధాన కారణం గుండె జబ్బులు. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం కార్డియోవాస్కులర్ డిసీజ్ (సీవీడీ) దాదాపు 50 శాతం మరణాలను ప్రభావితం చేసింది. దేశంలోని మహిళల మరణాల్లో 25 శాతం కేసుల్లో గుండె జబ్బులే ఉన్నాయి. మహిళల్లో కార్డియోవాస్కులర్ వ్యాధులకు ప్రధాన ముప్పు కారకాలను డాక్టర్ పాండే ఇలా వివరించారు.
వయస్సు సంబంధిత అంశాలు
వయస్సు పెరిగిన కొద్దీ గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ దశ వచ్చాక ఈ ముప్పు మరింత పెరుగుతుంది. అండాశయాల వయస్సు ప్రభావం వల్ల అనేక హార్మోనల్ మార్పులు సంభవిస్తాయి. ఈనేపథ్యంలో కార్డియోవాస్కులర్ వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఈస్ట్రోజెన్, ఎఫ్ఎస్‌హెచ్ (ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) మెనోపాజ్ సమయంలో తక్కువ ఉత్పత్తి అవుతాయి. ఇది ఆకస్మిక గుండె జబ్బులకు కారణమవుతుంది.
అధిక కొలెస్ట్రాల్
చెడు కొలెస్ట్రాల్ అధికమవడం, మంచి కొలెస్ట్రాల్ తక్కువ కావడం మహిళల్లో గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. విభిన్న సైకలాజికల్ మార్పుల ఫలితంగా ఏర్పడే హైపర్‌టెన్సివ్ ప్రెగ్నెన్సీ డిజార్డర్స్ కారణంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో, అలాగే మెనోపాజ్ దశలో హార్మోనల్ మార్పులే ఇందుకు కారణం. వీటికి తోడు కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర, హైబీపీ, డయాబెటిస్, ఒబెసిటీ, స్మోకింగ్, కదలిక లేని జీవనశైలి మహిళల్లో గుండె జబ్బులకు అధిక ముప్పు తెచ్చిపెడుతాయి.
‘మహిళల్లో గుండె జబ్బుల నివారణకు వారిలో దీనిపై అవగాహన అవసరం. అలాగే నివారణ మార్గాలు ఎంచుకోవడం అవసరం. వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, స్మోకింగ్‌కు దూరంగా ఉండడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకునేలా వారిని ప్రోత్సహించడం అవసరం. చాలావరకు మహిళలు గుండె జబ్బులను గ్యాస్ట్రిక్ సమస్యలుగా పొరబడి స్వీయ చికిత్స పద్ధతులను ఎంచుకుంటారు. కార్డియోవాస్కులర్ వ్యాధులకు ముందస్తుగా స్క్రీనింగ్ అవసరం. అలాగే ముప్పు కారకాలైన డయాబెటిస్, హైపర్‌టెన్షన్ జబ్బులను అదుపులో పెట్టుకోవడం ముఖ్యం..’ అని డాక్టర్ పాండే సూచించారు. మహిళలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు.
మహిళల్లో గుండె ఆరోగ్యం పదిలంగా ఉండేందుకు ఇలా చేయాలి
1. Eat a nutritious diet: పోషకాహారం తీసుకోవాలి
ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. సమతుల ఆహారం తీసుకుంటే గుండె పదిలంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
2. Regular exercise: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది. వారంలో కనీసం 150 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామాలు చేయడం మంచిదని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది.
3. Reduce stress: ఒత్తిడి తగ్గించుకోవాలి
అధిక ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఒత్తిడి తగ్గించే మార్గాలను గుర్తించి వాటిని పాటించాలి. ముఖ్యంగా రిలాక్సేషన్ వ్యాయామాలు, యోగా, ధ్యానం చేయడం అవసరం.
4. Give up smoking: స్మోకింగ్ మానేయాలి
స్మోకింగ్ వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలావరకు పెరుగుతుంది. స్మోకింగ్ మానేస్తే గుండె జబ్బుల ముప్పు తగ్గడమే కాకుండా మీ ఆరోగ్యం సంపూర్ణంగా మెరుగుపడుతుంది.
5. Liquor intake: మద్యపానం పరిమితం చేయాలి
మద్యం తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కాలేయ వ్యాధులు, హైబీపీ, కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయడం, లేదా పరిమితం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగవుతుంది.
6. Take care of chronic conditions: దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో జాగ్రత్త
డయాబెటిస్, హైబీపీ, హై కొలెస్ట్రాల్ ఉన్న మహిళల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ. వీటికి వెంటనే చికిత్స తీసుకోవాలి. అలాగే ఆహార అలవాట్లు మానుకోవాలి. తరచూ హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్