Henna: జుట్టుకు హెన్నా మంచిదే, కానీ తరచూ వాడితే జరిగే నష్టాలివే
Henna: హెన్నాలో లాసన్ అనే డై ఉంటుంది, ఈ జుట్టును ఎక్కువగా పొడిబారేలా చేసి, జుట్టు రాలడానికి కూడా కారణమవుతుంది. దీంతో పాటే హెన్నా ఎక్కువగా వాడితే నష్టాలేంటో తెల్సుకోండి.
తెల్ల వెంట్రుకలను దాచుకోవడానికి , జుట్టుకు మంచి రంగు కోసం హెన్నా వాడటం అందరూ చేసేదే. దీనివల్ల అనేక ప్రయోజనాలుంటాయి. రంగుతో పాటే జుట్టు పోషనకూ హెన్నా సాయపడుతుంది. అయితే ఎక్కువగా వాడినా, దాన్ని ఎక్కువ సేపు తలకు ఉంచుకున్నా కొన్ని సమస్యలు తప్పవంటారు నిపుణులు.
అందులో లాసన్ అనే డై ఉంటుంది. లాసన్ ను హెనాటోనిక్ యాసిడ్ అని కూడా అంటారు. లాసన్ కెరాటిన్ ప్రోటీన్తో చర్య జరుపుతుంది. ఫలితంగానే హెన్నా జుట్టును ఎరుపు రంగును మారుస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా రాసుకుంటే జుట్టు విపరీతంగా పొడిబారడానికి కూడా కారణమవుతుంది. గోరింటాకును జుట్టుకు అప్లై చేయడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.
నిర్జీవంగా మారుతుంది:
హెన్నా తరచూ ఉపయోగించడం వల్ల జుట్టు పూర్తిగా నిర్జీవంగా, పొడిగా మారుతుంది. జుట్టు సహజ తేమను కోల్పోవడం ద్వారా చిట్లిపోతుంది. దీనివల్ల క్రమంగా జుట్టు చాలా పొడిపొడిగా మారిపోయి చాలా చిక్కులు పడతాయి. దాంతో దువ్వుకోవడం కష్టమవుతుంది.
రంగు:
జుట్టుకు ఎక్కువగా హెన్నా అప్లై చేయడం వల్ల క్రమంగా వాటి అసలు రంగు మాయమై పోతుంది. హెన్నా రంగులోనే కనిపించడం మొదలవుతుంది. తరచూ రాసుకోవడం వల్ల ముందున్న రంగు పోకముందే మరో కొత్త రంగు కోటింగ్ లాగా చేరుతుంది. దాంతో సహజ రంగు కోల్పోవడమే కాకుండా.. మీరనుకున్న రంగు రాదు.
జుట్టు రాలడం:
ఎక్కువ సేపు తలకు హెన్నా ఉంచుకోవడం, ఎక్కువ సార్లు రాసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. మెహందీ జుట్టు కుదుళ్ల నుండి సహజ నూనెను గ్రహించి వాటిని పొడిగా, బలహీనంగా చేస్తుంది. ఇది జుట్టు రాలే సమస్యను పెంచుతుంది.
అలర్జీలు:
జుట్టుకు హెన్నా అప్లై చేయడం వల్ల కొంతమందికి అలెర్జీ సమస్యలు కూడా రావచ్చు. సున్నితత్వం ఉన్నవాళ్లు హెన్నాకు దూరంగా ఉండటమే మంచిది. లేదంటే హెన్నా రాసుకోగానే మంట, దురద ఎక్కువగా అనిపించినా వెంటనే కడిగేసుకోండి.
టాపిక్