Henna Hair dye: తెల్ల జుట్టు కోసం ఇంట్లోనే హెన్నాతో నల్లటి హెయిర్ డై ఇలా తయారు చేసుకోండి, ఇది ఎంతో సురక్షితం-how to make black hair dye with henna at home for white hair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Henna Hair Dye: తెల్ల జుట్టు కోసం ఇంట్లోనే హెన్నాతో నల్లటి హెయిర్ డై ఇలా తయారు చేసుకోండి, ఇది ఎంతో సురక్షితం

Henna Hair dye: తెల్ల జుట్టు కోసం ఇంట్లోనే హెన్నాతో నల్లటి హెయిర్ డై ఇలా తయారు చేసుకోండి, ఇది ఎంతో సురక్షితం

Haritha Chappa HT Telugu
Published Sep 27, 2024 02:00 PM IST

Henna Hair dye: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోయి ఎంతో మందికి సమస్యగా మారుతుంది. బయట దొరికే రసాయనాలు కలిపిన హెయిర్ డై వాడే కన్నా దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమం.

హెన్నా హెయిర్ డై తయారీ ఎలా?
హెన్నా హెయిర్ డై తయారీ ఎలా? (Pixabay)

Henna Hair dye: తెల్ల జుట్టు సమస్య ఎంతో మందికి ఇబ్బంది పెడుతోంది. తెల్ల జుట్టు నల్లగా మార్చేందుకు బయట దొరికే రసాయనాలు కలిసిన హెయిర్ డైలను ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. వీటిలో క్యాన్సర్ కారకాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సహజ సిద్ధంగా ఇంట్లోనే హెన్నాతో హెయిర్ డైను తయారు చేసుకోండి. జుట్టు నల్లగా మారుతుంది. పైగా ఎలాంటి రసాయనాలు ఇందులో ఉండవు. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే హెన్నాతో హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

హెన్నా అంటే ఏమిటి?

హెన్నాను లాసోనియా ఇనర్మిస్ అని పిలిచే మొక్కల ఆకుల నుండి తయారుచేస్తారు. ఇది ఆఫ్రికా, ఆసిమా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మొక్క. ఈ ఆకులను ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలిపి జుట్టుకు వేస్తూ ఉంటారు. సాధారణ హెన్నా ఎరుపు లేదా గోధుమ రంగును అందిస్తుంది. హెన్నా ఆకుల నాణ్యతను బట్టి ఇది ముదురు రంగులో కూడా వస్తుంది.

హెన్నా హెయిర్ డై తయారీ

తెల్ల జుట్టుకు నల్ల రంగు ఇచ్చేందుకు హెన్నాను ఉపయోగించవచ్చు. హెన్నా పొడి, నిమ్మరసం, ఆపిల్ సిడర్ వెనిగర్, లావెండర్ ఆయిల్ లేదా టీ ట్రీ ఆయిల్ వంటివి హెన్నా హెయిర్ కలర్ తయారు చేసేందుకు ఉపయోగించాలి.

ఇలా చేయండి

హెన్నా బయట దొరుకుతుంది. ఆ హెన్నా మిక్స్ ని తీసుకొని జల్లెడ పట్టి ఉండలు లేకుండా చూసుకోండి. ఒక గిన్నెలో వేసి దానిలో నీళ్లు వేసి పేస్ట్ లాగా చేసుకోండి. ఇందులో నిమ్మరసం లేదా ఆపిల్ సెడర్ వెనిగర్ కలుపుకోవచ్చు. టీ పొడి కలిపినా కూడా మంచి నలుపు రంగు వస్తుంది. అలాగే లావెండర్ ఆయిల్‌ను కూడా కాస్త వేయండి. ఇది సువాసనను అందిస్తుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఒక గిన్నెలో వేయండి. ఇందుకోసం నాన్ మెటల్ గిన్నెను ఎంచుకుంటే మంచిది. అంటే స్టీలు, ఇనుము వంటి వాటితో చేసింది కాకుండా ప్లాస్టిక్‌తో చేసిన కప్పులో దీన్ని వేయండి. పైన మూత పెట్టి నాలుగు నుండి 12 గంటల పాటు వదిలేయండి. ఆ తర్వాత జుట్టుకు అప్లై చేయండి.

దీన్ని అప్లై చేశాక గంట నుండి నాలుగు గంటల పాటు అలా వదిలేయండి. అప్పుడు జుట్టుకు మంచి రంగు వస్తుంది. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. షాంపూ వాడాల్సిన అవసరం లేదు. కండిషనర్ పెట్టుకోవచ్చు. షాంపూకు బదులు కండిషనర్‌ను వాడితే ఇంకా ఉత్తమం. జుట్టు మృదువుగా మారుతుంది. స్నానం చేశాక జుట్టును గాలిలో సహజసిద్ధంగా ఆరబెట్టండి. హెయిర్ డ్రైయర్లు వంటివి వాడకండి. ఈ రంగు జుట్టుకు బాగా పట్టాలంటే హెన్నా హెయిర్ డై వేసుకున్న రెండు రోజుల వరకు తలకు షాంపూ పెట్టవద్దు. ఆ తర్వాత అందమైన నల్లటి జుట్టు మీకు కనిపిస్తుంది.

బయట దొరికే రసాయనాలు నిండిన హెయిర్ డై ను వాడే కన్నా ఇలా ఇంట్లోనే తయారుచేసిన హెన్నా హెయిర్ డైను వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. నెలకి ఒకటి రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది. జుట్టుకు మంచి రంగు వస్తుంది.

Whats_app_banner