Build Confidence In Kids: పిల్లల్ని అత్యంత ఆత్మ విశ్వాసంతో పెంచడం ఎలాగంటే..
Build Confidence In Kids: పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచే విషయంలో తల్లిదండ్రుల పెంపకం పాత్ర కీలకం. దానికోసం పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి.
పిల్లల పెంపకం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. మనం చిన్నప్పటి నుంచి వారికి ఏం చెబుతున్నాం? ఎలా తీర్చిదిద్దుతున్నాం? అన్న దాన్ని బట్టి వారు పెద్దయ్యాక ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అనేది నిర్ణయం అవుతుంది. అందుకనే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చాలా సునిశితంగానూ ఉండాలి. చిన్నప్పటి నుంచి వారిలో ఆత్మ విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. వారిలోని భయాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వారు ఎంతో కాన్ఫిడెంట్‌గా అన్ని పనులనూ చక్కబెట్టుకునే విధంగా వారిని తయారు చేయాలి. అందుకోసం చిన్న చిన్న చిట్కాలను తప్పకుండా పాటించాలి.
ప్రేమగా ఉండండి :
తల్లిదండ్రులు తమను ఇష్టంగా చూసుకుంటున్నారు అన్న విషయం పిల్లలకు ఎంతో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని ఇస్తుంది. మీరు వారిపట్ల కేరింగ్‌గా ఉంటూనే వారు చేస్తున్న తప్పొప్పులను సవరిస్తూ ముందుకు వెళ్లండి. అందువల్ల ఎలా నిర్ణయాలు తీసుకోవాలి. ఏది మంచి నిర్ణయం, ఏది చెడ్డ నిర్ణయం అనేది వారంతట వారే సరి చేసుకుంటూ వెళతారు. ఎలాంటి సంఘటనలో అయినా వారిని అత్యంత కఠినంగా విమర్శించడం, అవహేళనగా మాట్లాడటం చేయకండి. ఇలాంటి వాటి వల్ల వారు ఆత్మ న్యూనతా భావానికి లోనవుతారు. కాబట్టి మీరు ప్రేమగా ఉంటూనే వారిని సరిచేసే ప్రయత్నాలు చేయండి.
సానుకూలంగా మాట్లాడండి :
‘నేను ఇది చేయలేను. నేను దీన్ని చదవలేను. నేను ఫలానా ఆఫీసు పని సహాయం లేకుండా పూర్తి చేయలేను’ లాంటి మాటల్ని మీరు మాట్లాడకండి. వారి నోటి వెంట అసలు రానీయకండి. బదులుగా పనికి సంబంధించిన మంచి మంచి కొటేషన్లను వారి గదిలో అంటించండి. ‘ఐ కెన్ డు హార్డ్’, ‘ఐ ఆల్వేస్ హెల్ప్‌ఫుల్ టు అదర్స్’ లాంటి వాటిని వారికి కనిపించే విధంగా అంటించండి. అలాంటి కొటేషన్లతో ఉన్న చేతి బ్యాండ్ల లాంటి వాటినీ వారికి బహుమతిగా ఇవ్వండి. ఆ అర్థాలన్నింటినీ వారికి వివరించండి. అప్పుడు వారు తమని తాము శక్తివంతులుగా భావించడం మొదలు పెడతారు. అలాగే వారు ఏ పనిని సరిగ్గా చేస్తూ ఉన్నా ప్రశంసించడం మర్చిపోకండి. ప్రశంసలు వారికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి.
వారి సలహా అడగండి:
మీరు పనులను చేసుకునేప్పుడు తప్పకుండా వారిని ఇన్‌వాల్వ్ చేయండి. ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో వారి సలహా కూడా అడగండి. ఏదైనా కొనాలంటే ఏది బాగుండో అడగండి. వారి వయసుకు తగ్గట్టుగా వారి ఆలోచనలనూ పరిగణలోకి తీసుకోండి. అలా చేయడం వల్ల తెలియకుండానే వారిలో ఆత్మవిశ్వాసం మరింతగా పుంజుకుంటుంది.