Parijat Leaves & Flowers: అజీర్ణం నుంచి కీళ్ల నొప్పులు తగ్గించే పారిజాతం.. ఎలా వాడాలంటే..
Parijat Leaves & Flowers: పారిజాతం ఆకులు, పూలను అనేక ఆరోగ్య సమస్యలకు మందులాగా వాడొచ్చు. అదెలాగో వివరంగా చూసేయండి.
ఆరోగ్యానికి పారిజాతం (flickr)
పారిజాత పూలను మనం ఎక్కువగా పూజ కోసం వాడుతుంటాం. మాలలు గుచ్చి విగ్రహాలకు అలంకరిస్తుంటాం. అంతకు మించి వాటి వల్ల ఉండే ప్రయోజనాలేంటో మనకు తెలియదు. అయితే వాటిని ఆహారంలో ఉపయోగించడం వల్ల చాలా లాభాలుంటాయి. అవేంటో తెలిస్తే వీటిని మీరు అస్సలు వదిలి పెట్టరు. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడు, కొమ్మలు, ఆకులు, పువ్వులను కూడా ఔషధంగా వినియోగిస్తారు. అదెలాగో ఏంటో తెలుసుకుందాం రండి.
పారిజాతం లాభాలు:
- పారిజాత పువ్వులు, ఆకుల్లో యాంటీ పైరటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రకరకాల జ్వరాలను తగ్గించడానికి ఇది మంచి మందులా పనికి వస్తుంది. ఈ చెట్టు బెరడును తీసి నీటిలో వేసి మరిగించాలి. దాన్ని కషాయంలా తాగడం వల్ల ఎలాంటి జ్వరం అయినా తగ్గుతుంది.
- అనారోగ్యకర జీవన శైలి, ఎక్కువగా కదలిక లేని జీవన విధానం తదితరాల వల్ల కీళ్ల దగ్గర వాపులు వస్తాయి. ఈ ఆర్థరైటిస్ మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి వారికి కీళ్ల నొప్పులు తగ్గడానికి పారిజాత పూల టీ లేదా ఆకుల టీ పనికి వస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది వాపులను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
- ఆయుర్వేదం ప్రకారం మానవ శరీరంలో పిత్త దోషం వల్ల అజీర్ణం సమస్య తలెత్తుతుంది. ఈ దోషాన్ని సరి చేయడంలో పారిజాత పుష్పం ఔషధంలా పని చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా ఇది దూరం చేస్తుంది.
- పారిజాత చెట్టు కొమ్మని ముక్కలు చేసి ఎండబెట్టాలి. వాటిని మెత్తటి పొడిలా చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు నీటితో కలిపి తాగడం వల్ల మలేరియా, కీళ్ల నొప్పుల్లాంటివి తగ్గుతాయి.
- పారిజాత పూల టీని క్రమం తప్పకుండా రోజూ తాగుతూ ఉండటం వల్ల స్త్రీ సంబంధమైన అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
- శీతాకాలం లోనే కాకుండా మామూలు సమయంలో కూడా చాలా మంది జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలతో తరచుగా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కొంత మందికి ఆస్తమా చాలా సమస్యగా ఉంటుంది. ఇలాంటి శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు ఈ ఆకులు, పూల టీని చేసుకుని తేనె కలుపుకుని పరగడుపున రోజూ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలుచన చేసి బయటకు తోసి వేస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయి.