DIY Turmeric Cream: చర్మాన్ని మెరిపించే టర్మరిక్ బాడీ క్రీం ఇంట్లోనే తయారు చేసుకోండి!
DIY Turmeric Cream: పసుపు చర్మం నిగారింపును రెట్టింపు చేస్తుంది. అవే సుగుణాలున్న టర్మెరిక్ బాడీ క్రీం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో వివరంగా చూసేయండి.
పూర్వ కాలంలో మహిళలంతా పసుపును శరీరానికి పట్టించి స్నానం చేసేవారు. క్రమంగా ఆ ఆచారం తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పుడు కూడా మార్కెట్లో దొరికే రకరకాల టర్మరిక్ క్రీంలను కొని తెచ్చుకుని వాడుతున్నారు. సహజమైన పసుపును ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. దీంట్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మెటిమలు, మచ్చల్లాంటివి తగ్గుముఖం పడతాయి. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
బ్యాక్టీరియాలు, ఫంగస్‌ల్లాంటి వాటి వల్ల వచ్చే చర్మ సమస్యలు అన్నీ తగ్గుముఖం పడతాయి. ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. అందుకనే ఇప్పటికీ టర్మరిక్ క్రీంల వాడకం ఏ మాత్రం తగ్గలేదు. మరి మార్కెట్‌లో దొరికే వాటిలో ఏం రసాయనాలు ఉంటాయో, అవి మన చర్మంపై ఎలాంటి దుష్ప్రభావాలను చూపుతాయో చెప్పలేం. ఎంచక్కా పసుపు క్రీంని మనమే ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు.
టర్మరిక్ క్రీం తయారీకి కావాల్సిన పదార్థాలు :
ఫిల్టర్ చేసిన ఐదు టేబుల్ స్పూన్లు నీరు, షియా బటర్(ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది), మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూను బీ వ్యాక్స్, ఒక టేబుల్ స్పూను టర్మరిక్ ఆయిల్, ఏడు నుంచి ఎనిమిది చుక్కలు లవంగ ఎసెన్షియల్ ఆయిల్. వాసన మంచిగా ఉండాలనుకునే వారు దీనికి బదులుగా లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌ని అయినా వాడుకోవచ్చు. అయితే లవంగాల నూనెతో ఎక్కువ చర్మ ప్రయోజనాలు ఉంటాయి.
తయారీ విధానం :
ముందుగా కొబ్బరి నూనె, షియా బటర్లను గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించాలి. దానిపై గిన్నె పెట్టుకుని నీరు పోసుకోవాలి. ఆ మధ్యలో కొబ్బరి నూనె వేసుకున్న గిన్నెను పెట్టుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో దీన్ని తయారు చేయాల్సి ఉంటుంది. నీరు మరుగుతున్నప్పుడు రెండో గిన్నెలో ఉన్న నూనె, షియా బటర్‌లు కాస్త గోరు వెచ్చగా అవుతాయి. అప్పుడు అందులోకి పసుపు నూనె, లవంగాల నూనెల్ని వేయాలి. అన్నింటినీ బాగా కలియబెట్టాలి. తర్వాత అందులోకి మైనం (బీ వ్యాక్స్) వేయాలి. అది కరిగేంత వరకు వేచి ఉండాలి. ఈ సమయంలో స్టౌని తక్కువగా కాని, మీడియం మంట మీద కాని పెట్టుకోవాలి. అదంతా కరిగి రెడీ అవ్వడానికి ఐదారు నిమిషాల వరకు సమయం పడుతుంది. ఇది ఇంకా ద్రవ రూపంలో ఉండి క్రీమీ టెక్స్చ్‌ర్‌లో ఉంటుంది. అలాంటి స్థితిలో దాన్ని ఓ కంటైనర్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చర్మం జీవం కోల్పోయినట్లు ఉన్నా, పొడిబారినా దీన్ని చక్కగా అప్లై చేసేసుకోవచ్చు.
టాపిక్