Tasty Coffee Tips: కాఫీని మరింత రుచిగా మార్చేసే.. వంటింటి సుగంధ ద్రవ్యాలు..-know how to make tastier coffee with simple ingredients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tasty Coffee Tips: కాఫీని మరింత రుచిగా మార్చేసే.. వంటింటి సుగంధ ద్రవ్యాలు..

Tasty Coffee Tips: కాఫీని మరింత రుచిగా మార్చేసే.. వంటింటి సుగంధ ద్రవ్యాలు..

Koutik Pranaya Sree HT Telugu
Dec 14, 2023 10:20 AM IST

Tasty Coffee Tips: కాఫీ రుచి మరింత పెరగాలంటే దాంట్లో కొన్ని పదార్థాలు కలపొచ్చు. అవేంటో వాటి ప్రయోజనాలేంటో చూసేయండి.

టేస్టీ కాఫీ టిప్స్
టేస్టీ కాఫీ టిప్స్ (freepik)

సాధారణంగా మనం టీలో రకరకాల దినుసుల్ని వేసుకుని చేసుకుంటూ ఉంటాం. యాలకులు, అల్లం, దాల్చిన చెక్క.. లాంటి వాటిని అన్నింటినీ చేర్చుకుని రక రకాల టీలను చేసుకుంటాం. అయితే కాఫీలో మాత్రం వేటినీ చేర్చం. కేవలం పాలు, పంచదార, కాఫీ పొడితోనే దీన్ని తయారు చేసేసుకుంటాం. మరీ అవసరం అనుకుంటే పైన కాస్త క్రీంని చేర్చి వేడి వేడిగా తాగేసి ఆనందించేస్తుంటాం. అంతే తప్ప ఇక దాని మీద ఎలాంటి ప్రయోగాలూ చేయం. అయితే కాఫీలోనూ కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను చేర్చడం ద్వారా దాని రుచి మెరుగు కావడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు కలుగుతుంది. అవేంటో చూసేయండి.

దాల్చిన చెక్క:

కాఫీని కొత్త రుచితో ఆస్వాదించాలని అనుకునే వారు దాల్చిన చెక్క పొడిని కాసింత దానిలో చేర్చుకుంటే రుచి మరింత బాగుంటుంది. ఇది రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికీ మంచి చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మన రోగ నిరోధక వ్యవస్థను ఇది మరింత శక్తివంతం చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. రక్తంలోని అధిక చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. వాపులతో పోరాడుతుంది. అందుకనే కాఫీ తాగే అలవాటు ఉన్నవారు కాస్త ఈ పొడిని చేర్చుకుంటే ఈ ప్రయోజనాలు అన్నింటినీ పొందవచ్చు.

యాలకులు:

కాఫీ రుచిని మరింత పెంపొందించడంలో యాలకుల పొడి ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీనిలో ఉండే పీచు పదార్థాలు, ఖనిజాలు లాంటివి రక్త ప్రసరణ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తాయి. జీర్ణ సమస్యలన్నింటినీ తగ్గిస్తాయి. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మల బద్ధకం తదితర పొట్ట సంబంధిత సమస్యలు అన్నింటినీ ఎంతో రుచిగా దీని ద్వారా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఉదయాన్నే కాఫీ తాగే వారు కాస్త దీన్ని వేసుకుని తాగే అలవాటు చేసుకోండి.

జాజి కాయ:

కాఫీకి జాజికాయ పొడి చేర్చడం వల్ల రుచి చాలా చిత్రంగా మారుతుంది. జాజికాయకు కూడా కాస్త తీపిదనం ఉంటుంది. దాని వల్ల కాఫీకి ప్రత్యేకమైన ఫ్లేవర్‌ అబ్బుతుంది. మధుమేహం ఉన్న వారికి దీని వల్ల ఉపశమనం లభిస్తుంది. క్లోమం పని తీరు మెరుగవుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. పురుషుల లైంగిక సామర్థ్యాలు మెరుగు పడతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే దీన్ని కాఫీలో చేర్చుకుని రోజూ తాగాలని నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడూ టీలో రకరకాల ఫ్లేవర్లను ప్రయత్నించే వారు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఇలాంటి వాటిని కాఫీలోనూ చేర్చుకునే ప్రయత్నం చేయండి. అందువల్ల ఆరోగ్యానికి మంచిదేగాని, చెడేమీ ఉండదని గుర్తుంచుకోండి.

WhatsApp channel

టాపిక్