Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా చేశారా? తయారీ విధానం ఇదే..-know how to make gooseberry pulihora in easy way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా చేశారా? తయారీ విధానం ఇదే..

Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా చేశారా? తయారీ విధానం ఇదే..

Koutik Pranaya Sree HT Telugu
Nov 23, 2023 12:38 PM IST

Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా ప్రయత్నించారా? చాలా సులభంగా రెడీ అయిపోతుంది. అదెలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.

ఉసిరికాయ పులిహోర
ఉసిరికాయ పులిహోర

మార్కెట్లో ఉసిరికాయలు చాలా దొరికే సమయం ఇది. పచ్చి ఉసిరి కాయల్ని తెచ్చుకుని ఒకసారి పులిహోర ప్రయత్నించి చూడండి. మామిడికాయ పులిహోర రుచిని మర్చిపోతారు. చాలా కొత్తగా అనిపిస్తుంది. తింటుంటే పుల్లపుల్లగా భలేగుంటుంది. దాని తయారీ ఎలాగో పక్కా కొలతలతో సహా చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు బియ్యం

తగినంత ఉప్పు

100 గ్రాముల ఉసిరికాయలు

2 పచ్చిమిర్చి

1 టీస్పూన్ ఆవాలు

1 టీస్పూన్ మినప్పప్పు

1 టీస్పూన్ శనగపప్పు

2 చెంచాల పల్లీలు

2 ఎండుమిర్చి

పావు చెంచా పసుపు

2 చెంచాల నూనె

1 కరివేపాకు రెబ్బ

తయారీ విధానం:

  1. ముందుగా ఒక కప్పు బియ్యాన్న కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో కప్పున్నర నీళ్లు పోసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. అన్నాన్ని ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ లోపు తాలింపు రెడీ చేసుకోవచ్చు.
  3. ఇప్పుడు ఉసిరికాయల్ని రెండు ముక్కలు చేసి, గింజలు తీసేసి రెండు పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
  4. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు వేసుకుని చిటపటలాడనివ్వాలి. అందులో మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసి వేయించాలి.
  5. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని రెండు సెకన్ల పాటూ వేగనివ్వాలి. పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి.
  6. అందులోనే ఉసిరికాయ ముద్దను కూడా వేసుకుని సన్నం మంట మీద ఒక రెండు నిమిషాల పాటూ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం కూడా వేసుకుని ఒకసారి బాగా కలియబెట్టాలి. అంతే.. వేడి వేడి ఉసిరికాయ పులిహోర రెడీ అయినట్లే..

Whats_app_banner