Guntha Ponganalu: మిగిలిన దోశ పిండితో.. రుచికరమైన వెజిటేబుల్ గుంతపొంగనాలు..
Guntha Ponganalu: మిగిలిపోయిన దోశ పిండి ఉంటే పడేయకండి. దాంతో కొత్తగా మరొక అల్పాహారం గుంత పొంగనాలు సిద్దం చేసుకోవచ్చు. అదెలాగో వివరంగా చూసేయండి.
గుంత పొంగనాలు (pixahive)
దోశ పిండి మిగిలిపోయినా, లేదా రెండు పూటల కన్నా ఎక్కువ దోశలు తినలేకపోయినా పిండిని పక్కన పెట్టేయకండి. వాటితో కాస్త కొత్త రుచిలో గుంత పొంగనాలు చేసేసుకోవచ్చు. మీ ఇష్టానికి అనుగుణంగా వివిధ రకాల కూరగాయలతో చేసుకోవచ్చు. నూనె కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఎంత పులిసిన పిండి వాడితే పొంగనాలు అంత రుచిగా వస్తాయని మర్చిపోకండి.
కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల దోశ పిండి
1 కప్పు రవ్వ
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు
3 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు
1 క్యారట్, తురుము
పావు చెంచా జీలకర్ర
కొద్దిగా కొత్తిమీర తరుగు
పావు టీస్పూన్ బేకింగ్ సోడా
తగినంత ఉప్పు
2 చెంచాల నూనె
తయారీ విధానం:
- ఒక పెద్దగిన్నెలో దోశ పిండి వేసుకోవాలి. అందులోనే రవ్వ, ఉప్పు, సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
- అందులోనే నచ్చిన కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, క్యారట్ తురుము కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
- చివరగా కొద్దిగా వంటసోడా కూడా వేసుకుని బాగా కలుపుకుని పిండిని అయిదు నిమిషాల పాటూ పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు గుంతపొంగనాలు చేసే ప్యాన్ పెట్టుకుని అన్ని గుంతల్లో కొద్దిగా నూనె వేసుకుని సన్నం మంట మీద పెట్టుకోవాలి.
- కొద్దికొద్దిగా పిండి వేసుకుని 2 నిమిషాల పాటూ రెండు వైపులా కాల్చుకోవాలి.
- అంతే సిద్దమైన గుంత పొంగనాల్ని మీకిష్టమైన చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేసుకుంటే చాలు.