Constipation tips: ఈ 4 అలవాట్లే.. మలబద్ధకం ఇబ్బంది పెంచుతాయి..
Constipation tips: మలబద్దకం సమస్య కోసం మందులు వాడుతున్నారా? వాటితో పాటే మీ అలవాట్లే మీ సమస్యను పెంచుతున్నాయేమో గమనించుకోవాలి. అవేంటో చూడండి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం కావాలి. తర్వాత వచ్చిన వ్యర్థాలన్నీ సజావుగా బయటకు వెళ్లిపోవాలి. ఈ మూడింటిలో ఎక్కడ లోపం ఉన్నా ఆ ప్రభావం మన ఆరోగ్యంపై కచ్చితంగా పడుతుంది. కొందరికి ఉదయాన్నే మల విసర్జన సరిగ్గా జరగదు. పొట్టంతా ఉబ్బరంగా, భారంగా అనిపిస్తుంది. క్రమ క్రమంగా ఇదే మలబద్ధకం సమస్యగా తయారవుతుంది. మల విసర్జన జరిగేప్పుడు ఒత్తిడిగా అనిపించడం, నొప్పి, చాలా ఎక్కువ సేపు బాత్రూంలో కూర్చోవాల్సి రావడం, వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే మ విసర్జన జరగడం లాంటి లక్షణాలన్నీ మలబద్ధకాన్ని సూచిస్తాయి. దీనికి మన రోజు వారీ అలవాట్లే కారణమని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు చెబుతున్నారు. అవేంటంటే..
1. తగినంత పీచు పదార్థాల్ని తినకపోవడం :
ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉన్న వాటిని తిన్నప్పుడు మలబద్ధకం సమస్య తలెత్తదు. అలా కాకుండా సరళమైన కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. పీచు పదార్థాలు ఆహారం జీర్ణం కావడంలో, తర్వాత వ్యర్థాల్ని బయటకు పంపించి వేయడంలో కీలకంగా పని చేస్తాయి. మలబద్ధకం సమస్య ఉన్న వారు కచ్చితంగా ఫైబర్ రిచ్ ఆహారాలను తీసుకోవాలి.
2. తగినంత నీరు తీసుకోకపోవడం :
మలబద్ధకం దరి చేరకూడదంటే శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. రోజుకు కనీసం పది గ్లాసుల నీటిని తాగే వారిలో ఈ సమస్య తలెత్తడం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఏదో దృష్టిలో ఉండి కొంత మంది నీటిని తాగడం మర్చిపోతూ ఉంటారు. అలాంటి వారు రోజూ ఉదయాన్నే రెండు, మూడు బాటిళ్లతో నీటిని నింపి పెట్టుకోవాలి. వాటిని సాయంత్రం లోపు తాగేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడు తగినంత నీరు శరీరానికి అందుతుంది. మరి కొందరు బయటకు వెళ్లినప్పుడు అస్తమానూ బాత్రూమ్‌కి వెళ్లాల్సి వస్తుందని కూడా నీటిని తాగేందుకు ఇష్టపడరు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడైనా మరుగుదొడ్లు అందుబాటులోనే ఉంటున్నాయి. కాబట్టి నిస్సందేహంగా నీటిని తాగండి.
3. కదలకుండా కూర్చోవడం:
ఆఫీసుల్లో పనులు చేసే వారు రోజంతా కదలకుండా అలానే కూర్చుని కంప్యూటర్లలో పని చేసుకుంటుంటారు. అలాగే మరి కొందరు ఎక్కువగా మంచం మీద పడుకునే ఉంటారు. దీని వల్ల శరీరంలో కదలిక మందగిస్తుంది. దీని వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. మీరు గనుక ఇలా చేస్తుంటే అరగంటకు ఒకసారైనా లేచి అటూ ఇటూ నడవండి. ఒళ్లు విరుచుకోండి. రెండు మూడు నిమిషాలైనా ఈ పనులు చేసి మళ్లీ మీ సాధారణ పనుల్లోకి వెళ్లండి.
4. ఇతర మందులు:
రక్త హీనతతో ఉన్న వారు ఐరన్ సప్లిమెంట్లను వాడుతుంటారు. అలాగే హైబీపీకి మందులు వాడుతుంటారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు వాడే కొన్ని ట్యాబ్లెట్ల వల్లా మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ఈ అన్నింటిలో దేని వల్ల మీకు సమస్య ఉత్పన్నం అవుతోందో తెలుసుకుని దాన్ని నివారించుకోవాల్సి ఉంటుంది.