Chyawanprash benefits: రోగనిరోధక శక్తి తక్కువుందా? చ్యవన్‌ప్రాష్‌తో అద్భుత ప్రయోజనాలు..-know different benefits of chyawanprash for adults and children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chyawanprash Benefits: రోగనిరోధక శక్తి తక్కువుందా? చ్యవన్‌ప్రాష్‌తో అద్భుత ప్రయోజనాలు..

Chyawanprash benefits: రోగనిరోధక శక్తి తక్కువుందా? చ్యవన్‌ప్రాష్‌తో అద్భుత ప్రయోజనాలు..

HT Telugu Desk HT Telugu
Sep 27, 2023 09:15 AM IST

Chyawanprash benefits: చ్యవన్ ప్రాష్ ఒక ఆయుర్వేద లేహ్యం. దీన్ని రోజూవారీ తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. అవేంటో వివరంగా తెలుసుకోండి.

చ్యవన్‌ప్రాష్ లాభాలు
చ్యవన్‌ప్రాష్ లాభాలు (freepik)

భారత దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద లేహ్యం చ్యవన్‌ ప్రాష్‌. దీన్ని ఎప్పటి నుంచో పిల్లలకు పెడుతూ వస్తున్నారు. ఆరోగ్య అవసరాల రీత్యా కొందరు పెద్దలూ దీన్ని తింటూ ఉంటారు. బలహీనంగా, ఎప్పుడూ శ్వాస కోశ వ్యాధులతో బాధ పడుతూ ఉండే పిల్లల్ని చూసినప్పుడు వైద్యులు ఇప్పటికీ దీన్ని పెట్టమని సిఫార్సు చేస్తుంటారు. అందుకనే ఇప్పుడిది రకరకాల బ్రాండ్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. తేనె, నెయ్యి, ఉసిరి, లవంగ లాంటి దాదాపు 50 రకాల ఆయుర్వేద ద్రవ్యాలను వాడి జామ్‌లా దీన్ని తయారు చేస్తారు. ఇది తియ్యగా, పుల్లగా, మసాలా ఫ్లేవర్‌ తగులుతూ ఉంటుంది. మరి అసలు ఇది తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఎంత తినొచ్చు. లాంటి విషయాలన్నింటినీ ఇక్కడ చూసేద్దాం.

చ్యవన్‌ప్రాష్‌తో ప్రయోజనాలు :

  • శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావడానికి ఇది పనికి వస్తుంది. ఇందుకు అవసరమైన కణాల ఉత్పత్తి, వాటి పని తీరును ఇది మెరుగుపరుస్తుంది. దీనిలో ముఖ్యంగా ఉండే ఉసిరికాయలో విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తిని ఇది పెంచుతుంది. పిల్లలు బలంగా ఎదిగేందుకు సహకరిస్తుంది.
  • జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని బలోపేతం చేస్తుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యల్లాంటి వాటిని తగ్గించి పిల్లల్లో అరుగుదలను పెంచుతుంది. నోటి దగ్గర మొదలై, మల ప్రేగు చివరి వరకు ఉన్న జీర్ణ వ్యవస్థ పని తీరు మొత్తాన్ని ఇది క్రమబద్ధీకరిస్తుంది. దీంతో ఏం తిన్నా చక్కగా అరిగి శరీరానికి పడుతుంది.
  • కాలాలు మారుతున్నప్పుడు సహజంగానే మనకు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులూ తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమస్య పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా రోజూ తింటూ ఉండటం వల్ల ఇలాంటి సీజనల్‌ వ్యాధులు దరి చేరవు.
  • వాత, పిత్త, కఫ దోషాలు శరీరంలో ప్రకోపించకుండా చూస్తుంది. ఈ మూడూ సరిగ్గా ఉండి శరీర పని తీరుకు అవి సహకరించేలా తోర్పడుతుంది.
  • దీనిలో ఉన్న ద్రవ్యాల వల్ల మెదడు పని తీరు మెరుగవుతుంది. మెదడుతో మిగిలిన శరీర అవయవాల సంబంధాలను మెరుగవుతాయి. చిన్న పిల్లలు, పెద్ద వారు అని తేడా లేకుండా ఇది అందరికీ ఇలాంటి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకనే దీన్ని ఆరోగ్యప్రదాయనిగా చెబుతారు.

ఎంత తినొచ్చు:

ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఉదయం ఒక టీ స్పూను, సాయంత్రం ఒక టీ స్పూను చొప్పున రెండు స్పూన్ల వరకు తినొచ్చు. అలాగే పిల్లలైతే అర స్పూను చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవచ్చు. ఇలా దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండటం వల్ల పై ప్రయోజనాలు చేకూరతాయి. ఏదైనా ఆరోగ్య సమస్యల కోసం దీన్ని వాడితే ఒకసారి వైద్యుల్ని, నిపుణుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మరింత మంచిది.

Whats_app_banner