Breathing Exercises: ఊపిరితిత్తుల్ని శుభ్రం చేసే డీప్ బ్రీథింగ్ వ్యాయామాలు ఇవిగో!
Breathing Exercises: కాలుష్యం నుంచి ఊపిరితిత్తుల్ని రక్షించుకోవాలంటే కొన్ని వ్యాయామాలు మరింత సహకరిస్తాయి. అలాంటి సులభమైన బ్రీతింగ్ వ్యాయామాలు ఏంటో చూసి మీరూ చేసేయండి.
శీతాకాలంలో గాలిలో దుమ్ము, కాలుష్య కారకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీపావళి తర్వాత సాధారణంగా చాలా చోట్ల గాలి నాణ్యత పడిపోతూ ఉంటుంది. ఎక్కువగా టపాసులు కాల్చడం, వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే పొగల్లాంటివి అన్నీ కలిసి తీవ్రమైన వాయు కాలుష్యాన్ని ఏర్పరుస్తాయి. మరి ఇలాంటి వాతావరణంలో మనం తిరిగితే ఆ ప్రభావం మన ఊపిరితిత్తుల మీద కచ్చితంగా ఉంటుంది. అందుకనే వాటిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని డీప్ బ్రీథింగ్ ఎక్సర్‌సైజుల్ని కచ్చితంగా చేయమని వైద్యులు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి.
చెస్ట్ బ్రీథింగ్:
ఎలాంటి ఇబ్బందీ లేకుండా నిదానంగా కూర్చోండి. ముక్కు నుంచి గాలిని వీలైనంత లోపలికి తీసుకోండి. ఇలా చేస్తున్నప్పుడు ఛాతీ భాగం ఎంత వీలైతే అంత విస్తరించాలి. అలా శ్వాసను నిలబెట్టి ఉంచ గలిగినంత సేపు ఉంచండి. తర్వాత దాన్ని నోటి ద్వారా బయటకు వదిలేయండి. దీనిలో ఛాతీ విస్తరించడం, మళ్లీ సాధారణ స్థితికి రావడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.
నోస్ట్రల్ బ్రీథింగ్:
నిదానంగా కూర్చోండి. వెన్నుపాము నిటారుగా ఉండేలా చూసుకోండి. కుడి చేతితో కుడి ముక్కును మూయండి. ఎడమ ముక్కు నుంచి దీర్ఘంగా శ్వాసను లోపలకు తీసుకోండి. తర్వాత ఎడమ ముక్కును మూయండి. కుడి ముక్కు నుంచి గాలిని బయటకు వదలండి. ఇలా ఒక ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం రెండో ముక్కు నుంచి శ్వాస వదలడం అనే పనులను ఒక దాని తర్వాత ఒక దానితో రెండు ముక్కుల నుంచీ చేయండి. పది సైకిల్స్ వరకు వీటిని చేయవచ్చు.
శ్వాసను పట్టి ఉంచండి:
నిదానంగా సుఖాసనంలో కూర్చోండి. ముక్కు నుంచి దీర్ఘంగా శ్వాసను లోపలికి పీల్చండి. దాన్ని ఎంత సేపు వీలైతే అంత సేపు పట్టి ఉంచండి. తర్వాత మెల్లగా గాలిని బయటకు వదిలేయండి. ఇలా చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆక్సిజన్‌ని మెరుగ్గా లోపలికి తీసుకో గలుగుతుంది.
లయన్ బ్రీథింగ్:
వెన్నెముక నిదానంగా ఉండేలా ప్రశాంతంగా కూర్చోండి. ముక్కు నుంచి దీర్ఘంగా శ్వాసను లోపలికి తీసుకోండి. వీలైనంత సేపు పట్టి ఉంచి తర్వాత నోటి నుంచి దాన్ని బటయకు వదలండి. వదిలేప్పుడు నాలుకను వెనక్కు మడిచి ఉంచండి. సింహం గాండ్రించినప్పుడు వచ్చే శబ్దం వచ్చేలా గాలి బయటకు విడుదల చేయాల్సి ఉంటుంది. దీన్నే లయన్ బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఛాతీ, గొంతుల్లో ఉండే ఒత్తిడి అంతా తగ్గిపోతుంది.
కాలుష్యంలో తిరిగి వచ్చాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఈ డీప్ బ్రీథింగ్ వ్యాయామాలు చేసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా మారతాయి.