Shathavari for breastmilk: తల్లిపాలను పెంచే మ్యాజికల్ బూస్టర్ శతావరి.. ఎలా ఉంటుంది? ఎవరు వాడకూడదు?
Shathavari for breastmilk: శతావరి వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. దాన్నెలా వాడాలి? ఎవరు వాడకూడదు, దాని లాభాలేంటో వివరంగా తెల్సుకోండి.
బిడ్డకు తల్లిపాలు పట్టడం ఆరోగ్యకరం. వీలుకాని పరిస్థితుల్లో తప్ప బిడ్డకు తల్లిపాలు పట్టడం ఆపకూడదు. కానీ కొందరిలో బిడ్డకు సరిపడా పాల సరఫరా ఉండకపోవచ్చు. సరైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. లేని పక్షంలో ఆయుర్వేదం ప్రకారం శతావరిని తీసుకోమని చెబుతారు. శతావరి అనేది ఒక రకమైన గలాక్టగోగ్. అంటే తల్లిపాలను పెంచే బూస్టర్ లాంటిదన్నమాట. ఇంతకీ శతావరి తీసుకోవడం మంచిదేనా? దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దాన్నెలా వాడాలో వివరంగా తెల్సుకోండి.
శతావరి వాడకం:
మీరు శతావరి వాడాలనుకుంటే ఒకసారి వైద్య సలహా తీసుకోవాలి. నిజంగా మీకు పాల ఉత్పత్తి తక్కువగా ఉంటే అవసరమైన మందులు వైద్యులే సూచిస్తారు. శతావరి గ్యాన్యూల్స్ రూపంలో, చూర్ణం రూపంలో, క్యాప్సుల్స్ రూపంలో దొరుకుతుంది. దీన్ని పరిగడుపున గోరువెచ్చని పాలు లేదా నీళ్లతో కలిపి తీసుకుంటారు. రోజుకు రెండుపూటలా వాడొచ్చు. 1 లేదా రెండు చెంచాల శతావరి చూర్ణాన్ని రోజూ తీసుకోవచ్చు. అయితే దీనికుండే చేదురుచిని ఇష్టపడనివాళ్లు క్యాప్సుల్స్ వేసుకోవచ్చు. కానీ శతావరి గ్రాన్యూల్స్ వివిధ రకాల ఫ్లేవర్లలో దొరుకుతాయి. వీటిని పాలలో వేసుకుని తాగినా చేదుదనం తెలీదు. అలాగే శతావరి చూర్ణాన్ని నెయ్యిలో వేడిచేసి ఆ నెయ్యిని తింటారు. దీనివల్ల శతావరి చేదుదనం తగ్గిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి శతావరి వాడొచ్చు. ఇది ఆన్‌లైన్‌లో, ఆయుర్వేద మందుల షాపుల్లో, మెడికల్స్ లో కూడా దొరుకుతుంది. అయితే నేరుగా శతావరి పేరుతో కాకుండా గలక్టగోగ్ గా దొరుకుతుంది.
శతావరి నిజంగా పాల ఉత్పత్తి పెంచుతుందా?
పాల ఉత్పత్తిని పెంచే మూలికలలో శతావరి ఒకటి. ఇది కార్టికాయిడ్స్, ప్రొలాక్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో తల్లిపాలలో పోషకాలు పెరిగి నాణ్యత పెరగడంతో పాటూ, పాలూ ఎక్కువగా వస్తాయి. అలాగే మన శరీరంలో కొన్ని స్టిరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని శతావరి ప్రేరేపిస్తుంది. దాంతో పాల ఉత్పత్తి పెరుగుతుంది. శతావరిలో యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి శరీరంలో కణజాలం దెబ్బతినకుండా ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడతాయి.
డెలివరీ తర్వాత నిద్రలేమి, ఒత్తిడి, ఇతర కారణాల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటపడటానికి శతావరి సాయపడుతుంది. మనం మాట్లాడుకునే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడేస్తుంది. అంతేకాదు ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. పాల ఉత్పత్తి పెంచడంతో పాటూ మిగతా మంచి చేసే గుణాల వల్ల శతావరిని డెలివరీ తర్వాత తీసుకోమని చెబుతారు.
శతావరి ఎవరు వాడకూడదు:
శతావరిని దీర్ఘకాలంగా వాడినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెబుతున్నారు. కానీ కొంతమందికి ఇది పడకపోవచ్చు. అలాంటి వాళ్లలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం దురదగా అనిపించడం, ఎరుపెక్కడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే దీనికి రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి షుగర్ కోసం మందులు వాడితే దీన్ని వైద్యుల్ని సంప్రదించాకే వాడాలి. దీన్ని వాడటం వల్ల మూత్ర విసర్జనకు కొంతమంది ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బంది అనిపించినా గమనించుకోవాలి.