Bath salts benefits: ఒత్తిడి నుంచి హాయి కోసం బాత్‌ సాల్ట్స్‌ని ఎప్పుడైనా వాడి చూశారా..-know about bath salts and different benefits of them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bath Salts Benefits: ఒత్తిడి నుంచి హాయి కోసం బాత్‌ సాల్ట్స్‌ని ఎప్పుడైనా వాడి చూశారా..

Bath salts benefits: ఒత్తిడి నుంచి హాయి కోసం బాత్‌ సాల్ట్స్‌ని ఎప్పుడైనా వాడి చూశారా..

HT Telugu Desk HT Telugu
Oct 22, 2023 06:30 PM IST

Bath salts benefits: స్నానం చేసేటప్పుడు వాడే బాత్ సాల్ట్స్ వల్ల బోలెడు లాభాలు. అవి కేవలం వాసన కోసమో, ఫ్యాన్సీగా ఉండటం కోసమో కాదు. వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి.

బాత్ సాల్ట్స్ లాభాలు
బాత్ సాల్ట్స్ లాభాలు (pexels)

పూర్వ కాలం నుంచి ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని కలిగించేందుకు స్నానం చేసేప్పుడు బాత్‌ సాల్ట్స్‌ని ఉపయోగించే పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. వీటిలో ఉండే మినరళ్ల వల్ల కండరాలకు హాయి చేకూరుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మీరు గనుక రోజూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతుంటే సాయంత్రం పూట బాత్‌ సాల్ట్స్‌ని ఉపయోగించి స్నానం చేయండి. స్పాలు, పెద్ద పెద్ద హోటళ్లలోనూ స్నానానికి ఈ ఉప్పుల్ని ఇస్తూ ఉంటారు. మరి వీటి వల్ల వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

కండరాలకు రిలాక్సేషన్‌ :

స్నానం చేసే నీరున్న బకెట్‌లో గాని, బాత్‌ టబ్‌లోగాని ఈ బాత్‌ సాల్ట్స్‌ని వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల కండరాల వాపులు, నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఎక్కువగా వ్యాయామాలు చేసేవారు, బెణుకులు, నొప్పులతో బాధ పడేవారు, అథ్లెట్లు దీన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కండరాలకు శ్వాంతన కలుగుతుంది.

చర్మానికి పునరుజ్జీవం :

సముద్రం నుంచి ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరు చేసే ఈ బాత్‌ సాల్ట్స్‌లో ఎన్నో మినరళ్లు ఉంటాయి. ఇవి చర్మంలో తేమను తగినంతగా ఉంచేందుకు సహకరిస్తాయి. దీంతో అది సహజంగా బిగుతుగా, కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై మృత కణాలన్నీ తొలగిపోయి, తిరిగి కొత్త కణాలు ఏర్పడటాన్ని ఈ ఉప్పులు ప్రోత్సహిస్తాయి. మొత్తం శరీరపు చర్మం డిటాక్స్‌ అవుతుంది. దీని వల్ల పేరుకున్న విష పదార్థాలు అన్నీ తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యకరంగా రంగును మెరుగు పరుచుకుంటుంది. దీంతో అది మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. చర్మ సంబంధిత వ్యాధులతో బాధ పడే వారు కూడా వీటితో స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రక్త ప్రసరణ మెరుగవుతుంది :

బాత్‌ సాల్ట్స్‌లో ఉండే మెగ్నీషియం వల్ల ప్రధానంగా శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహకరిస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల వచ్చే దుష్ఫలితాల నుంచి రక్షిస్తుంది. తిమ్మిర్లు, వాపుల్లాంటివీ తగ్గుముఖం పడతాయి.

నిద్ర నాణ్యతను పెంచుతుంది :

బాత్‌ సాల్ట్స్‌ని ఉపయోగించి స్నానం చేయడం వల్ల శరీరానికి హాయిగా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళనల్లాంటివి తగ్గుముఖం పడతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది. నాణ్యమైన నిద్రను ఈ ఉప్పు ప్రోత్సహిస్తుంది. గాఢమైన నిద్రలో మన శరీరం ఎన్నో మరమ్మతులు చేసుకుంటుంది. అందువల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మరుచటి రోజు ఉదయం మనం ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా లేచి అన్ని పనులనూ చక్కగా చక్కబెట్టుకోగలుగుతాం.

Whats_app_banner