Relationship: రిలేషన్‌షిప్‌లో ఉంటే శృంగారంలో పాల్గొనడం తప్పనిసరా? ఒకవేళ నో చెప్తే ఏమవుతుంది?-is sex important in a relationship here is what experts say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Relationship: రిలేషన్‌షిప్‌లో ఉంటే శృంగారంలో పాల్గొనడం తప్పనిసరా? ఒకవేళ నో చెప్తే ఏమవుతుంది?

Relationship: రిలేషన్‌షిప్‌లో ఉంటే శృంగారంలో పాల్గొనడం తప్పనిసరా? ఒకవేళ నో చెప్తే ఏమవుతుంది?

Galeti Rajendra HT Telugu
Oct 23, 2024 09:00 PM IST

Live in Relationship: ప్రేమ బంధానికి రెగ్యులర్‌గా శృంగారం అవసరమని కొంత మంది నమ్ముతుండగా, మరికొంత మంది శృంగారంపై ఎక్కువగా ఆధారపడకుండా ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే.. జంటలకి సాధారణంగా తలెత్తే కొన్ని అనుమానాలకి సెక్సాలజిస్ట్, సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ కుమావత్ సమాధానం.

రిలేషన్‌షిప్‌లో శృంగారం తప్పనిసరా?
రిలేషన్‌షిప్‌లో శృంగారం తప్పనిసరా?

లవ్, డేటింగ్‌, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌.. ఇలా బంధం ఏదైనా.. కొంత మంది పెళ్లికి ముందే హద్దులు దాటడం ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అయితే.. అందరూ అలా ఉన్నారని కాదు. కానీ కొంత మంది మాత్రం క్షణికావేశంలో తొందరపడుతున్నారు. దానికి ప్రేమికుడి ఒత్తిడి లేదా పరిస్థితులు ఇలా కారణం ఏదైనా కావొచ్చు. కానీ వివాహానికి ముందే కొందరు శృంగారంలో పాల్గొంటున్నారనేది నిజం.

ప్రేమ బంధం బలపడాలంటే భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలా? ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో లైంగికంగా కలవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ భాగస్వామి నుంచి వచ్చే శృంగార ప్రతిపాదనని నిరాకరిస్తే.. బంధంలో చీలిక వస్తుందా? ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. ఈ ప్రశ్నలకి సమాధానమిస్తూ సెక్సాలజిస్ట్, సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్ కుమావత్ కొన్ని అంశాల్ని ప్రస్తావించారు.

ఇష్టంతో ఓకే.. కానీ బలవంతం వద్దు

ప్రేమికులు సంబంధంలో ప్రధానంగా ఒకరిపై మరొకరికి విశ్వాసం, గౌరవం ముఖ్యం. ఇక శృంగారం అనేది వారి వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు తమ బంధంలో శృంగారం ఉండాలని భావిస్తే అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత నిర్ణయం అవుతుంది. అయితే.. అందుకు ఇద్దరు వ్యక్తులు కూడా మానసికంగా, శారీరకంగా సంభోగానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అది జరగాలి. బలవంతంగా శృంగారం చేయడం అస్సలు సమర్థనీయం కాదు.

ఒత్తిడి తెచ్చినా.. ఇష్టం లేకపోతే నో

ప్రేమ అనేది శారీరకంగా మాత్రమే కాకుండా భావోద్వేగాలు, గౌరవం, దయ, సహనంతో కూడుకున్నది. ప్రేమ జీవితంలో శృంగారం లేకపోయినా.. ప్రేమ సురక్షితంగా ఉండవచ్చు. అయితే కొంత మంది ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. కానీ.. మీకు ఇష్టం లేనప్పుడు లేదా భాగస్వామిపై నమ్మకం లేనప్పుడు నో చెప్పడానికి సందేహించొద్దు.

ప్రొటెక్షన్ టాప్ ప్రయారిటీ

ఇద్దరూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు ప్రొటెక్షన్ తీసుకోవడం మంచిది. సంభోగం సమయంలో కండోమ్స్ వంటి ప్రొటెక్షన్ వాడడం ద్వారా ఆనారోగ్య సమస్యలతో పాటు అవాంఛిత గర్భధారణను నివారించవచ్చు. ఈ విషయంలో ప్రేమికులు రాజీపడితే ఆ తర్వాత పర్యావసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

శృంగారంతో రిలాక్స్

ప్రేమ, డేటింగ్, లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటూ శృంగారంలో పాల్గొంటే ఫలితంగా ఏర్పడే ఒక రకమైన శారీరక సాన్నిహిత్యం బంధం మరింత బలపడేలా చేస్తుంది. ఇది భాగస్వామితో సాన్నిహిత్యం, భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది. మంచి శృంగారం అనేది ఒత్తిడిని తగ్గించే చర్య, ఇది ఎండార్ఫిన్‌లను విడుదల చేసి మీ ఒత్తిడిని తగ్గించడంతో పాటు నిద్ర రూపంలో తగినంత విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.

నో సింపుల్‌.. కానీ కమ్యూనికేషన్ కీలకం

శృంగారం అనేది సంబంధంలో అంతర్భాగమైనప్పటికీ అది తప్పనిసరి కాదు. కొన్ని సంబంధాలు శృంగారం లేకుండా మనుగడ సాగించగలవు. అయినప్పటికీ ఇది భాగస్వాములపై ​​ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమంది జంటలు కూడా శృంగారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటూ ఉంటాయి. అయితే ఈ విషయాన్ని సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతే.. అది మీ భాగస్వామి మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపవచ్చు. ఇది నెమ్మదిగా సంబంధంలో అనుమానం, నిరాశను పెంచవచ్చు. దాంతో మీ బంధంలో చీలిక వచ్చే ప్రమాదాలూ లేకపోలేదు.

Whats_app_banner