International Chess Day 2023: ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‌లలో చదరంగం కూడా ఒకటి. ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్ ఆడే వారు ఉంటారు. చెస్ ఆటను నిజ జీవితానికి సూచికగా తరచూ చెప్తారు, 'జీవితమే ఒక చదరంగం' అంటూ ప్రస్తావించడం తెలిసిందే. ఈ చెస్ అనేది ఇద్దరు కలిసి ఆడే ఆట. దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఆటలో గెలవాలంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలిసుండాలి. ఈ ఆటలో ఒక రాజసం ఉంది, అందుకే మామూలు వ్యక్తులే కాకుండా రాజకీయంలో ఉండే వారూ ఈ ఆటను ఎక్కువ ఇష్టపడతారు.
ఈరోజు అంతర్జాతీయ చదరంగం దినోత్సవం. ప్రతి సంవత్సరం, జూలై 20న అంతర్జాతీయ చదరంగం దినోత్సవాన్ని చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా, జూలై 20, గురువారం నాడు ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మేధోపరమైన, సాంస్కృతిక, చారిత్రక ఆటకు గుర్తింపు తీసుకురావడం కోసం జూలై 20న ప్రపంచ చదరంగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.
చరిత్ర ప్రకారం, చదరంగం ఆట మూలాలు భారతదేశంలోనే ఉన్నట్లు అర్థమవుతుంది. గుప్తుల కాలంలో ఉత్తర భారత ఉపఖండంలో ఆడిన చతురంగ ఆటలో భాగంగానే చదరంగం మూలాలు ఉన్నాయని నమ్ముతారు. వివిధ దేశాల మధ్య వాణిజ్యం ప్రారంభమైనపుడు వర్తకుల ద్వారా భరతఖండం నుంచి పశ్చిమాన పర్షియా వరకు ఈ చదరంగం ఆట వ్యాపించింది. అక్కడ వారు ఈ ఆటను చత్రంగ్ లేదా షత్రంజ్ అనే పేరుతో పిలిచేవారు. చదరంగం ఆట ప్రారంభ సూచనలు 600 CE నాటి పర్షియన్ మాన్యుస్క్రిప్ట్‌లో గుర్తించడం జరిగింది, దీనిని భారత ఉపఖండంకు చెందిన రాయబారి ద్వారా నాటి పర్షియన్ రాజు ఖోస్రో Iకి బహుమతిగా అందించారు. కాలక్రమేణా, ఇది ఐరోపా, రష్యాలోనూ ప్రజాదరణ పొందింది, ఈక్రమంలో ఈ ఆట 2,000 కంటే ఎక్కువ వేరియంట్‌లుగా రూపాంతరం చెందింది. ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక చెస్‌గా పరిణామం చెందింది.
మరెందుకు ఆలస్యం, మీరు చెస్ ఆడటం ప్రారంభించండి, మానసికంగా మెరుగ్గా అవ్వండి.
సంబంధిత కథనం