Food for Blood: పూర్తిగా వెజిటేరియన్ ఆహారంతోనే మీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోండి, ఇందుకోసం ఏం తినాలంటే-increase your hemoglobin levels with a completely vegetarian diet what to eat for this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food For Blood: పూర్తిగా వెజిటేరియన్ ఆహారంతోనే మీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోండి, ఇందుకోసం ఏం తినాలంటే

Food for Blood: పూర్తిగా వెజిటేరియన్ ఆహారంతోనే మీ హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోండి, ఇందుకోసం ఏం తినాలంటే

Haritha Chappa HT Telugu
Sep 10, 2024 09:30 AM IST

Food for Blood: రక్తహీనత సమస్య వచ్చేది హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్లే. హిమోగ్లోబిన్ స్థాయిలను పూర్తి శాకాహారంతో పెంచుకోవచ్చు. ఇందుకోసం ఏం తినాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి.

హిమోగ్లోబిన్ కోసం తినాల్సిన ఆహారాలు ఏమిటి?
హిమోగ్లోబిన్ కోసం తినాల్సిన ఆహారాలు ఏమిటి? (Pixabay)

Food for Blood: చిన్న పనికి అలసిపోవడం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు నీరసంగా ఉండడం, దేని మీద ఆసక్తి లేకపోవడం... ఇవన్నీ కూడా రక్తహీనత సమస్య లక్షణాలు. రక్తహీన సమస్య ఉన్న వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

హిమోగ్లోబిన్ అంటే ఏమిటి?

హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది శరీరం అంతా ఆక్సిజన్ రవాణా చేయడానికి సహాయపడుతుంది. శరీరంలోని అవి ఇతర భాగాలకు ఆక్సిజన్ చేరవేయడంలో ఈ ప్రోటీన్‌ది ముఖ్యపాత్ర. హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోతే జీవశక్తి, బలం తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ పెంచుకోవడానికి మాంసాహారాన్ని తినాలని ఎక్కువమంది అనుకుంటూ ఉంటారు. నిజానికి పూర్తి శాకాహారంతో కూడా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. ఇందుకోసం ఏం తినాలో తెలుసుకోండి.

కాయధాన్యాలు

చిక్కుళ్లు, బీన్స్ వంటి కాయ ధాన్యాలను ఎక్కువగా మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి. ఈ కాయ ధాన్యాల్లో నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో హిమోగ్లోబిన్ ప్రోటీన్ లభిస్తుంది. అలాగే ఫైబర్‌ను అందిస్తుంది. వీటిని సూప్‌లు, కూరలు, సలాడ్లుగా మార్చుకొని తింటే మంచిది. ఈ కాయధాన్యాల్లో ఫోలేట్ కూడా అధికంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాల నిర్మాణానికి అవసరమైన బి విటమిన్, హిమోగ్లోబిన్ ఈ కాయ ధాన్యాల్లో అధికంగా ఉంటాయి.

క్వినోవా

క్వినోవా అనేది ఒక రకమైన ధాన్యం. ఇది సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉన్నవారు లేదా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు క్వినోవాను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది ప్రోటీన్ నాన్ హీమ్ ఐరన్‌ను కలిగి ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి అవసరమైన ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. అన్నానికి బదులు ఒక పూట క్వినోవా తినడం అలవాటు చేసుకుంటే మంచిది.

కొమ్ము శెనగలు

కొమ్ము శెనగలను నార్త్ ఇండియాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఛోలే బటూరే చెయ్యడానికి ఈ చిక్ పీస్‌ను ఉపయోగిస్తారు. వీటిలో ఐరన్ అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా నిండుగా ఉంటాయి. తరచూ కొమ్ము శెనగలను తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

పాలకూర

రెండు రోజులకు ఒకసారి పాలకూరను తింటే చాలు, హిమోగ్లోబిన్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. వీటిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన నాన్ హీమ్ ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా నిండుగా ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ఆహారం కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇనుము శోషణను పెంచుతుంది.

గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు మార్కెట్లో దొరుకుతాయి. వీటిలో నాన్ హీమ్ ఐరన్ అధికంగా ఉంటుంది. గుప్పెడు గుమ్మడి గింజలను ప్రతి రోజు తినడం వల్ల మెగ్నీషియం, జింక్ వంటి ప్రధాన పోషకాలు అందుతాయి. ఈ గుమ్మడి గింజలను పచ్చిగా తిన్నా మంచిదే. లేదా కళాయిలో కాస్త వేయించుకుని తిన్నా మంచిదే. హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో ఇది ముందుంటుంది.

బీట్‌రూట్

బీట్‌రూట్ లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ. హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడంలో బీట్రూట్ సహాయపడుతుంది. ఐరన్, విటమిన్ సి వంటివి ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి ఎంతో అవసరం. బీట్రూట్ ను రెండు మూడు రోజులకు ఒకసారి తినడం వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.

అలాగే బ్రోకోలి, తృణధాన్యాలు, చిలగడదుంపలు వంటి వాటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటన్నింటిలో కూడా నాన్ హీమ్ ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అత్యవసరమైనవి. హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోకుండా, రక్తహీనత సమస్య రాకుండా అడ్డుకోవడంలో ఈ ఆహారాలన్నీ ముందుంటాయి. ముఖ్యంగా ఇవన్నీ శాఖాహారాలే. కాబట్టి ప్రతి ఒక్కరూ తినవచ్చు.

టాపిక్