Walking: వాకింగ్‌‌ను తేలిగ్గా తీసుకోవద్దు, మీ వయసులో రోజుకి ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?-ideal distance to walk everyday for all age groups ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walking: వాకింగ్‌‌ను తేలిగ్గా తీసుకోవద్దు, మీ వయసులో రోజుకి ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?

Walking: వాకింగ్‌‌ను తేలిగ్గా తీసుకోవద్దు, మీ వయసులో రోజుకి ఎన్ని అడుగులు వేయాలో తెలుసా?

Galeti Rajendra HT Telugu
Oct 13, 2024 08:30 AM IST

Daily Walking Limit: కొంత మందికి స్నేహితులతో కలిసి వాకింగ్ చేయడం ఇష్టం. మరికొందరు కొలీగ్స్‌తో కలిసి వాకింగ్‌కి వెళ్తుంటారు. చాలా మంది మ్యూజిక్ వింటూ వాకింగ్ చేస్తుంటారు.

వాకింగ్
వాకింగ్

వాకింగ్ అనేది మనం చురుకుగా, ఫిట్‌గా ఉండటానికి సులభమైన వ్యాయామ మార్గాల్లో ఒకటి. అయితే చాలా మందిలో రోజుకి ఎంత దూరం నడవాలి? ఏ సమయంలో నడిస్తే మంచిది? అనే సందేహాలు ఉంటాయి. అలానే కొంత మందికి రోజుకి ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యంగా ఉంటాము? అనేదానిపై కూడా క్లారిటీ ఉండదు. ఇలాంటి సందేహాలు మీలోనూ ఉన్నాయా? అయితే ఇది చదవండి.

వాకింగ్ చేసే టైమ్

ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాకింగ్ చేయడానికి ఉత్తమ సమయంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఉదయం సూర్యరశ్మి మీ శరీరంపై పడుతున్న సమయంలో వాకింగ్ చేస్తే మీరు మంచి అనుభూతిని చెందుతారు. అలానే సూర్యరశ్మితో విటమిన్-డి కూడా మీకు లభిస్తుంది. దాంతో ఎముకలు బలంగా ఉంటాయి. సాయంత్రం 4 గంటల తర్వాత రాత్రి మీకు వీలుని బట్టి వాకింగ్‌కి సమయం కేటాయించుకోవచ్చు.

ఏ వయసు వారు.. ఎన్ని అడుగులు?

మీ వయసు 60 ఏళ్లలోపు అయితే రోజుకి 8,000-10,000 అడుగులు వరకు వాకింగ్ చేయవచ్చు. రెగ్యులర్‌గా ఇలా నడిస్తే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా మీ దరిచేరవు. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేసేవారు.. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మీరు 60 ఏళ్లు పైబడిన వారైతే ప్రతిరోజూ 6,000-8,000 అడుగులు నడిస్తే చాలు.

రోజులో ఎంతసేపు నడవాలి?

60 ఏళ్లలోపు వ్యక్తులు రోజుకి కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఓవరాల్‌గా వారానికి కనీసం 150 నిమిషాలకి తగ్గకుండా వాకింగ్‌కి సమయం కేటాయించాలి. వయసు పైబడిన వారు వారి శరీరం సహకరించేంత వరకు వాకింగ్ చేయవచ్చు. వాకింగ్‌తో మీకు గుండె సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు బరువు కూడా మీ అదుపులో ఉంటుంది. అలానే మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

వాకింగ్‌తో కలిగే ప్రయోజనాలు

ప్రతిరోజూ రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అలానే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మరీ ముఖ్యంగా.. ఆంగ్జయిటీ, డిప్రెషన్‌‌లో ఉన్న వారికి వాకింగ్ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ వాకింగ్‌తో మన శరీరంలోని కండరాలు బలపడతాయి. అలానే చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

జీవితకాలం పెరుగుతుంది

ప్రతి రోజూ రెగ్యులర్‌గా వాకింగ్ చేస్తే ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. వాకింగ్ వల్ల కనీసం 10-15 సంవత్సరాలు జీవిత కాలం పెరిగే అవకాశం ఉంది. మీరు ఇప్పటికే వాకింగ్ చేస్తుంటే నిరభ్యంతరంగా కొనసాగించండి. ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే నెమ్మదిగా ప్రయత్నించండి.

తొలుత కొంచెం దూరం వాకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా దూరం పెంచుకుంటూ వెళ్లండి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజులో 30 నిమిషాల వరకు లేదా 5-6 కిలోమీటర్లు వాకింగ్ చేయవచ్చు.

వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా వాకింగ్ చేయవచ్చు. అయితే వాకింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవడంతో పాటు సౌకర్యవంతమైన దుస్తులు, బూట్లు ధరించడం కూడా ముఖ్యం.

Whats_app_banner