How to stop period pain: పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి?
How to stop period pain: పీరియడ్ సమయంలో నొప్పి చాలా వేధిస్తుంది. ఈ నొప్పిని డిస్మెనోరియా అని కూడా పిలుస్తారు. చాలా మంది మహిళలు ఈ నొప్పిని అనుభవిస్తారు. ఈ నొప్పి ఒక్కోసారి కొందరిలో తీవ్రంగా ఉంటుంది.

How to stop period pain: పీరియడ్స్ సమయంలో నొప్పి తగ్గాలంటే ఈ చిట్కాలు ప్రయత్నించండి (pixabay)
పీరియడ్ సమయంలో నొప్పి ఒక్కోసారి కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు కూడా ఉంటుంది. ఈ పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంటి వద్దే పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
పీరియడ్స్ నొప్పి తగ్గించే చిట్కాలు
- తగినంత వేడి నీటితో స్నానం లేదా షవర్ బాత్ చేయండి. మీ గర్భాశయం, పొత్తికడుపులోని కండరాలు సడలించడంలో వేడి నీరు సహాయపడుతుంది. ఇది పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
- మీరు లావెండర్ ఆయిల్ లేదా క్యాముమైల్ ఆయిల్ వంటి కొన్ని ముఖ్యమైన నూనెలను నీటిలో జత చేస్తే అవి ప్రశాంతతను కూడా ఇస్తాయి. వీటికి నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి.
- హీటింగ్ ప్యాడ్ లేదా హాట్ వాటర్ బాటిల్ ఉపయోగించండి. హీటింగ్ ప్యాడ్ లేదా వేడి నీటి సీసాను మీ పొత్తికడుపు లేదా వెనుక భాగంలో 10-15 నిమిషాలు అప్లై చేయండి. వేడి కండరాలను సడలించడానికి, నొప్పిని తగ్గించడానికి ఈ చిట్కా సహాయపడుతుంది.
- భరించలేని నొప్పి ఉన్నప్పుడు వైద్యుల సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడొచ్చు. కొన్ని రకాల నాన్‌స్టెరాయిడ్, యాంటీ ఇన్‌ప్లమేటరీ డ్రగ్స్ నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
- మీ పొత్తికడుపు లేదా వెనుక భాగంలో మసాజ్ చేయడం వల్ల కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి వీలవుతుంది. నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. మీరు మసాజ్ నూనెను ఉపయోగించవచ్చు. లేదా మీ చేతులతో మసాజ్ చేసుకోవచ్చు. సున్నితంగా, వృత్తాకారంలో మసాజ్ చేయండి. ఒక 10 నిమిషాలు మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
- యోగా లేదా స్ట్రెచ్ వ్యాయామాలు చేయడం వల్ల పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కొన్ని యోగా భంగిమలు ఇక్కడ చూడొచ్చు. మార్జాలాసనం, బాలాసనం, ఆపానాసనం, సేతు బంద సర్వాంగాసన (బ్రిడ్జ్ పోజ్), విపరీత కరణి ఆసనం (లెగ్స్ అప్ ది వాల్ పోజ్) వంటివి ఉపశమనం కలిగిస్తాయి.
- మీకు వీలైతే మీరు పీరియడ్స్ నొప్పిని ఎదుర్కొంటున్నప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి యత్నించండి. నొప్పి తగ్గే వరకు కఠినమైన పనులు చేయకుండా ఉండండి. వీలుంటే మీ రోజు వారీ పని నుంచి సెలవు తీసుకోండి.
- అల్లం టీ లేదా క్యాముమైల్ టీ వంటి హెర్బల్ టీలు తాగడం కూడా ఉపయోగపడుతుంది. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, నొప్పి ఉపశమన లక్షణాలను కలిగి ఉంటాయి.
- సూప్, అల్లం, పసుపు వంటి వేడినిచ్చే ఆహారం తినడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
- చల్లని ఆహారాలు, పానీయాలను నివారించాలి. ఇవి రక్త నాళాలు సంకోచించేలా చేసి నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి.
మీ పీరియడ్స్ నొప్పి తీవ్రంగా ఉంటే లేదా ఇంటి చిట్కాలతో ఉపశమనం లభించకపోతే మీరు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. మీ నొప్పికి ఎండోమెట్రియోసిస్ లేదా ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర అనారోగ్య పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చు.