Yoga for students: పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనానికి 6 యోగా భంగిమలు
Yoga for students: పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనానికి విద్యార్థులకు 6 యోగా భంగిమలను నిపుణులు సూచించారు. మీ పిల్లలకు ఇవి నేర్పించి సహాయపడండి. వారిపై ఒత్తిడి తగ్గించండి.
పాఠశాలకు వెళ్లే పిల్లలపై తల్లిదండ్రుల అంచనాలు పెరిగినకొద్దీ వారిలో అనవసరపు ఒత్తిడి మొదలవుతుంది. అది అంతిమంగా తీవ్రమైన ప్యానిక్ అటాక్‌కు దారితీస్తుంది. సున్నితమనస్కులైతే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలూ వస్తాయి. విద్యార్థులు ఈ ఒత్తిడిని అధిగమించడానికి యోగా దివ్యమైన సాధనమని యోగా నిపుణులు విశ్వసిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఒత్తిడి నుంచి గట్టెక్కడానికి ఈ యోగాభ్యాసంలో సహకరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అక్షర్ యోగా సంస్థ, హిమాలయ యోగాశ్రమ, వరల్డ్ యోగా ఆర్గనైజేషన్‌ల స్థాపకుడు హిమాలయ సిద్ద అక్షర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై మాట్లాడారు. ‘అన్ని వయస్సుల పిల్లలు యోగా సాధనతో ప్రయోజనం పొందుతారు. వారి సంపూర్ణ ఆరోగ్యానికి ఇది అవసరం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా మెరుగుపడుతాయి. తద్వారా విద్యార్థులు మరింత రాణిస్తారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి 7 ఉత్తమ యోగా భంగిమలను ఆయన సూచించారు.
1. Kakasana (Crow pose): కాకాసనం
కాకాసన భంగిమ ఎలా చేయాలి: సమస్థితితో ప్రారంభించాలి. అర చేతులు ఫ్లాట్‌గా ఉంచాలి. ముందుకు కాస్త వంగడం వల్ల మీ బరువు మీ చేతులపై పడుతుంది. ఇక్కడి ఫోటోలో చూపినట్టు బ్యాలెన్స్‌తో మీ కాళ్లను లేపాలి.
2. Padmasana: పద్మాసనం
పద్మాసనం ఎలా వేయాలి?: కూర్చుని మీ ఎడమ మోకాలు మడిచి మీ కుడి తొడపై పెట్టాలి. అదేవిధంగా కుడి మోకాలు మడిచి ఎడమ మోకాలుపై పెట్టాలి.
3. Padahasthasana: పాద హస్తాసనం
పాద హస్తాసనం ఎలా వేయాలి: నిల్చుని గాలి పీల్చి మీ రెండు చేతులు పైకి ఎత్తాలి. మీ శ్వాసను ఓ రెండు సెకెండ్లు ఆపి గాలి వదలాలి. అలా వదులుతూ ఇప్పుడు ముందుకు వంగాలి. మీ చేతులు మీ కాలి అడుగులకు సమాంతరంగా నేల మీద ఆనాలి. అయితే మోకాళ్లు వంచరాదు.
4. Paschimottanasana (Seated Forward Bending): పశ్చిమోత్తనాసనం
పశ్చిమోత్తనాసనం: ముందుగా దండాసనంతో మొదలుపెట్టండి. మీరు తొలుత గాలి పీల్చుకుని వదిలేయండి. గాలి వదులుతుండగానే మీరు ముందుకు వంగి మీ శరీర పైభాగం మీ శరీర కిందిభాగంపై ఆనేలా ఉంచండి. ఇప్పుడు మీ చేతులు మీ కాలి వేళ్లను ఆనించేలా చూడండి. మీ ముక్కు మీ మోకాళ్లకు ఆనించాలి. కొద్దిసేపు ఈ భంగమలో ఉండాలి.
5. Sirshasana (Headstand Pose): శీర్షాసనం
శీర్షాసనం ఎలా వేయాలి? తొలుతు వజ్రాసనంతో ప్రారంభించాలి. మీ మోచేతులు నేలపై ఆన్చాలి. మీ ఆరచేతులు మోచేతులు ఒక సమబాహు త్రిభుజం ఏర్పరచాలి. మీ తల నుదురు భాగం మీ అరచేతులకు ఆనిస్తూ నేలపై ఉంచాలి. మీ తల వెనకభాగానికి మీ అరచేతులు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీ కాళ్లు నెమ్మదిగా పైకి లేపాలి. వెన్నుముక నిటారుగా ఉండేంతవరకు పైకి లేపాలి. ముందుగా మీ కుడి కాలును లేపి మీ చాతి ప్రాంతంలో ఉంచాలి. దాన్ని నిధానంగా బ్యలెన్స్ చేస్తూ ఎడమ కాలు లేపాలి. మీరు కొనసాగించినంత సేపు ఈ భంగిమలో ఉండొచ్చు.
6. Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా
సూపర్ బ్రెయిన్ యోగా: నిల్చుని మీ ఎడమ చేతిని లేపి మీ కుడి వైపు చెవిని బొటన వేలు, చూపుడు వేలితో కలిసి పట్టుకోవాలి. అలాగే కుడి చేతిని లేపి ఎడమ వైపు చెవిని పట్టుకోవాలి. ఎడమ చేయి కుడి చేయికి ముందు ఉండాలి.
ఇప్పుడు గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా కూర్చున్న భంగిమలోకి వెళ్లాలి. రెండు మూడు సెకెండ్లు అలా ఉండి నెమ్మదిగా గాలి వదులుతూ పైకి లేవాలి. ఇలా రోజుకు 15 సార్లు చేయాలి. పాఠశాలల్లో పిల్లలకు పనిష్మెంట్‌గా ఇలా బస్కీలు తీయించడం మీరు చూసే ఉంటారు.