Palli Modak: గణేషునికి నైవేద్యంగా పల్లీలు బెల్లంతో పది నిమిషాల్లో ఈ మోదుకలు చేసేయండి
Modak: సెప్టెంబర్ 7 నుండి గణేశోత్సవం ప్రారంభం కానుంది. అటువంటి పరిస్థితిలో, ఈ రోజున మీరు గణపతి బప్పాకు వేరుశెనగ మోదకాన్ని సమర్పించవచ్చు. వేరుశెనగ మోదక్ భోగ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి-
గణపతికి మోదుకలు చాలా ఇష్టమైన నైవేద్యం. సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకుని రాక కోసం ఇంటి అలంకరణతో పాటూ రకరకరాల నైవేద్యాలు సమర్పిస్తారు. మోదుకలు చాలా చోట్ల రకరకాలుగా తయారు చేస్తారు. మీరూ వినాయకునికి ప్రత్యేకంగా మోదుకలు చేయాలనుకుంటే ఇలా పల్లీలతో ట్రై చేయండి. చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోతాయి.
పల్లీల మోదుకలు తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల వేరుశెనగ
అరకప్పు పొడి చేసిన బెల్లం లేదా తురిమిన బెల్లం
2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి
పల్లీల మోదుకలు తయారీ విధానం:
- అడుగు మందం ఉన్న ప్యాన్ ఒకటి స్టవ్ మీద పెట్టుకోండి. అందులో పల్లీలు వేసి వేయించుకోండి.
- పల్లీలు రంగు మారి పచ్చిదనం పూర్తిగా పోయి కరకర అయ్యే వరకు వేయించాలి.
- ఒక ప్లేటులో ఈ పల్లీలను తీసుకుని చల్లారాక పొట్టు తీసేసుకోవాలి.
- మిక్సీ జార్ లో ఈ పల్లీలను వేసుకుని కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి. తర్వాత బెల్లం వేసి మరోసారి మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టండి.
- చివరగా నెయ్యి కూడా కలిపి ఒకసారి మిక్సీ పట్టారంటే పిండి ముద్దలాగా రెడీ అయిపోతుంది.
- మీ దగ్గర మోదుకల అచ్చులు ఉంటే అందులో దానికి నెయ్యి రాసి ఈ మిశ్రమం పెట్టి మోదుకల ఆకారం తీసుకురండి. లేదంటే చేత్తోనే మోదుకల్లాగా చేసేయండి.
అచ్చం ఇదే పద్దతి ఫాలో అయ్యి నువ్వులతోనూ మోదుకలు చేసుకోవచ్చు. నువ్వులు వేయించి బెల్లం వేసి మిక్సీ పట్టి మోదుకల్లాగా చేసుకోవచ్చు. లేదంటే గోధుమపిండి, రవ్వ సమపాళ్లలో తీసుకుని కాస్త ఉప్పు వేసి చపాతీ పిండి లాగా కలుపుకుని. చిన్న గుండ్రటి బిల్లలు చేసి మధ్యలో ఈ పల్లీల మిశ్రమం ఉంచాలి. దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసినా సాంప్రదాయ మోదుకలు రెడీ అవుతాయి.