Clay ganesh step by step: ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మట్టి వినాయకుణ్ని సులభంగా తయారు చేయొచ్చు
Clay ganesh step by step: ఇంట్లోనే మట్టి వినాయకుడు తయారు చేయాలి అనుకుంటున్నారా? అయితే వివరంగా ముందు నుంచి చివరి దాకా ఏమేం చేయాలో సులభమైన స్టెప్స్ లో చూసేయండి.
వినాయక చవితి రోజు మీ స్వహస్తాలతో వినాయకుణ్ని తయారు చేస్తే వచ్చే సంతృప్తి వేరు. మీ చేతితో రూపం ఇచ్చిన గణేషుణ్ని కొలిస్తే పండగ తెచ్చే ఆనందం రెట్టింపవుతుంది. అందుకోసం వినాయకుణ్ని సులభంగా తయారీని ఇలా సింపుల్ స్టెప్స్ లో చేసేయొచ్చు.
మట్టి వినాయకుడి తయారీ:
1. ఇంట్లో వినాయకుణ్ని తయారు చేయడం కోసం బంకమట్టిని మాత్రమే వాడాలి. ఎర్రమట్టి వాడితే ఆకారం నిలవదని గుర్తుంచుకోండి. దానికోసం బయట నుంచి నేరుగా మట్టిని కొనుగోలు చేయొచ్చు. లేదా ఇంటికి సమీపంలో నల్లమట్టి దొరికితే తెచ్చుకోండి.
2. దాన్ని ముందు జల్లించి పెద్ద బండల్లాంటివి ఉంటే తీసేయాలి.
3. ఇప్పుడు ఈ మట్టిని శుభ్రం చేయడం కోసం నీళ్లలో నానబెట్టాలి. ఆ మట్టిని ఒక గుడ్డలో వడకట్టితే నీరంతా కారిపోతుంది. గణేషుని తయారీ కోసం వాడే మట్టి కాబట్టి శుభ్రం చేయడం తప్పనిసరి.
4. ఆ మట్టి నీళ్లు వడిచిపోయి ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు విగ్రహం తయారీ కోసం పల్లెం, చెంచాలు కావాలి.
5. విగ్రహం బేస్ తయారు చేయడానికి ముందు ఒక లోతైన పల్లెం తీసుకోండి. దానికి కొబ్బరి నూనె రాయండి. దాంట్లో మట్టి ముద్దను పెట్టి ప్లేట్ ఆకారంలోకి తీసుకురండి. నూనె రాయడం వల్ల మట్టి పల్లెం నుంచి సులభంగా బయటకు వస్తుంది. బయటకు తీస్తే బేస్ రెడీ.
6. ఇప్పుడు ఆ బేస్ పక్కలకు టూత్ పిక్ సాయంతో మంచి కమలాల డిజైన్ వేయండి.
7. అలాగే పాదాల తయారీ కోసం అలాంటి ఆకారంలో ఉండే పెద్ద చెంచాలు వాడండి. వాటికి కొబ్బరి నూనె రాసి మట్టి నింపి బయటకు తీస్తే పాదాల ఆకారం వస్తుంది. వాటిని తీసి పక్కన పెట్టండి. చేతుల కోసం కాస్త చిన్న చెంచాలు వాడి చేతులు రెడీ చేయండి. కొబ్బరి నూనెతో వీటిని కాస్త సాగదీసినట్లు ఆకారం చేస్తే చాలు. టూత్ పిక్ తో వేళ్ల లాగా గాట్లు పెట్టండి.
8. ఇప్పుడు బొజ్జ తయారీ కోసం ఒక గుండ్రటి గిన్నెలో మట్టిని పెట్టుకుని అచ్చులాగా బయటకు తీస్తే రెడీ అవుతుంది. వీటన్నింటినీ ఒకచోట సరిగ్గా అమర్చాలి.
9. బేస్ తీసుకుని దాని మీద టూత్ పిక్ సాయంతో బొజ్జ ఆకారం ఉంచండి. కింది వైపు టూత్ పిక్ పెట్టి కాళ్లు, పైన చేతులు అమర్చండి. అలాగే తల ఆకారం కూడా చేయండి.
10. ఇప్పుడు కాస్త మట్టిలో నీళ్లు కలిపి విగ్రహం వెనక పూతలాగా పూయండి. దీంతో ఆకారం చక్కగా నిలుస్తుంది. కొబ్బరి నూనె రాశారంటే మంచి ఫినిషింగ్ కూడా వచ్చేస్తుంది.
11. చివరగా విగ్రహాన్ని సాబుదానా, బియ్యం సాయంతో నగలుగా చేసి అలంకరించండి. వీలైతే కుంకుమలో నీళ్లు కలిపి అక్కడక్కడా రంగులు వేయండి. గణపతి విగ్రహం రెడీ అవుతుంది.