Vinayaka chavithi decor: వారెవ్వా అనిపించే వినాయకుని అలంకరణ ఐడియాలు, ఇలా చేస్తే మెచ్చుకోక మానరు
Vinayaka chavithi decor: వినాయక చవితి రోజు గణపయ్యను ఎలా అలంకరించాలో ఆలోచిస్తున్నారా? అయితే ఈ ఉత్తమ డెకరేషన్ ఐడియాలను చూసేయండి. మీ దగ్గర అందుబాటులో ఉండే వస్తువులతోనే సులువుగా వినాయక చవితి రోజు అలంకరణ చేసేయొచ్చు.
వినాయక చవితి రోజు అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వినాయకుని విగ్రహం పెట్టే చోటును అందంగా ముస్తాబు చేయాల్సిందే. ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్ బ్యాక్‌గ్రౌండ్స్ దొరుకుతున్నాయి. చాలా మంది వాటినే వాడేస్తున్నారు. కానీ మీ చేత్తో కాస్త కష్టపడి అలంకరించారంటే మీ వినాయకుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. అలాంటి వినూత్న, సింపుల్ పద్ధతులేంటో చూసేయండి.
పేపర్ ఫ్యాన్‌లతో అలంకరణ
రంగురంగుల పేపర్ ఫ్యాన్లతో చేసిన గణేష్ అలంకరణ ప్రత్యేకంగా ఉంటుంది. రంగు రంగుల పేపర్లు తెచ్చి వాటిని చిన్ని చిన్న గా మడిచి చుట్టూ కలిపి అంటిస్తే ఇవి రెడీ అయిపోతాయి. ఒకటి చేయడానికి నిమిషం కూడా పట్టదు. ఆ రంగు కాగితాలు కూడా ఒక్కోటి 5 రూపాయలు మించి ఉండవు. అలా చేసిన పేపర్ ఫ్యాన్లను వినాయకుని వెనకాల డబుల్ ప్లాస్టర్ తో అతికిస్తే సరిపోతుంది. అందమైన అలంకరణ రెడీ అవుతుంది.
పచ్చదనంలో వినాయకుడు
వినాయకుడిని పీట మీద ప్రతిష్టిస్తారు కదా. ఆ పీట వెనకాలే ఒక పెద్ద గుబురుగా విచ్చుకున్నట్లుండే మొక్క పెట్టండి. అదే అందమైన బ్యాక్‌గ్రౌండ్ లాగా కనిపిస్తుంది. అలాగే వినాయకుని ముందు కూడా పూల కుండీలు, మొక్కలు క్రమ పద్ధతిలో పెట్టండి. దాంతో పచ్చదనంలో మీ మట్టి వినాయకుడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. అలంకరణ ప్రత్యేకంగా చేయకుండా ఉన్న మొక్కలతోనే సృజనాత్మకంగా వాడుకుంటే సరిపోతుంది.
బ్లవుజు పీసులతో వినాయకుని అలంకరణ
ఇంట్లో బ్రొకేడ్, బనారసీ బ్లవుజు పీసులుంటే దీనికోసం వాడండి. చున్నీలున్నా ఉపయోగపడతాయి. లేదంటే ప్లెయిన్ బ్లవుజు పీసులనే రంగు రంగులున్న వాటిని ఎంచుకోండి. వాటన్నింటిని చతురస్రాకారంలో ఒకే సైజులో మడత పెట్టండి. ఒకసారి ఐరన్ చేస్తే చక్కగా సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక దుపట్టా తీసుకుని దానిమీద బ్లవుజు పీసులను ఒక్కో కుట్టు వేస్తూ కుట్టండి. లేదంటే గుండు పిన్నులతో సెట్ చేసేయండి. చివర్లలో పూల దండలు వేలాడదీసారంటే రంగుల్లో మెరిసిపోతున్న వినాయక మండపం రెడీ అవుతుంది.
నవధాన్యాలతో గణపతి
వినాయకున్ని ప్రతీష్టించే చోటుకు పక్కన కూడా మంచి అలంకరణ చేయొచ్చు. దీంతో ఆ ప్రాంతం అంతా మరింత అందంగా కనిపిస్తుంది. అందుకోసం నేల మీదే వినాయకుని ఆకారం గీయండి. ఆ ఆకారంలో బియ్యం, గోధుమలు, పప్పులు.. ఇలా రకరకాల గింజలు, నవ ధాన్యాలతో రంగుల ముగ్గులు నింపినట్లే నింపండి.చివరగా పొట్టు మినప్పప్పుతో లైనింగ్ లాగా ఇచ్చారంగే అందరి దృష్టినీ ఆకర్షించే నవధాన్యాల అలంకరణ పూర్తయినట్లే. మీకు మెచ్చుకోలు రాకపోతే చూడండి. దీంతో పాటే పూరేకులతోనూ గణపతిని గీయొచ్చు. బంతి రేకులు, గులాబీ, మల్లె పూలు కలిపి అందమైన గణపతిని రెడీ చేయొచ్చు.
ఎకో ఫ్రెండ్‌లీ అలంకరణ:
మట్టితో చేసిన గణపతికి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణ రక్షణ కోసం ప్రయత్నిస్తున్నాం. అలంకరణలోనూ అదే నియమం పెట్టుకోండి. రీయూజబుల్ గ్లాసులు, ప్లేట్లు, బాంబూతో చేసిన ప్లేట్లు, రంగులద్దిన ఇటుకల మధ్య దీపాలు పేర్చి, ఆకులతో అలంకరించి.. ఇలా రకరకాలుగా గణపతి అలంకరణ చేయవచ్చు. కాస్త మీ మెదడుకు పదును పెట్టారంటే ఇంట్లోనే ఈ వస్తువులన్నీ దొరికేస్తాయి చూడండి.