Female hygiene: మహిళలు జననేంద్రియాల శుభ్రత విషయంలో చేసే తప్పులు ఇవే, వీటితో ఇన్ఫెక్షన్లు, అనారోగ్యం
Female hygiene: మహిళల జననేంద్రియాల్లో శుభ్రత అత్యవసరం. దీనికోసం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు, ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టేస్తాయి.
మహిళల జననేంద్రియ భాగాల్లో పరిశుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే అజాగ్రత్త వల్ల అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు మొదలవుతాయి. అందుకే ప్రైవేట్ భాగాల్ని, చుట్టూ చర్మాన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అయితే ఈ సున్నిత ప్రాంతాల్ని శుభ్రం చేయడంలో అనేక అపోహలుంటాయి. కాబట్టి ఆ భాగాల్లో శుభ్రత కోసం పాటించాల్సిన జాగ్రత్తలు తెల్సుకోండి.
కాటన్ అండర్‌వేర్:
జననేంద్రియాల దగ్గర చర్మం శుభ్రంగా, పొడిగా, బ్యాక్టీరియాకు దూరంగా ఉంచాలనుకుంటే కాటన్ ప్యాంటీలు ఉత్తమం. అయితే సాధారణ ప్యాంటీల కన్నా బాక్సర్ బ్రీఫ్స్ వాడితే అత్యంత సౌకర్యంగా ఉండటంతో పాటూ.. పరిశుభ్రంగా ఉంచడం సాధ్యపడుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ లేసులు, నైలాన్, లేదా ఇతర వస్త్రాలతో చేసిన లోదుస్తులు ధరించకూడదు. ఇవి తడిని సమర్థవంతంగా పీల్చవు. తేమ చేరి బ్యాక్టీరియా ఎదుగుదలకు కారణం అవుతాయి.
ప్యాంటీ లేకుండా:
మహిళలు ప్రతిరోజూ 24 గంటల పాటు లోదుస్తులు ధరించాల్సి వస్తుంది. సౌకర్యం కోసం ఇది తప్పదు. అయితే పీరియడ్స్ అయిపోయాక తర్వాతి వారంలో ఒక్క రోజైనా లోదుస్తులు వేసుకోకుండా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణుల సూచన. ఆ రోజు వదులుగా ఉండే పైజామాలు, ప్యాంట్లలో సౌకర్యంగా ఉండండి. దీంతో ఒక రోజు బిగుతు బట్టల నుంచి ఉపశమనం దొరుకుతుంది.
ప్యూబిక్ హెయిర్ రిమూవల్:
జననేంద్రియాల్లో అవాంఛిత రోమాలను తొలగించడం కూడా శుభ్రతలో భాగమే. అయితే దానికోసం ఎలాంటి క్రీములు, పౌడర్లు, రసాయనాలు, థెరపీలు వాడకూడదు. బదులుగా కత్తెర లేదా రేజర్ వాడి షేవింగ్ చేయడం ఉత్తమం.
సబ్బు వాడకం:
వ్యక్తిగత భాగాల్ని శుభ్రం చేయడానికి ప్రత్యేక పర్ఫ్యూమ్ వాష్ అవసరం లేదు. మీరు రోజువారీ సబ్బు లేదా బాడీవాష్ వాడొచ్చు. చేతులోకి సబ్బు లేదా వాష్ తీసుకుని నురుగు వచ్చాక దాన్ని రాసుకుని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు. లేదా కేవలం ఎలాంటి సబ్బు లేకుండా నీళ్లు వాడినా సరిపోతుంది.
మూత్ర విసర్జన:
వ్యక్తిగత పరిశుభ్రత కోసం మూత్ర విసర్జన తర్వాత ప్రతిసారీ నీటితో బాగా కడుక్కోవాలి. కాస్త ఆరాక మాత్రమే ప్యాంటీ వేసుకోవాలి. మీ బాత్రూంలో దీనికోసం ఒక టవెల్ ఉంచుకోవడం ఉత్తమం. ప్రతిసారీ తుడుచుకునే వీలుంటుంది. అలాగే స్నానం చేశాక వెంటనే లోదుస్తులు వేసుకోకూడదు. తేమగా ఉన్న శరీరం మీద వేసుకుంటే ఇన్ఫెక్షన్ల అవకాశం పెరుగుతుంది. ఓ అయిదు నిమిషాలయినా ఆగి, చర్మం పొడిగా అయ్యాక వేసుకుంటే మంచిది. ఈ చిన్న మార్పు శుభ్రతకు సాయం చేస్తుంది.