Cabbate attu: క్యాబేజీతో అట్లు చేసి తినండి. టేస్టీ రెసిపీ ఇదే
cabbage attu : లంచ్ బాక్స్ లోకి, డిన్నర్ లోకి, అల్పాహారంలోకి తినదగ్గ క్యాబేజీ అట్టు రెసిపీ ఇది. దీని తయారీ, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.
క్యాబేజీ అట్టు (shutterstock)
క్యాబేజీతో చేసే అట్టు ఏ సమయంలో తిన్నా కడుపు నిండిపోతుంది. అల్పాహారం నుంచి డిన్నర్ దాకా ఎప్పుడైనా దీన్ని చేసి తినేయొచ్చు. కూరగాయలు నిండిన అల్పాహారం ఏదైనా సరే ఆరోగ్యకరమే. దీని తయారీ చూసేయండి.
క్యాబేజీ చిల్లా తయారీకి కావలసిన పదార్థాలు:
పావు కేజీ క్యాబేజీ
ఒక ఉల్లిపాయ
రెండు అంగుళాల అల్లం ముక్క
రెండు పచ్చిమిర్చి
నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు,
మూడు టీస్పూన్ల శనగపిండి లేదా
పావు కప్పు నానబెట్టిన శనగపప్పు
ఒక టీస్పూన్ జీలకర్ర
అర టీస్పూన్ మిరియాల పొడి
అరచెంచా పసుపు
రుచికి సరిపడా ఉప్పు,
టీస్పూన్ ఆవాలు
చిటికెడు ఇంగువ
బియ్యం పిండి 2 చెంచాలు
క్యాబేజీ అట్లు తయారీ విధానం:
- ముందుగా క్యాబేజీని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం సన్నటి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిని కూడా దంచి పెట్టుకోవాలి.
- క్యాబేజీ ముక్కల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి వేసుకోవాలి.
- శనగపిండి ఉంటే నేరుగా వేసుకుని కలుపుకోవాలి. లేదంటే శనగపప్పును నానబెట్టుకుని దాన్ని మిక్సీ పట్టుకుని దీంట్లో వేసుకున్నా రుచి బాగుంటుంది.
- జీలకర్ర, మిరియాల పొడి, ఇంగువ, ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- క్యాబేజీ నుంచి నీరు విడుదల అయితే అందులో దానికి తగ్గట్లు బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి.
- ముద్దగా అయ్యాక ఒక పెనం మీద నూనె వేసుకుని చేతులతో సమంగా ఒత్తుకోవాలి.
- నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే క్యాబేజీ అట్లు రెడీ. క్యాబేజీ ఎంత సన్నగా తరుగుకుంటే అట్లు అంత సన్నగా వస్తాయి. మీకు చేత్తో ఒత్తడం ఇబ్బంది అనిపిస్తే మరికాస్త బియ్యం పిండి కలుపుకుని నీల్లు పోసి కాస్త పలుచని పిండిలా చేసి దోసెల్లానూ పోసుకోవచ్చు.
టాపిక్