Pan Shot Benefits | పాన్ షాట్‌లను సిప్ చేయండి.. వేసవి వేడిని అరికట్టండి-here is the recipe of pan shots they are reduce heat and protect in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pan Shot Benefits | పాన్ షాట్‌లను సిప్ చేయండి.. వేసవి వేడిని అరికట్టండి

Pan Shot Benefits | పాన్ షాట్‌లను సిప్ చేయండి.. వేసవి వేడిని అరికట్టండి

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 23, 2022 03:35 PM IST

తాంబూల్, తమలపాకు, నాగవల్లి, నాగర్‌బెల్ అని పాన్​ను పిలుస్తారు. సాధారణంగా పాన్​ను సాంప్రదాయకంగా భోజనం తర్వాత దీనిని తినడం చాలా మందికి అలవాటు. దాని సుగంధ, శక్తివంతమైన రుచి సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును చేసే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. మరి వేసవిలో పాన్​ తీసుకోవచ్చా? ఎలా దానిని తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>హీట్ ద బీట్ విత్ పాన్</p>
హీట్ ద బీట్ విత్ పాన్

Summer Tips | భారతీయ సంస్కృతిలో తమలపాకు లేదా పాన్ ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఆయుర్వేదం ప్రకారం తమలపాకులు ఔషధ, ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. వీటిని ఉపయోగించి చాలా అనారోగ్య సమస్యలకు నివారిణిగా ఉపయోగిస్తారు. అందుకే వీటిని మతపరమైన వేడుకలు, వివాహాలకు, పూజలలో పవిత్రమైనదిగా వాడుతారు. దీని గురించి స్కంద పురాణంలో కూడా ప్రస్తావించారు. కారణం లేకుండా పాన్ ప్రజాదరణ పొందలేదు. తమలపాకు లేదా పాన్‌లో అధిక నీటి శాతం, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది తక్కువ స్థాయిలో కొవ్వు, మితమైన ప్రోటీన్లను కూడా కలిగి ఉంటుంది. ఇది అయోడిన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలతో నిండి ఉంది.

పలు చికిత్సలకు నివారిణిగా..

తమలపాకులతో దగ్గు, ఉబ్బసం, తలనొప్పి, రినైటిస్, కీళ్ల నొప్పులు, అనోరెక్సియా మొదలైన వాటి చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్‌సర్ తెలిపారు. ఇది నొప్పి, వాపు, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది కఫా రుగ్మతలలో ఉత్తమంగా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. తమలపాకులలో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కలిగి ఉంటుంది. తమలపాకు సుగంధ లత కాబట్టి.. మీరు దానిని మీ ఇళ్లలో సులభంగా అలంకారమైన మొక్కగా పెంచుకోవచ్చు.

ఒకవేళ మీరు పాన్‌ను నమలడం ఇష్టం లేకున్నా.. దాని శక్తివంతమైన రుచిని ఆస్వాదించాలనుకుంటే.. ఇక్కడ నోరూరించే పాన్ షాట్ రెసిపీ ఉంది. ఇది వేసవి కాలంలో తీసుకుంటే మరీ మంచిది. పాన్ ప్రకృతిలో వేడిగా ఉంటుంది, కానీ పాన్ షాట్‌లలో గుల్కంద్, కొబ్బరి, సోపు గింజలు ఉంటాయి కాబట్టి ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి ఈ పాన్ షాట్‌లు వేసవి వేడిని అరికడతాయి. ఇప్పుడు దాని తయారీ విధానం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* 4 పాన్ (తమలపాకులు)

* 4 టీస్పూన్లు గుల్కంద్

* 1 స్పూన్ సోంపు

* 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరి

* 1 టేబుల్ స్పూన్ రాతి చక్కెర/మిశ్రి (ఐచ్ఛికం)

* 1/4వ కప్పు నీరు

తయారీ విధానం

ముందుగా తమలపాకులను ముక్కలుగా కోసి మిక్సీలో వేయాలి. తర్వాత నీళ్లు తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి కొన్ని సెకన్ల పాటు బ్లెండ్ చేయాలి. తర్వాత నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇంకేముంది మీ పాన్​షాట్​లు రెడీ అయినట్టే. ఇది తాగి మీరు సమ్మర్​ హీట్​ని బీట్​ చేయండి.

 

Whats_app_banner