Acne in Teenagers: మీ టీనేజీ పిల్లల్లో మొటిమల సమస్య పెరిగిపోతోందా? వీటిని తినిపించండి
Acne in Teenagers: యువత, టీనేజీ పిల్లలు అధికంగా ఎదుర్కొనే సమస్యల్లో పిగ్మెంటేషన్ ఒకటి.
Acne in Teenagers: వయసుతోపాటు వచ్చే సమస్య పిగ్మెంటేషన్. పిల్లలు టీనేజీలోకి అడుగు అడుగుపెడుతూనే మొటిమల సమస్యను ఎదుర్కొంటారు. ఆ సమస్య పాతికేళ్ళ వయసు వరకు వేధించే అవకాశం ఉంది. స్కిన్ పాచ్‌లు, స్కిన్ టోన్ మారిపోవడం, హైపర్ పిగ్మెంటేషన్... ఇవన్నీ కూడా మానసికంగా కుంగదీసేవే. చర్మంపై వచ్చే చిన్నపాటి మార్పును కూడా యువత తట్టుకోలేదు. వాటిని తలుచుకొని మానసికంగా కుంగిపోతారు.
ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలి. వారి ఆహారం, జీవనశైలికి సంబంధించి కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలి. జంక్ ఫుడ్ అధికంగా తినే పిల్లల్లో పిగ్మెంటేషన్ సమస్య మరింతగా పెరిగిపోతుంది. అలాంటి పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇంట్లోనే కొన్ని రకాల ఆహారాలు తినిపించడం చాలా ముఖ్యం.
మొటిమలు రావడానికి కారణాలు
మొటిమలు అతిగా రావడానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. అవి వారసత్వంగా కూడా రావచ్చు. అలాగే అధికంగా సూర్య రశ్మికి గురి కావడం, హార్మోన్లలో మార్పులు రావడం, చర్మ సమస్యల కారణంగా కూడా ఏర్పడే అవకాశం ఉంది. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి.
మొటిమలను అడ్డుకునే శక్తి యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్‌లకు ఉంటుంది. కాబట్టి ఇవి పుష్కలంగా ఉండే ఆహారాలను మీ రోజువారి మెనూలో ఉండేలా చూసుకోవాలి. ఆక్సీకరణ ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల కూడా చర్మంపై పిగ్మెంటేషన్ మొదలవుతుంది. కాబట్టి చర్మాన్ని రక్షించడం కోసం ప్రతి రోజు తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి.
మొటిమలను ఇలా అడ్డుకోవచ్చు
పండ్ల విషయానికి వస్తే పుల్లగా ఉండే సిట్రస్ పండ్లను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బెర్రీ జాతికి చెందిన పండ్లను కూడా తినాలి. ఆకుకూరల్లో పాలకూర, కాలే... మొటిమలకు సరైన పరిష్కారాన్ని చూపిస్తాయి. క్యారెట్లు తినడం వల్ల కూడా చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.
చర్మ సమస్యలు నివారించడంలో విటమిన్ E అత్యవసరమైన పోషకం. కొవ్వు పట్టిన చేపలను తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు విటమిన్ E కూడా శరీరానికి అందుతుంది. ఇది చర్మ ఆకృతిని, స్థితిస్థాపకతను, తేమను కాపాడుతుంది. సాల్మన్, మాకెరెల్, ట్రౌట్ వంటి చేపలను అధికంగా తినేందుకు ప్రయత్నించండి. చేపలు అధికంగా తినే వారికి పిగ్మెంటేషన్ సమస్య తక్కువగా వస్తుంది.
టమోటోల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంది. లైకోపీన్ అనేది యాంటీ ఆక్సిడెంట్. ఇది మన చర్మ సంరక్షణకు ముఖ్యమైనది. టమోటోలను ఉడికించడం వల్ల ఈ లైకోపీన్ మరింతగా మన శరీరంలో ఇంకి పోతుంది. కాబట్టి ప్రతిరోజు టమాటోలతో వండిన ఆహారాలను కచ్చితంగా తినండి. అలాగే టమోటోలను పేస్టులా చేసి మొటిమలు వచ్చిన చోట అప్లై చేయడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కాటేచిన్స్... సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల వల్ల మన చర్మానికి నష్టం కలగకుండా కాపాడతాయి. ప్రతిరోజూ రెండుసార్లు గ్రీన్ టీని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా తాగే వారిలో ఏజింగ్ లక్షణాలు తగ్గుతాయి. అలాగే మొటిమల సమస్య కూడా అదుపులో ఉంటుంది.
ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్స్ వంటివి తింటూ ఉండాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. మొటిమలతో పోరాడే శక్తిని చర్మానికి ఇస్తాయి. ఇక్కడ చెప్పిన ఆహారాలను ప్రతిరోజూ తినే వారిలో చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే మొటిమలు, ఇతర చర్మ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.