Ragi oats dhokla: రాగి ఓట్స్ డోక్లా.. రుచిలో అదిరిపోతుంది..
Ragi oats dhokla: పోషకభరితం, ఆరోగ్యదాయకం అయిన రాగిపిండి, ఓట్స్ కలిపి డోక్లా ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూసేయండి.
రాగి ఓట్స్ డోక్లా
రాగిపిండి, ఓట్స్ రెండూ ఆరోగ్యకరమే. వాటిని ఆహారంలో చేర్చుకోవాలని ఉన్నా, ఎలాంటి వంటలు చేయాలో తోచదు. అలాంటపుడు ఈ రాగి ఓట్స్ డోక్లా చాలా మంచి అల్పాహారం. ఉదయాన్నే టిఫిన్ లోకి తీసుకుంటే ఆరోగ్యకరం.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు రాగిపిండి
సగం కప్పు ఓట్స్ పొడి
సగం కప్పు శనగపిండి
సగం కప్పు పెరుగు
తగినంత ఉప్పు
చిటికెడు వంటసోడా
1 చెంచా అల్లం ముద్ద
2 చెంచాల నూనె
సగం చెంచా ఆవాలు
సగం చెంచా జీలకర్ర
1 రెమ్మ కరివేపాకు
1 పచ్చిమిర్చి
కొత్తిమీర తరుగు కొద్దిగా
తయారీ విధానం:
- రాగిపిండి, ఓట్స్ పొడి, శనగపిండి ఒక పెద్ద బౌల్ లో వేసుకోవాలి.
- తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండి లాగా పిండి కలుపుకోవాలి.
- ఈ పిండిని రాత్రంతా పులియబెట్టాలి. ఉదయాన్నే ఉప్పు, పెరుగు, అల్లం ముద్ద వేసుకుని బాగా కలుపుకోవాలి.
- రెండు చెంచాల నూనె, వంటసోడా కూడా వేసుకుని కలుపుకోవాలి.
- ఒక లోతుగా ఉన్న ఉన్న ప్లేట్ లో ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. ఆవిరిమీద 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి.
- చల్లారాక ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకుని, ఆవాలు, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి. దీన్ని డోక్లా ముక్కల మీద వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. ఏదైనా సాస్ లేదా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.