AP Housing Projects: ఏపీలో ఇక అర్బ‌న్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఆధ్వ‌ర్యంలో ఎంఐజీ,హెచ్ ఐజీ కాలనీల నిర్మాణం..-construction of mig and hig colonies in ap under the auspices of urban development authorities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Housing Projects: ఏపీలో ఇక అర్బ‌న్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఆధ్వ‌ర్యంలో ఎంఐజీ,హెచ్ ఐజీ కాలనీల నిర్మాణం..

AP Housing Projects: ఏపీలో ఇక అర్బ‌న్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఆధ్వ‌ర్యంలో ఎంఐజీ,హెచ్ ఐజీ కాలనీల నిర్మాణం..

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 05, 2024 04:00 AM IST

AP Housing Projects: ఆంధ్రప్రదేశ్‌లో మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల కోసం పట్టణాభిృద్ధి సంస్థల ఆధ్వర్యంలో గృహ నిర్మాణం, లే ఔట్లను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో భూముల్ని గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది.

అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో  ఎంఐజి, హెచ్‌ఐజి ఫ్లాట్ల విక్రయం
అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో ఎంఐజి, హెచ్‌ఐజి ఫ్లాట్ల విక్రయం

AP Housing Projects: ఏపీలో అర్బ‌న్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఆధ్వ‌ర్యంలో ఇళ్ల నిర్మాణం, లేఅవుట్ల ను అభివృద్ది చేసి అమ్మకాలు చేయ‌డం ద్వారా ఆర్ధికంగా ప‌రిపుష్టి సాధించాల‌ని మంత్రి నారాయ‌ణ అధికారుల‌ను ఆదేశించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు స‌మీపంలో ఎంఐజీ(మిడిల్ ఇన్ కం గ్రూప్),హెచ్ ఐజీ(హయ్యర్ ఇన్ కం గ్రూప్)ఇళ్ల‌ను నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన భూమిని ఎంపిక చేయాల‌ని అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలకు వైస్ చైర్మ‌న్ లుగా ఉన్న ఆయా జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హౌసింగ్‌ బోర్డుల ఆధ్వర్యంలో పట్టణాల్లో మధ్యతరగతి, అధిక ఆదాయ వర్గాల వారికి హౌసింగ్ బోర్డు కాలనీల నిర్మాణం జరిగేది. క్రమేణా హౌసింగ్‌ బోర్డు కార్యకలాపాలు తగ్గిపోయాయి. రియల్‌ ఎస్టేట్ వ్యాపారాలతో అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీల్లో కేవలం లే ఔట్ల అనుమతులు మంజూరు చేయడానికి పరిమితం అయ్యాయి.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీల పరిధిలో లే ఔట్లతో పాటు ఇళ‌్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తోంది. స్థానిక పట్టణాభివృద్ధి సంస్థలు నేరుగా స్థలాలను అభివృద్ధి చేస్తే ప్రజలకు తక్కువ ధరలకు మౌలిక సదుపాయాలతో ఇళ్లు, ఇళ్ల స్థలాలు లభిస్తాయని యోచిస్తోంది.

నెలాఖ‌రులోగా స్థ‌లం ఎంపిక పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి నారాయణ సూచించారు.ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇత‌ర రాష్ట్రల్లో అధ్య‌యనం చేయాల‌ని, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల వీసీలు,చైర్మ‌న్ ల‌కు సూచించారు. మున్సిపాల్టీల్లో చెత్త‌, తాగునీరు, డ్రైనేజి కాల్వ‌లు, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, వీధి లైట్లు, రోడ్లకు మొద‌టి ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు.

ఆ త‌ర్వాత పార్కులు ,లేఅవుట్లు, ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. అర్బ‌న్ అథారిటీలకు వ‌చ్చే ఆదాయాన్ని స‌రైన మార్గంలో అవ‌స‌ర‌మైన వాటికి, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే వాటికి ఉప‌యోగించేలా ముందుకెళ్లాల‌న్నారు.రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి స‌రిగా లేనందున స్వ‌యంగా వ‌న‌రులు స‌మీక‌రించ‌డంపై దృష్టి సారించాల‌ని సూచించారు. ప‌ట్ట‌ణ విస్త‌ర‌ణ‌కు అనువైన ప్ర‌దేశాల్లో ఇళ్ల నిర్మాణం చేప‌ట్టి అందుబాటులో ధ‌ర పెట్ట‌డం ద్వారా సామాన్యుల‌కు ఉప‌యోగ‌ప‌డ‌టంతో పాటు మంచిపేరు వ‌స్తుంద‌న్నారు.

మూడు యూడీఏల ప‌రిధిలో ఎక్క‌డెక్క‌డ స్థ‌లం ల‌భ్య‌త ఉంద‌నే వివ‌రాల‌ను ఆయా జిల్లాల జేసీలు వివ‌రించారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీల‌ను బ‌లోపేతం చేసేలా జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్ల‌ను వైస్ ఛైర్మ‌న్ లుగా నియ‌మించింది. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలకు నోడ‌ల్ ఆఫీస‌ర్ గా ప‌ట్ట‌ణ ప్ర‌ణాళికా విభాగం డైరెక్ట‌ర్ ను నియ‌మిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Whats_app_banner