Palnadu Crime : ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం, పల్నాడు జిల్లాలో మ‌హిళ దారుణ హ‌త్య-palnadu woman brutally murdered by lover extramarital relationship ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Palnadu Crime : ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం, పల్నాడు జిల్లాలో మ‌హిళ దారుణ హ‌త్య

Palnadu Crime : ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం, పల్నాడు జిల్లాలో మ‌హిళ దారుణ హ‌త్య

HT Telugu Desk HT Telugu
Dec 10, 2024 07:04 PM IST

Palnadu Crime : పల్నాడు జిల్లాలో వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసింది. మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో ఆమె కక్షపెంచుకున్న ప్రియుడు...దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సత్తెనపల్లిలో చోటుచేసుకుంది.

ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం, పల్నాడు జిల్లాలో మ‌హిళ దారుణ హ‌త్య
ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం, పల్నాడు జిల్లాలో మ‌హిళ దారుణ హ‌త్య

Palnadu Crime : ప‌ల్నాడు జిల్లాలో వివాహేత‌ర సంబంధం ఓ మ‌హిళ దారుణ హ‌త్యకు దారి తీసింది. అనంత‌రం నిందితుడు పోలీసుల‌కు లొంగిపోయాడు. ఈ ఘ‌ట‌న ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ప‌ట్టణం శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం స‌త్తెన‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలోని రంగా కాల‌నీకి చెందిన‌ రమాదేవి, రాజు పాలెం మండ‌లం కొత్తూరు గ్రామానికి చెందిన గోసుల వెంక‌ట‌రావుకు 20 ఏళ్ల నుంచి వివాహేత‌ర సంబంధం న‌డుస్తోంది. రమాదేవి భ‌ర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు వ్యవ‌సాయ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తోన్నారు.

yearly horoscope entry point

మ‌రోవైపు గోసుల వెంక‌టరావుకు కూడా వివాహం అయింది. ఆయ‌న‌కు కూడా భార్య పిల్లలు ఉన్నారు. రమాదేవి సోద‌రి ప‌క్షవాతంతో మంచం ప‌ట్టింది. ఈ క్రమంలో ఆమెకు రమాదేవి స‌హాయం చేస్తూ ఉంటుంది. ఇటీవ‌లి ర‌మాదేవి సోద‌రి మృతి చెందింది. సోద‌రి భ‌ర్తతో ర‌మాదేవి చ‌నువుగా ఉంటున్న‌ట్లు స్థానికంగా ప్ర‌చారం జ‌రిగింది. దీంతో రమాదేవిపై ప్రియుడు గోసుల వెంక‌ట‌రావు అనుమానం పెంచుకున్నాడు. స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే త‌మ వివాహేత‌ర సంబంధాన్ని ఇక ఆపేద్దామ‌ని, బ్యాంకులో పెట్టిన మూడు స‌వ‌ర్ల బంగారం విడిపించాల‌ని వెంక‌ట‌రావుపై ర‌మాదేవి ఒత్తిడి తెచ్చింది.

దీంతో ర‌మాదేవిపై క‌క్షపెట్టుకుని, ఎలాగైనా ర‌మాదేవిని అంత‌మోందించాల‌ని అనుకున్నాడు. శ‌నివారం రాజుపాలెం మండ‌లం రెడ్డిగూడెంలో మాట్లాడుకుందామ‌ని ర‌మాదేవికి వెంక‌ట‌రావు చెప్పాడు. దీంతో ర‌మాదేవి రెడ్డిగూడెం వ‌చ్చింది. అక్క‌డ మ‌ద్యం తాగుతూ చాలా సేపు ర‌మాదేవిని న‌చ్చచెప్పే ప్రయ‌త్నం చేశాడు. అయిన‌ప్పటికీ రమాదేవి మాట విన‌లేదు. ఎంత బ్రతిమిలాడిన‌ప్పటికీ ఆమె స‌సేమీరా అంది. దీంతో త‌న ద్విచ‌క్ర వాహ‌నంపై ఎక్కించుకుని స‌త్తెన‌పల్లి మండ‌లం గండ్లూరు స‌మీపంలోని పంట పొలాల్లోకి తీసుకొని వెళ్లాడు. అక్కడ ర‌మాదేవి, వెంక‌ట‌రావు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో కోపోద్రిక్తుడైన వెంక‌ట‌రావు, ర‌మాదేవి చీర కొంగును ఆమె మెడ‌కు బలంగా బిగించి హ‌త‌మార్చాడు. ఆ త‌రువాత నిందితుడు వెంక‌ట‌రావు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఆదివారం స్థానిక రైతులు మృత‌దేహాన్ని చూసి, పోలీసులకు స‌మాచారం ఇచ్చారు. దీంతో స‌త్తెన‌పల్లి టౌన్ సీఐ బ్ర‌హ్మ‌య్య‌, ఎస్ఐ సంధ్యారాణి ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. స్థానికుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స‌త్తెన‌ప‌ల్లి ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజుపాలెం పోలీస్‌స్టేష‌న్‌లో నిందితుడు గోసుల వెంక‌ట‌రావు సోమవారం లొంగిపోయాడు. ఈ హ‌త్య‌తానే చేశాన‌ని అంగీకరించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. దీంతో పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

కాకినాడ‌లో వివాహేత‌ర సంబంధం...ఇనుప‌రాడ్డుతో కొట్టి మ‌హిళ హ‌త్య

కాకినాడ‌లో వివాహేత‌ర సంబంధంతో ఒక మ‌హిళ హ‌త్య‌కు గురైంది. కాకినాడ‌లోని ప‌ర్లోవ‌పేట‌కు చెందిన ఆకుల మీనాకుమారి (36) ఆరేళ్ల క్రితం భ‌ర్త‌ను విడిచి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే రామ‌కృష్ణారావు పేట‌కు చెందిన స‌బ్బి రాంబాబు రెడ్డితో స‌హ‌జీవ‌నం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో మీనా కుమారి మ‌రొక వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉంటోంది. దీంతో మీనా కుమారిపై రాంబాబు అనుమానం పెంచుకున్నాడు. ఈ అంశంపైనే వీరిద్ద‌రి మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా గొడ‌వులు జ‌రుగుతున్నాయి.

ఈ క్ర‌మంలో ఆదివారం ఇంటి వ‌ద్ద ఇద్ద‌రూ గొడ‌వ ప‌డ్డారు. దీంతో అక్క‌డే ఉన్న ఇనుప‌రాడ్డుతో మీనా కుమారి త‌ల‌పై కొట్టాడు. అక్క‌డిక‌క్క‌డే ఆమె కుప్ప‌కూలిపోయింది. ఆమెను స్థానికులు కాకినాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌రలించారు. అయితే ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు ఆమె మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌తో రాంబాబు ప‌రారీలో ఉన్నాడు. సీఐ మ‌జ్జి అప్ప‌ల‌నాయుడు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner