Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు
Saree Cancer: చీర క్యాన్సర్ వినడానికి వింతగా ఉండవచ్చు. కానీ దీని బారిన పడుతున్న వ్యక్తులు ఉన్నారు. దీన్నే ధోతీ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చీర వల్ల క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకోండి.
Saree Cancer: చీర క్యాన్సర్ లేదా శారీ క్యాన్సర్... ఇది వినడానికి కాస్త వింతగా ఉంటుంది. కానీ దీని గురించి చర్చలు గత 60 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. 1945లో ధోతి క్యాన్సర్ అనే పేరు కూడా వినిపించింది.దీన్నే ఇప్పుడు చీర క్యాన్సర్ అని పిలుస్తారు. అసలు ఈ చీర క్యాన్సర్ లేదా ధోతి క్యాన్సర్ ఎవరికి వస్తుందో? ఎందుకు వస్తుందో? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
చీర క్యాన్సర్ అంటే
చీర క్యాన్సర్ అంటే చీరలు, ధోతీలు, జీన్స్ వంటివి ధరించడం వల్ల వచ్చే క్యాన్సర్. వీటిని ధరించడం వల్ల నడుము వద్ద చాలా గట్టిగా పట్టేస్తుంది. ఇలా దీర్ఘకాలికంగా జరగడం వల్ల అక్కడ చర్మం చికాకుకు గురవుతుంది. ఆ నడుము ప్రాంతం పై గాయాలు అయ్యి చర్మవ్యాధులు వస్తాయి. ఇలా దీర్ఘకారకంగా జరగడం వల్ల ఆ చర్మవ్యాధులు చివరకు ప్రాణాంతక క్యాన్సర్ కు కారణం కావచ్చు. 2011లో జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో వైద్యులు ఈ పరిస్థితికి సంబంధించిన రెండు కేసులను నివేదించారు. ఈ క్యాన్సర్‌ను వెస్ట్ లైన్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. అలాగే స్క్వామస్-సెల్ కార్సినోమా కూడా అంటారు.
నడుము వద్ద చీర, ప్యాంట్లు వంటివి చాలా టైట్ గా కడతారు. దీర్ఘకాలికంగా అక్కడ ఉన్న చర్మం ఘర్షణకు గురై పొలుసుల్లా మారుతుంది. అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నడుము వద్ద ఈ క్రానిక్ ఇరిటేషన్ వల్ల కొన్నాళ్లకు అక్కడ చర్మం, క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే రాత్రిపూట చీరలు, జీన్స్, ధోతీలు, లంగాలు వేసుకోకుండా వదులుగా ఉండే దుస్తులు ధరించాలని చెబుతున్నారు. అలాగే నడుము ప్రాంతంలో మాయిశ్చరైజర్ క్రీములను అప్లై చేస్తూ ఉండాలని చెబుతున్నారు.
చీర క్యాన్సర్ ను పొలుసుల కణ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. చర్మంపై ఉండే ఎపిడెర్మల్ లైనింగ్ లో ప్రాణాంతక క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయి. అక్కడ కణితులు ఏర్పడతాయి. కొంతమందిలో తక్కువ మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. అలాంటి వారికి కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చర్మంపై ఎర్రటి పాచ్ లు, దద్దుర్లు, పుండ్లు వంటివి వస్తూ ఉంటాయి. అవి కూడా క్యాన్సర్ ను సూచిస్తాయి. ఈ క్యాన్సర్ వస్తే కీమోథెరపీ, లేజర్ థెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు.