Father's Day 2023 । తండ్రితో మీ అనుబంధాన్ని పెంచుకోండి.. ఇలా చేసి చూడండి!
Happy Fathers Day: పిల్లలకు తల్లిప్రేమ ఎంత ముఖ్యమో, తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం. పిల్లలు తమ తండ్రితో అనుబంధం పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి.
Happy Fathers Day: నాన్న అనే రెండు అక్షరాల పదం నిస్వార్థమైన ప్రేమకు ప్రతిరూపం. నాన్న అనే పిలుపులో ఉండేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు అంతకుమించిన భావోద్వేగం. నాన్న తన పిల్లలతో ఒక్కోసారి కోపంగా ఉండవచ్చు, కఠినంగా ప్రవర్తించవచ్చు, అవసరమైతే ఒక దెబ్బకొట్టి శిక్షించవచ్చు, కానీ ఆ తండ్రి గుండెల నిండా తన పిల్లలే ఉంటారు, ఆయన ఆలోచనలన్నీ నిరంతరం పిల్లల బంగారు భవిష్యత్తు చుట్టూనే తిరుగుతుంటాయి. ఎదిగే తన బిడ్డలను చూసి ఆనందంతో పొంగిపోతాడు, ఎంతో మందికి చెబుతూ మురిసిపోతాడు, తాను జీవితంలో ఏం సాధించినా, ఎంత సాధించినా కలగని సంతృప్తి, తన బిడ్డకు వచ్చిన చిన్న బహుమానానికే ఎంతో తృప్తి చెందుతాడు, మహదానందం పొందుతాడు.
అయితే, ఈరోజుల్లో సమాజంలో బంధాలకు, అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది. సాధారణంగా పిల్లలు తమ తమ తండ్రులతో కంటే తల్లులకు మానసికంగా దగ్గరవుతుంటారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఎడం పెరిగి దూరం అయితే, వారి పిల్లలు తల్లి వద్దనే ఉండిపోతున్నారు. ఈ రకంగా ఎంతో మంది తండ్రులు తమ బిడ్డలకు దూరంగా ఉంటూ విలవిలలాడుతున్నారు. తన బిడ్డను ఒక్కసారైనా చూడాలని, మనసారా మాట్లాడాలని చాలా కోరుకుంటారు. కానీ వారిని చేరుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మౌనంగానే ఆ బాధను భరిస్తారు. తమ పిల్లల ఫోటోలను చూస్తూ కాలం గడిపేస్తుంటారు.
అమ్మలా కడుపున మోయకపోయినా, తండ్రి ఎప్పుడూ తన పిల్లలను తన గుండెలపై మోస్తాడు. తల్లిలా పాలు పంచి ఇవ్వలేకపోయినా, తన లాలనతో మురిపాలు పంచుతాడు. పిల్లలకు తల్లిప్రేమ ఎంత ముఖ్యమో, తండ్రి ప్రేమ కూడా అంతే అవసరం. పిల్లలు తమ తల్లిదండ్రుల ఇద్దరు ప్రేమను పొందేందుకు అర్హులు. పిల్లలకు తండ్రితో అనుబంధం ఉంటే, అదే వారికి ఎల్లప్పుడూ శ్రీరామ రక్షలా ఉంటుంది. పిల్లలు తమ తండ్రితో అనుబంధం పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని మార్గాలు చూడండి.
సమయం గడపండి
పిల్లలు తన తండ్రితో అలాగే తండ్రి తన పిల్లలతో సమయం గడపడానికి ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. ఇద్దరూ కలిసి మీకు నచ్చిన కార్యకలాపాలలో పాల్గొనాలి. గార్డెనింగ్ చేయడం, స్పోర్ట్స్ ఆడటం, సినిమాకు వెళ్లడం తమకు నచ్చిన వంటకాలను వండడం ఇలా మీరిద్దరూ సమానంగా ఆనందించే కార్యకలాపాలలో పాల్గొనండి.
మీతో జ్ఞాపకాలు గుర్తుచేసుకోండి
మీ తండ్రితో కూర్చొని, మీరు కలిసి గడిపిన మంచి సమయాలను గుర్తుచేసుకోండి, మీ చిన్ననాటి పర్యటనలు, ఆయన మీ కోసం భోజనం వండడం, మీకు సైకిల్ తొక్కడం నేర్పించడం, లేదా వాహనం నడపడం నేర్పించడం. ఇద్దరు కలిసి అమ్మతో చేసిన అల్లరి వంటివి ఏవైనా, మీరు అనుభవించిన మధురమైన క్షణాల గురించి మీ నాన్నతో మాట్లాడటం వలన మీ మధ్య అనుబంధం బలపడుతుంది.
జీవితం గురించి ప్రశ్నలు అడగండి
మీరు మీ తండ్రితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవాలంటే మీ తండ్రి రోజువారీ జీవితంలో మీరు ఆసక్తిని చూపాలి. వారి ఉద్యోగం గురించి, వారిని జీవితంలో ఇబ్బంది పెట్టే విషయాల గురించి, వారి స్నేహితుల గురించి, వారి బాల్యం ఎలా గడిచింది, వారి ఆశయాలు, వారి కలలు, వారి ప్రయాణ లక్ష్యాలు ఇలాంటి ప్రశ్నలు మీరు అడిగినపుడు, వాటిని మీతో పంచుకోవడంలో వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది.
ముఖ్యమైన నిర్ణయాలను చర్చించండి
మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మీ తండ్రులతో చర్చించండి. మీ తండ్రులు మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కలిగి ఉంటారు. ఎలాంటి సమయాల్లోనైనా తండ్రిని సహాయం అడగడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ న్నాన్న మీకు కొండంత ధైర్యం అవుతారు.
మీ సహాయం అందించండి
మీరు మీ తండ్రితో కలిసి జీవిస్తున్నా లేదా దూరంగా జీవిస్తున్నా, మీ తండ్రి ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నారని మీరు గమనిస్తే వారికి మీ వంతు సహాయం చేయండి. ఏదైనా ముఖ్యమైన డాక్యుమెంట్‌లను ప్రూఫ్‌రీడింగ్ చేయడం, వారు నడిచి వెళ్తే డ్రాప్ చేయడం, వారి మొబైల్ లేదా టెలివిజన్ ప్లాన్‌లను రీఛార్జ్ చేయడం ఇలాంటివేవైనా మీ ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతాయి.
విభేదాలను పరిష్కరించుకోండి
ఏ సంబంధంలోనైనా విభేదాలు వస్తాయి. తండ్రితో కూడా విభేదాలు రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే, ఇందుకు మీరు వారి నుండి దూరంగా ఉండడంలో అర్థం లేదు. మీ మధ్య సమస్యలను పరిష్కరించుకోవడం వలన మీ సంబంధంలో చేదు దూరం అవుతుంది, ప్రేమ, ఆప్యాయతలు దగ్గరవుతాయి.
ప్రతీ ఏడాది జూన్ మూడవ ఆదివారాన్ని పితృ దినోత్సవంగా నిర్వహిస్తారు. అది ఈ ఏడాది జూన్ 18న వస్తుంది. ఈ సందర్భంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
సంబంధిత కథనం