Happy Father's Day | కడుపున మోయకపోయినా.. కడుపులో పెట్టుకొని కాపాడేవాడే నాన్న!-happy fathers day 2022 this is why father a superhero ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Father's Day | కడుపున మోయకపోయినా.. కడుపులో పెట్టుకొని కాపాడేవాడే నాన్న!

Happy Father's Day | కడుపున మోయకపోయినా.. కడుపులో పెట్టుకొని కాపాడేవాడే నాన్న!

Manda Vikas HT Telugu
Jun 19, 2022 07:33 AM IST

తండ్రి ఒక పెద్ద నాయకుడైనా లేదా చిన్న చిరుద్యోగైనా అతడి బిడ్డలకు ఆయనెప్పుడూ ఒక సూపర్ హీరోనే. బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ధారపోసే తండ్రి త్యాగాలను గుర్తించేందుకు ప్రతీ ఏడాది జూన్ 19న Father's Day గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ..

<p>Happy Fathers Day&nbsp;</p>
<p>Happy Fathers Day&nbsp;</p>

Father's Day 2022 | ప్రపంచంలో అందరికీ అమ్మ అంటే ప్రేమ ఉంటుంది. కానీ నాన్న మీద ప్రేమతో పాటు విపరీతమైన గౌరవం కూడా ఉంటుంది. నడక నేర్పించడం దగ్గర్నించీ నడత నేర్పించడం వరకు తన బిడ్డలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం నాన్నకు ఎంతో ముఖ్యం.

నాన్న కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించవచ్చు, కటువుగా మాట్లాడవచ్చు అయినా తన ప్రేమ బయటకు కనిపించనిది, వెలకట్టలేనిది. తన కొడుకైనా, కూతురైనా 'నా బిడ్డ' అనే గర్వం ప్రతి తండ్రిలోనూ ఉంటుంది. తన బిడ్డల కోసం ఆయన కనిపించని ఎన్నో త్యాగాలు చేస్తాడు. వారి భవిష్యత్తు గురించే నిరంతరం ఆలోచనలు చేస్తూ బంగారు కలలు కంటాడు.

నాన్నంటే ఒక ధైర్యం, నాన్న అంటే ఒక భరోసా. నాన్నతో ఉంటే ఒక సూపర్ హీరోతో ఉన్నట్లే. నిజానికి అమ్మాయిలకు తండ్రే తమ మొదటి హీరో. ఏ తండ్రయినా కొడుకు విషయంలో కొంత కఠినంగా వ్యవహరిస్తాడేమో గానీ తన కూతురు విషయంలో మాత్రం ఎవరూ ఏమన్నా అస్సలు సహించడు. తన కూతురులోనే ఆయన తన తల్లిని చూసుకుంటాడు. అమితమైన ప్రేమను కురిపిస్తాడు. తనను అల్లారు ముద్దుగా గుండెల మీద ఎత్తుకొని పెంచుతాడు. కూతురు పెద్దయ్యాక తనకూ ఏ కష్టం రాకూడదని అన్ని విధాల తగినవాడి కోసం చూసి పెళ్లి చేసి పంపిస్తాడు. తన కూతురు తన నుంచి విడిపోయే క్షణం ఆ తండ్రి అనుభవించే బాధ, భావోద్వేగం ఎవరూ అనుభవించరు.

ఇక కొడుకు విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడు. కొడుకు ఉన్నతంగా ఎదిగేందుకు తన శక్తికి మించి శ్రమిస్తాడు. ఉన్నతంగా ఎదిగిన తన కొడుకును చూసి ఎంతో గర్వపడతాడు. అందరికీ తన కొడుకు గురించే చెప్పుకుంటాడు. కొడుకు విజయాల్లోనే తన విజయాలు చూసుకొని మురిసిపోతాడు.

 ఒక తల్లిలా తండ్రి నవమాసాలు మోసి కనకపోవచ్చు, కానీ తన బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాడు. కడదాకా తోడుంటాడు.

ఆ త్యాగాలమూర్తి త్యాగాలను గుర్తుచేసుకునేందుకు, తండ్రి ఔన్నత్యాన్ని చాటేందుకు ప్రతి ఏడాది జూన్ 19న 'ఫాదర్స్ డే' గా నిర్వహిస్తారు. తమ పిల్లల కోసం పరితపించే తండ్రులందరికీ హిందూస్తాన్ టైమ్స్ - తెలుగు చేస్తుంది ప్రణామం. అలాంటి తండ్రులందరికీ ఈ స్టోరీ అంకితం. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!

సంబంధిత కథనం

టాపిక్