Gongura Curry: గోంగూర వంకాయ కర్రీ ఇలా వండారంటే ఒక్క ముద్ద కూడా మిగలదు
Gongura Curry: కొన్ని రకాల కాంబినేషన్లు చాలా టేస్టీగా ఉంటాయి. అలాంటి వాటిలో గోంగూర వంకాయ కాంబినేషన్ ఒకటి. ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.
Gongura Curry: గోంగూర వంకాయ కాంబినేషన్ ఏమిటి అనుకోవచ్చు. నిజానికి ఈ రెండింటి కాంబినేషన్లో కూర చాలా టేస్టీగా వస్తుంది. ఇగురు కూడా అధికంగా వస్తుంది. అన్నంలో ఎక్కువ కలుస్తుంది. ఒకసారి వండుకుంటే రెండు పూటలకు సరిపడినంత కూర వస్తుంది. దీన్ని తయారు చేయడం చాలా సులువు. ఒకసారి ఈ కూరను వండుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోరు చప్పగా అనిపించినప్పుడు ఈ కూర వండుకుంటే కొత్తగా రుచిగా అనిపిస్తుంది.
గోంగూర వంకాయ రెసిపీకి కావలసిన పదార్థాలు
గోంగూర - ఒక కట్ట
నూనె - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
టమాటాలు - రెండు
వంకాయలు - పావు కిలో
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
పచ్చిమిర్చి - మూడు
పసుపు - పావు స్పూను
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
గోంగూర వంకాయ కర్రీ రెసిపీ
1. గోంగూర ఆకులను ఏరి కడిగి ఆరబెట్టుకోవాలి.
2. ఈ కూరకు తెల్ల వంకాయ లేదా నల్ల వంకాయ ఏది తీసుకున్నా మంచిదే, కానీ అవి లేతగా ఉండేలా చూసుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో గోంగూరను వేసి వేయించాలి.
4. అవి మెత్తగా అయ్యి నీరంతా ఇంకిపోయే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
5. ఇప్పుడు ఆ గోంగూరను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
6. ఇప్పుడు మరో కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
7. అందులో ఆవాలు, జీలకర్ర వంటి తాళింపు దినుసులు వేసి వేయించాలి.
8. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి.
9. ఇవి వేగాక టమాటా ముక్కలను వేసి వేయించుకోవాలి.
10. టమాటాలు మెత్తగా అయ్యేవరకు మగ్గించాలి. తర్వాత లేత వంకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
11. ఈ మిశ్రమంలో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
12. మూత పెట్టి చిన్న మంట మీద ఉంచితే ఇది త్వరగా మగ్గుతుంది.
13. వంకాయలు మెత్తగా మగ్గాక ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి.
14. తర్వాత పసుపు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.
15. రుచికి సరిపడా ఉప్పును వేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉంచితే టేస్టీగా ఉడుకుతుంది.
16. అవసరమైతే కాస్త నీటిని వేసుకోవచ్చు. ఇది ఇగురు లాగా అయ్యాక స్టవ్ కట్టేయాలి.
17. అంతే గోంగూర వంకాయ కర్రీ రెసిపి రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.
గోంగూర వంకాయ రెసిపీ చాలా తక్కువ మంది రుచి చూసి ఉంటారు. ఒకసారి మీ ఇంట్లో వండి చూడండి. ఎక్కువ అన్నంలో తక్కువ కూర కలవడం దీని స్పెషాలిటీ. ఒకసారి వండుకుంటే రెండు పూటలకే సరిపోతుంది. బ్యాచిలర్స్ కు ఇది సరైన కూర ఇందులో గోంగూర, టమాటాలు, వంకాయలు అన్నింట్లోనే నిండుగా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
టాపిక్