Gongura Prawns Pickle: నెల రోజులు నిల్వ ఉండేలా గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి, దీని రెసిపీ చాలా సులువు-gongura prawns pickle recipes in telugu know how to make this pachadi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Prawns Pickle: నెల రోజులు నిల్వ ఉండేలా గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి, దీని రెసిపీ చాలా సులువు

Gongura Prawns Pickle: నెల రోజులు నిల్వ ఉండేలా గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి, దీని రెసిపీ చాలా సులువు

Haritha Chappa HT Telugu
Sep 30, 2024 11:30 AM IST

Gongura Prawns Pickle: గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే రొయ్యల పికెల్ కూడా నచ్చుతుంది. ఈ రెండింటినీ కలిపి చేసే గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి కూడా అదిరిపోతుంది. రెసిపీ చాలా సులువు.

గోంగూర రొయ్యల పచ్చడి
గోంగూర రొయ్యల పచ్చడి

Gongura Prawns Pickle: గోంగూర పచ్చడి పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక రొయ్యల పికెల్ చూస్తే తినకుండా ఉండలేం. ఈ రెండింటిని కలిపి చేసే గోంగూర రొయ్యల పికెల్ రుచి అదిరిపోతుంది. దీన్ని చాలా సులువుగా వండేయచ్చు. ఒకసారి చేసుకుంటే నెల రోజుల పాటూ తాజాగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

గోంగూర రొయ్యల నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు

గొంగూర - మూడు కట్టలు

రొయ్యలు - అరకిలో

నూనె - ఒక కప్పు

వెల్లుల్లి రెబ్బలు - పది

ఎండు మిర్చి - నాలుగు

కరివేపాకులు - గుప్పెడు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి

1. గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి. తడి లేకుండా ఫ్యాను కిందే ఆరబెట్టండి.

2. రొయ్యలను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టండి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో గోంగూర ఆకులను వేసి బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

5. మరొక స్పూను వేసి ఆ నూనెలో రొయ్యలను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు కళాయిలో నూనె వేయాలి. నూనెలో కరివేపాకులు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.

7. ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను మిక్సిలో వేసి మెత్తగా రుబ్బి ఆ మిశ్రమాన్ని కళాయిలోని మిశ్రమంలో వేసి వేయించాలి.

8. చిన్న మంట మీద వేయిస్తూ ఉండాలి. అందులోనే ముందుగానే వేయించిన రొయ్యలను వేసి కలుపుకోవాలి.

9. అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.

10. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. నూనె తేలుతున్నట్టు కనిపించాక స్టవ్ ఆఫ్ చేయాలి.

11. గాలి చొరబడని డబ్బాలో వేసి దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ఇది తాజాగా నెల రోజుల పాటూ ఉంటుంది.

వేడి వేడి అన్నంలో గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి వేసి కలుపుకుంటే ఆ రుచి అదిరిపోతుంది. గోంగూరలో ఎన్నో అత్యవసర పోషకాలు ఉంటాయి. గోంగూరలో ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లావిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుము, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గోంగూర తినడం వల్ల రేచీకటి సమస్య రాదు. రొయ్యలు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. రొయ్యల్లో సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. దీనిలో జింక్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. రొయ్యలు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.