Prawns Fried Rice: రొయ్యల ఫ్రైడ్ రైస్ రెసిపీ, దీన్ని వండడం చాలా సులువు
Prawns Fried Rice: రొయ్యలంటే ఇష్టపడే వారికి ఈ రొయ్యల ఫ్రైడ్ రైస్ రెసిపీ కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని పిల్లలు ఇష్టంగా తింటారు. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
Prawns Fried Rice: రొయ్యలు... చెరువులు, సముద్రాలలో లభిస్తాయి. వీటిని ఎంత తిన్నా బరువు పెరగరు. ఆరోగ్యానికి ఇవి చేసే మేలు ఎంతో. కాబట్టి వారానికి ఒకసారి అయినా రొయ్యలతో వండిన రెసిపీలను ప్రయత్నించండి. ఇక్కడ మేము రొయ్యల ఫ్రైడ్ రైస్ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. ముఖ్యంగా పిల్లలకు ఇది కచ్చితంగా తీరుతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా దీన్ని పెట్టవచ్చు. చిన్న చిన్న రొయ్యలతో వండితే పిల్లలు దీన్ని ఇష్టంగా తినే అవకాశం ఉంది. ఈ రొయ్యల ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలాగో చూడండి.
ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - అరకిలో
బాస్మతి బియ్యం - అర కిలో
పసుపు - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
పచ్చిమిర్చి పేస్ట్ - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
కరివేపాకు - గుప్పెడు
సోయాసాస్ - ఒక స్పూన్
నూనె - తగినంత
గుడ్లు - రెండు
ఉల్లిపాయ - రెండు
క్యారెట్ తురుము - అరకప్పు
బీన్స్ తురుము - అరకప్పు
ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెసిపీ
1. క్యారెట్, బీన్స్ వంటి వాటిని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి.
2. వాటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
3. నీటిని వడకట్టి వాటిని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టి ఆమ్లెట్ లా వేసుకోవాలి.
5. ఆ ఆమ్లెట్ ను ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు రొయ్యలు ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి నీరు వేయాలి. వాటిని కాసేపు ఉడికించుకోవాలి.
7. దాదాపు రొయ్యలు 90% ఉడికిపోయే వరకు ఉంచుకోవాలి.
8. ఇప్పుడు అన్నాన్ని పొడిపొడిగా వచ్చేలా వండి పెట్టుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
10. నూనె వేడెక్కాక నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
11. అది రంగు మారేవరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి కలుపుకోవాలి.
12. అందులోని ముందుగా ఉడకబెట్టిన రొయ్యలను వేసి బాగా కలుపుకోవాలి.
13. పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేయాలి. ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్ కూడా వేసి బాగా కలపాలి.
14. ముందుగా ఉడకబెట్టిన క్యారెట్, బీన్స్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
15. ఈ మిశ్రమం బాగా వేగాక వండిన అన్నాన్ని వేసి కలపాలి.
16. అలాగే ఆమ్లెట్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. పైన కొత్తిమీరను చల్లుకోవాలి.
17. అంతే టేస్టీ రొయ్యల ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. దీని పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా వినియోగించవచ్చు.
రొయ్యల ఫ్రైడ్ రైస్ చేయడానికి పెద్ద రొయ్యలను తీసుకోకూడదు. చిన్నది లేదా మీడియం సైజులో ఉన్న రొయ్యలను తీసుకుంటే మంచిది. ఇందులో అన్ని దాదాపు ఉడికించి చేశాము. కాబట్టి పోషకాలు బయటికి పోకుండా అందులోనే ఉంటాయి. వీటిలో నూనెలో డీప్ ఫ్రై చేసిన పద్ధతి పాటించలేదు. కాబట్టి ఈ రెసిపీ ఆరోగ్యకరమైనదని చెప్పుకోవాలి. రొయ్యలు తినడం వల్ల మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి వారానికి ఒకసారి అయినా రొయ్యలను తినడం అలవాటు చేసుకోవాలి.