Gongura Chicken Pachadi: టేస్టీగా గోంగూర చికెన్ నిల్వ పచ్చడి, ముక్క మెత్తగా వచ్చేలా చేసుకోండి, నెల పాటు నిల్వ ఉంటుంది-gongura chicken nilva pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Chicken Pachadi: టేస్టీగా గోంగూర చికెన్ నిల్వ పచ్చడి, ముక్క మెత్తగా వచ్చేలా చేసుకోండి, నెల పాటు నిల్వ ఉంటుంది

Gongura Chicken Pachadi: టేస్టీగా గోంగూర చికెన్ నిల్వ పచ్చడి, ముక్క మెత్తగా వచ్చేలా చేసుకోండి, నెల పాటు నిల్వ ఉంటుంది

Haritha Chappa HT Telugu
Sep 11, 2024 11:30 AM IST

Gongura Chicken Pachadi: చికెన్ పికిల్ గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడూ చికెన్ పికిల్ ఒకటే కాదు, గోంగూరను కూడా జోడించి తిని చూడండి... ఎంత టేస్టీగా ఉంటుందో. ఇక్కడ మేము గోంగూర చికెన్ నిల్వ పచ్చడి రెసిపీ ఇచ్చాము.

గోంగూరు చికెన్ నిల్వ పచ్చడి రెసిపీ
గోంగూరు చికెన్ నిల్వ పచ్చడి రెసిపీ

Gongura Chicken Pachadi: గోంగూర పచ్చడి పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. అలాగే చికెన్ పచ్చడి గుర్తుకు వచ్చినా కూడా తినాలన్న కోరిక పుడుతుంది. ఇక చికెన్, గోంగూర కలిపి చేసే నిల్వ పచ్చడి తిన్నారంటే జీవితంలో మర్చిపోలేరు. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారు. దీని రుచి అంత బావుంటుంది. చికెన్ గోంగూర చికెన్ నిల్వ పచ్చడి కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో మేము ఇక్కడ ఇచ్చాము. ఇలా చేస్తే ముక్క మెత్తగా ఉంటుంది, రుచిగాను ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

గోంగూర చికెన్ నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

గోంగూర - మూడు కట్టలు

చికెన్ - అరకిలో

పల్లీల నూనె - కప్పున్నర

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఐదు స్పూన్లు

లవంగాలు - నాలుగు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

ధనియాలు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూను

మెంతులు - పావు స్పూను

చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో

పసుపు - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు స్పూన్లు

వేడి నీరు - పావు కప్పు

గోంగూర చికెన్ నిల్వ పచ్చడి రెసిపీ

1. గోంగూర చికెన్ నిల్వ పచ్చడి చేయడానికి ముందుగా మూడు గోంగూర కట్టలను తీసుకోవాలి.

2. వాటి ఆకులను ఏరి శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి.

3. తడి లేకుండా చూసుకోవాలి, లేకుంటే పచ్చడి ఎక్కువకాలం నిల్వ ఉండదు.

4. గోంగూర ఆకులు తడి ఆరిపోయాక సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పల్లీల నూనె వేయాలి.

6. ఈలోపు ఒక చిన్న కప్పులో చింతపండును వేసి వేడి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి.

7. చల్లని నీళ్లు వేస్తే పచ్చడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి వేడి నీళ్లు వేసుకోవాలి.

8. చిన్న టీ గ్లాసు వేడి నీళ్లు వేస్తే సరిపోతుంది.

9. స్టవ్ మీద పెట్టిన కళాయిలో నూనె వేడెక్కాక గోంగూర ఆకులను వేసి వేయించుకోవాలి.

10. అవి సగం వేగాక ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి వేయించాలి.

11. ఇదంతా చిక్కగా జిగురులాగా అయ్యేవరకు వేయించుకోవాలి.

12. అవసరమైతే పల్లీల నూనె మరింత వేసుకోవాలి.

13. ఒక టీ గ్లాసు నిండా పల్లీల నూనె వేసుకొని గోంగూరని వేయించుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.

14. స్టవ్ మీద మరొక కళాయి పెట్టి అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి.

12. ఇతర మసాలా దినుసులు వేయాల్సిన అవసరం లేదు.

13. ఈ మొత్తాన్ని మిక్సీ జార్లో పొడిచేసి ఆ మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి.

14. ఇప్పుడు అదే కళాయిలో ఒక టీ గ్లాసు నిండా పల్లీల నూనె తీసుకొని వేయాలి.

15. అది వేడెక్కాక శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను అందులో వేసి వేయించుకోవాలి.

16. ఒక స్పూను పసుపు, ఒక స్పూను ఉప్పు వేసి చికెన్ ముక్కలను వేయించాలి.

17. చికెన్‌లోంచి నీరు దిగి ఆ నీరు ఇంకిపోయి నూనె తేలే వరకు వేయించుకోవాలి.

18. అలా వేయించుకున్నాక ముందుగా చేసుకున్న మసాలా పొడిని వేసి కలుపుకోవాలి.

19. అలాగే అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి.

20. చికెన్ వేడి తగ్గాక గోరువెచ్చగా మారాక ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని, కారాన్ని, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.

21. ముందే ఒక స్పూన్ ఉప్పు వేశాము, కాబట్టి మరొక ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేస్తే సరిపోతుంది.

22. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపాక ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర పేస్టును కూడా ఇందులో వేసి బాగా కలపాలి.

23. అంతే టేస్టీ గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయినట్టే.

ఈ పచ్చడిలో కొంతమంది చింతపండును వాడతారు. మరికొందరు చింతపండుకు బదులు నిమ్మరసాన్ని వాడతారు. ఏది వాడాలన్నది మీ ఇష్టమే. వేడి వేడి అన్నంలో ఈ చికెన్ గోంగూర చికెన్ పచ్చడి కలుపుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని గాజు సీసాలో వేసి మూత పెట్టి ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు నెలలైనా తాజాగా ఉంటుంది.

గోంగూర, చికెన్ రెండిట్లోనూ పోషకాలు ఎక్కువే. గోంగూర నుండి మనకి విటమిన్ సి లభిస్తే, చికెన్ నుండి ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. ప్రతిరోజు రెండు ముద్దలు ఈ చికెన్ నిల్వ పచ్చడితో తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. కారంగా కావాలనుకునేవారు కారప్పొడిని మరి కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. బోన్ లెస్ చికెన్ లేదా బోన్ తో ఉన్న చికెన్ ఎలా అయినా దీన్ని చేసుకోవచ్చు.

Whats_app_banner